సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వాహనాల సిలిండర్లలో వంట గ్యాస్ నిండుతోంది. గ్రేటర్ పరిధిలో అక్రమ రీఫిల్లింగ్ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జనావాసాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు నామమాత్రపు చర్యలతో సరిపెడుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఎల్పీజీ గ్యాస్ స్టేషన్లలో గ్యాస్‌కు కొరత లేనప్పటికీ వాహనదారులు మాత్రం డొమెస్టిక్ గ్యాస్‌పైనే ఆసక్తి చూపుతున్నారు. అధికారిక స్టేషన్లలో నింపే ఎల్పీజీ కంటే డొమెస్టిక్ గ్యాస్ మందంగా ఉండటంతోపాటు మైలేజీ అధికంగా వస్తుండటం, ధర కూడా తక్కువ ఉండటం ఇందుకు కారణం. దీంతో నగరంలో అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. నిత్యం ఆయా కేంద్రాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇందులో ఆటోలు అధికంగా ఉండటం విశేషం.
ధరలు మంటే కారణం..
పెట్రోల్, డీజిల్ ధరలు మండుతుండటంతో చౌక గ్యాస్ వినియోగంపై వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు చక్రాల వాహనదారులు కొందరు అధికారికంగా అనుమతి తీసుకొని వాహనాల ట్యాంకుల మార్చుకుంటుండగా మరి కొందరు అనధికారికంగా మార్పిడి చేసుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు ఎల్పీజీ, సీఎన్‌జీల కంటే చౌకగా లభిస్తుండటంతో డొమెస్టిక్ గ్యాస్‌పై మక్కువ చూపుతున్నారు.
రెండు లక్షలకు పైనే..
మహా నగరంలో వాహనాల సంఖ్య 52 లక్షలకు పైగా ఉండగా అందులో సుమారు రెండు లక్షల వాహనాలు గ్యాస్‌ను వినియోగిస్తున్నాయి. ఆటో గ్యాస్, లిక్విడ్ గ్యాస్‌కు కొరత లేకపోయినా సీఎన్‌జీ గ్యాస్ సరఫరా సక్రమంగా లేదు. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతి రోజు 5000 ఆటోలు, 1000 వరకు నాలుగు చక్రాల వాహనాలు వస్తాయి. ఆటోల సీఎన్జీ కిట్స్ సామర్ధ్యం 4.5 కిలోలు కాగా, 4 కిలోల వరకు, కార్ల సామర్థ్యం 10కిలోలు కాగా, 8 కిలోల వరకు గ్యాస్‌ను నింపుతారు. ఈ నేపథ్యంలో ఒక్కో స్టేషన్‌కు రోజూ 6వేల కిలోవరకు గ్యాస్ డిమాండ్ ఉంటుంది. వాహనాల గ్యాస్ ధర నిలకడగా ఉన్నప్పటికీ డొమెస్టిక్ గ్యాస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment