నగదు ‘బదిలీ'..భారమే!
నగదు బదిలీ పథకం.. ఆ పేరు వింటేనే జిల్లాలో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇన్నాళ్లూ సబ్సిడీ ధర చెల్లించి వంటగ్యాస్ రీఫిల్లింగ్ పొందిన వారు ఈ ప్రక్రియ అమలైతే అదనపుభారం మోయకతప్పదు. నగదు జమతో ప్రతి వినియోగదారుడిపై వ్యాట్ రూపేణా అదనంగా రూ.23 పడనుంది.
ఇదిలాఉండగా, జిల్లాలో గతేడాది నగదు బదిలీ అమలైన సందర్భంలో బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమకాకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను గుర్తుచేసుకుని మరింత ఆందోళనకు గురవుతున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నగదు బదిలీ పథకం వినియోగదారులకు భారంగా మారనుంది. ఈ పథకం అమలైతే గ్యాస్ రీఫిల్లింగ్ సిలిండర్‌కు సబ్సిడీయేతర ధర రూ.972 చెల్లించి వినియోగదారుడు తీసుకోవాలి. అనంతరం సబ్సిడీ రూ.444 పోనూ వారి బ్యాంకుఖాతాలో ప్రభుత్వం రూ.504నగదు జమచేస్తుంది. ఇంకా వ్యాట్‌రూపంలో ప్రభుత్వం విధించే రూ.23ను వినియోగదారుడే చెల్లించాలి.
అంటే సబ్సిడీ కంటే అదనంగా ఈ భారం పడనుంది. ఈ ధర స్థిరంగా కొనసాగుతుందని అనుకోవడానికీ వీల్లేదు. అంతర్జాతీయ మార్కెట్ డాలర్‌ను అనుసరించి ఓ మారు పెరుగుతూ.. మరోమారు తగ్గుతూ ఉం టుంది. దీనిని బట్టి వ్యాట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముందు నగదు చెల్లించి తీసుకునే రీఫిల్లింగ్ ధర కూడా పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది.
4.38లక్షల మందిపై భారం
జిల్లా వ్యాప్తంగా ఇండియన్, భారత్, హెచ్‌పీ కంపెనీలకు సంబంధించి 4.38లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నగదు బదిలీ అమలైతే జిల్లా వాసులపై ప్రతినెలా రూ.10.95లక్షల భారం పడనుంది. వీరిలో 90శాతం మంది వినియోగదారులు సామాన్యులే.
పైగా వీరిలో బ్యాంక్ ఖాతాల్లేని వారు ఎంతోమంది ఉన్నారు. గతేడాది జిల్లాలో నగదు బదిలీ అమలైన సందర్భంలో చాలామందికి బ్యాంక్‌ఖాతాలో సబ్సిడీ జమకాక నానాపాట్లు పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఇబ్బందులను మరువకముందే నగదు బదిలీ ప్రక్రియ వారిలో ఆందోళన కలిగిస్తోంది.
జనవరి నుంచి అమలు
నగదు బదిలీ జిల్లాలో జనవరి నుంచి అమలుకానుంది. మొ దటి విడతగా తెలంగాణ రాష్ట్రంలో మూడు జిల్లాల్లో అమలుచేసే ప్రభుత్వం రెండోవిడతగా జనవరిలో జిల్లాలో అమలుచేయనుంది. ఇందుకుగాను గ్యాస్ వినియోగదారులకు సం బంధించి ఆధార్, బ్యాంక్ ఖాతాల నెంబర్లను సేకరించే పని లో అధికారులు, గ్యాస్ డీలర్లు బిజీగా నిమగ్నమయ్యారు.