regestration
-
‘ఆహార’ బిల్లుల్లో లైసెన్స్ నంబరు తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆహార వ్యాపార సంస్థలు ఇకపై తమ ఇన్వాయిస్లు, బిల్లుల్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు నంబరు లేదా రిజిస్ట్రేషన్ నంబరును తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉంటుంది. అక్టోబర్ 2 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట సమాచారం లేకపోవడం వల్ల చాలా మటుకు ఫిర్యాదులు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. తాజా పరిణామంతో నిర్దిష్ట ఎఫ్ఎస్ఎస్ఏఐ సంఖ్యతో ఆహార వ్యాపార సంస్థపై వినియోగదారులు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడానికి వీలవుతుందని తెలిపింది. ‘‘లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ అధికారులు ఈ విషయానికి విస్తృతంగా ప్రచారం కల్పించాలి. అక్టోబర్ 2 నుంచి కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి’’ అని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఆహార వ్యాపార వ్యవస్థ చాలా భారీగా ఉంటుందని, ఆపరేటర్లకు కేటాయించే 14 అంకెల ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబరు అంత సులభంగా కనిపించకపోవచ్చని, అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది. ఫలితంగా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలంటే వినియోగదారుకు చాలా కష్టసాధ్యంగా ఉంటుందని పేర్కొంది. నియంత్రణ సంస్థలు సైతం సదరు ఫిర్యాదు మూలాలను గుర్తించి, సత్వరం పరిష్కరించడానికి సాధ్యపడటం లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ప్రస్తుతం ప్యాకేజ్డ్ ఆహార ఉత్ప్తతులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబరును తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటున్నప్పటికీ.. రెస్టారెంట్లు, మిఠాయి షాపులు, కేటరర్లు, రిటైల్ స్టోర్స్ వంటివి పాటించడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ప్లాస్టిక్ నోట్లతో రిజిస్ట్రేషన్
శంకర్పల్లి : రిజిస్ట్రేషన్ చేసుకొని చిన్నపిల్లలు ఆడుకొనే నోట్లు ఇచ్చి పారిపోయిన సంఘటన శంకర్‌పల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా బంటారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు కడుచర్ల అంజిలయ్య తండ్రి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అంజిలయ్య తనకు శంకర్పల్లి మండల పరిధిలోని మహాలింగపురం గ్రామంలో మూడు వందల గజాల ప్లాటు ఉంది. ఆ ప్లాటును హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి బంటారం మండలం నూర్లంపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి మధ్యవర్తిగా ఉండి విక్రయించారు. బుధవారం రోజు స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్లాటు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బయటకొచ్చిన తరువాత రూ1.50 లక్షల డబ్బులు ఇవ్వగా ఆ నోట్లను లెక్కిస్తున్నారు. మధ్యలో కొన్ని చిన్నపిల్లలు ఆడుకొనే ప్లాస్టిక్ నోట్లు ఉన్నాయని గుర్తించారు. వెంటనే శ్రీనివాస్‌ను నిలదీయగా ఇచ్చిన లక్షన్నరలో లక్ష రూపాయల రెండు వేల నోట్లు లాక్కొని కారులో పారిపోయాడు. మిగతా రూ. 50 వేలకు ప్లాస్టిక్ నోట్లు ఉన్నాయి. డబ్బులను లాక్కొని పారిపోతుండగా వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే బాధితుడు చుట్టుపక్కల వారిని పిలిచి జరిగిన విషయాన్ని వివరించాడు. శ్రీనివాస్ ఇచ్చిన నోట్లపై రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియాకు బదులు భారతీయ మనోరంజన్ బ్యాంక్ అని దాని పక్కనే పాంచ్ సౌ కూపన్ అని నోట్ల కింది భాగంలో పుల్ ఆఫ్ ఫన్ అని ముద్రించారు. బాధితుడు జరిగిన విషయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
స్వయం ఉపాధి కోర్సలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్
జలాల్పురం(భూదాన్‌పోచంపల్లి) : మండలంలోని జలాల్పురం గ్రామంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పలు ఉచిత స్వయం ఉపాధి శిక్షణా కోర్సుల్లో చేరుటకు గురువారం అన్లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎన్. కిషోర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలల కాల వ్యవధి గల ఆటోమోబైల్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ అండ్ మెయింటనెన్స్, ఎలక్ట్రిషియన్(డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్, వెల్డర్, గార్మెంట్ మేకింగ్, జూకీ మెషిన్ కోర్సులకు ఎస్సెస్సీ విద్యార్హత ఉండాలన్నారు. అలాగే ఇంటర్ విద్యార్హత కలిగిన వారు డీటీపీ అండ్ ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్, ట్యాలీ(కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్) కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కాగా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి గ్రామీణ విద్యార్థులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత హాస్టల్, భోజన వసతి కల్పించబడుతుందన్నారు. శిక్షణ పూర్తయిన తరువాత హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తప్పనిసరిగా ఉద్యోగ అవకాశం కల్పించబడుతుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్‌కార్డు, పాత రేషన్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్ ఫోటోలతో పాటు రూ.250ల రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం నేడు పై సర్టిఫికేట్లతో సంస్థలో హాజరుకావలన్నారు. ఇతర వివరాలకు 9948466111, 9133908111, 9133908222, 08685–205013 సెల్ నంబర్లను సంప్రదించాలన్నారు.