ఇక మహిళలకూ హెల్మెట్లు తప్పనిసరి
- గెజిట్ విడుదల చేసిన సర్కార్
- అమల్లోకి వచ్చిన ఆదేశాలు
న్యూఢిల్లీ: ద్విచక్రవాహనంపై వెనుక కూర్చొని ప్రయాణించే మహిళలూ ఇక తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని ఢిల్లీ ప్రభుత్వం గె జిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గెజిట్ విడుదలయిన వెంటనే ఆదేశాలు అమల్లోకివచ్చాయి. అయితే దీనిపట్ల ప్రజల్లో ఏమైనా అభ్యంతరాలున్నా, సూచనలన్నా సరిగ్గా 30 రోజుల్లో తమకు తెలియజేయాలని తెలిపింది. ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఎల్జీ ఆమోదించినా.. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అమలుకు ఢిల్లీ ఈసీ అనుమతి కోరింది ప్రభుత్వం. నిర్ణయంపై ముందుకు వెళ్లండన్న ఈసీ ప్రకటనతో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇక నుంచి వెనుక కూర్చొని ఉన్న మహిళలు హెల్మెట్ ధరించకపోయినా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తారని నోటిఫికేషన్ తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక... రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారి సంఖ్య అత్యధికంగా భారత్లోనే ఉన్నట్లు తెలిపింది. భారత్లో ఏటా 105,725 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, ఆ త రువాతి స్థానంలో చైనా, అమెరికా, రష్యాలున్నాయని వెల్లడించింది. ఢిల్లీ రవాణా శాఖ లెక్కల ప్రకారం 2012లో ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న 576 మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రతి రోజూ ఇద్దరు చనిపోతుండగా, వారిలో అత్యధికులు వెనుక కూర్చుని ప్రయాణిస్తున్న మహిళలలే అని తేలింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది. అయితే తలపై టోపీల్లాంటివి ధరించొద్దన్న సిక్కు సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం ఉందని ఢిల్లీ సిక్ గురుద్వారా నిర్వహణ కమిటీ, ఇతర సిక్కు సంస్థలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే.