Religious conflict
-
‘రజా అకాడమీ’ని నిషేధించాలి
నాగపూర్/పుణే: మహారాష్ట్రలోని పలు నగరాలు, పట్టణాల్లో హింసాకాండ చోటుచేసుకోవడంపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిపురలో జరిగిన మత కలహాలను నిరసిస్తూ ఇస్లామిక్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల సందర్భంగా అల్లరి మూకలు దుకాణాలపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ ఘటనలను వీహెచ్‌పీ జనరల్ సెక్రెటరీ మిలింద్ పరాండే ఆదివారం ఖండించారు. అల్లర్లకు కారణమైన ‘రజా అకాడమీ’ అనే ఇస్లామిక్ సంఘాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లరి మూకలపై తాము పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశామని అన్నారు. రాళ్లు రువ్వినవారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఒకవేళ పోలీసులు స్పందించకపోతే తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో త్వరలో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలుస్తామన్నారు. అల్లర్లలో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించా లని మహారాష్ట్ర సర్కార్‌కి మిలింద్ పరాండే విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలపైనా ఆయన మాట్లాడారు. భారత్ 2014లో సాంస్కృతిక స్వాతంత్య్రం పొందిందని చెప్పారు. -
కోర్టు ప్రాంగణాల్లో మతపరమైన కార్యకలాపాలొద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల ప్రాంగణాల్లో న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు ఎలాంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించకుండా చూడాలని ఇరు రాష్ట్రాల జిల్లా జడ్జీలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. కొందరు న్యాయవాదులు అనుమతులు తీసుకోకుండానే కోర్టు ప్రాంగణాల్లో మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ సర్క్యులర్ జారీ చేశామని హైకోర్టు పేర్కొంది. సర్క్యులర్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. -
కేంద్ర మాజీ మంత్రి యత్నాల్ అరెస్ట్
మత ఘర్షణ కేసు .. 26న బీజాపురలో విజయోత్సవ ర్యాలీ నేపథ్యంలో అల్లర్లు యత్నాల్, అతని అనుచరులే కారణమని గుర్తించిన పోలీసులు వారిపై పలు కేసులు మహారాష్ర్టలో తలదాచుకున్న నిందితుల అరెస్ట్ బెంగళూరు, న్యూస్‌లైన్ : పధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజాపురలో ఈ నెల 26న జరిగిన మత ఘర్షణకు కారణమంటూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బసవనగౌడ పాటిల్ యత్నాల్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఐజీపీ భాస్కర్‌రావు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు .. మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజాపురలో 26న బసవనగౌడ పాటిల్ యత్నాల్ నే తృత్వంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. గాంధీ చౌక్ నుంచి బసవేశ్వర సర్కిల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. అయితే మార్గ మధ్యలో ఒక మార్కెట్ దగ్గర ఒక వర్గం వారితో బీజేపీ నేతలు గొడవ పడ్డారు. అది కాస్త మత ఘర్షణకు దారితీసింది. ఆస్తి నష్టం చాలా జరిగింది. ఈ అల్లర్లకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని క్లిప్పింగ్గులను పోలీసు అధికారులు పరిశీలించారు. ఓ వర్గం వారిని యత్నాల్, అతని అనుచరులు రెచ్చగొట్టడం వల్లే ఈ అల్లర్లు జరిగాయని గుర్తించారు. పలువురు ఫిర్యాదు చేయడంతో యత్నాల్, అతని ఐదుగురు అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీన్ని గుర్తించిన యత్నాల్ అనుచరుల సహా పరారై.. మహారాష్ట్ర కోల్లాపురలోని ఓరియంటల్ హోటల్ తప్పుడు సమాచారం ఇచ్చి తలదాచుకున్నారు. విషయాన్ని గుర్తించిన పోలీసులు యత్నాల్, అతని ఐదుగురు అనుచరులను బీజాపుర డీఎస్పీ బాలరాజ్ నే తృత్వంలో బుధవారం అరెస్ట్ చేశారు. వారందనీ బీజాపురలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని ఐజీపీ భాస్కర్‌రావు తెలిపారు. ఇప్పటికీ బీజాపురలో నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయని చెప్పారు. -
కఠినంగా శిక్షిస్తాం: మన్మోహన్ సింగ్
ముజఫర్‌నగర్: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలకు కారకులైనవారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మన్మో హన్‌సింగ్ చెప్పారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు కేంద్రం తరఫున పూర్తి సహాయం అందిస్తామన్నారు. అల్లర్ల సమయంలో సొంత ప్రాంతాలను వీడి వెళ్లిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల ఘర్షణలతో అట్టుడికిన ముజఫర్‌నగర్ జిల్లాలో సోమవారం ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించారు. ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు అందరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. తొలుత ముజఫర్‌నగర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో నిరాశ్రయులైన ముస్లింల కోసం ఏర్పాటు చేసిన బస్సీ క్యాంపును వీరు సందర్శించారు. అనంతరం జాట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న బవాలీ, ఖాంజ్పురా గ్రామాలకు వెళ్లి అల్లర్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా తమకు రక్షణ కరువైందని, ఇక సొంతూళ్లకు వెళ్లలేమని కుత్బి గ్రామానికి చెందిన 42 ఏళ్ల జమీల్ ప్రధాని ముందు కన్నీళ్లపర్యంతమయ్యారు. అనంతరం ప్రధాని విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇక్కడ చోటుచేసుకున్న అల్లర్లు బాధాకరం. ఘర్షణలకు కారణమైనవారిని కఠినంగా శిక్షిస్తాం. సొంతూళ్లను వదిలేసి వెళ్లినవారికి భద్రతపై భరోసా కల్పించాలి. వారు తిరిగివచ్చేందుకు కృషి చేయడమే మా తొలి ప్రాధాన్యం’’ అని చెప్పారు. ప్రధాని, సోనియా, రాహుల్ వెంట రాష్ట్ర గవర్నర్ బీఎల్ జోషి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఆర్పీఎన్ సింగ్ తదితరులున్నారు. ఈనెల 7న ముజఫర్‌నగర్ జిల్లాలో మొదలైన ఘర్షణల్లో ఇప్పటిదాకా పలుచోట్ల 48 మంది మరణించగా, 40 వేల మంది నిరాశ్రయులయ్యారు. పర్యటనపై పార్టీల మండిపాటు ముజఫర్‌నగర్‌లో ప్రధాని పర్యటనపై బీజేపీ, ఎస్పీ, బీఎస్పీలు మండిపడ్డాయి. కేంద్రం ముందుగానే మేల్కొని ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది కాదని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ‘‘ఈ ‘లౌకిక యాత్ర’ వల్ల బాధితులకు ఒరిగేదేమీ ఉండదు. వారి గాయాలను మాన్పదు’’ అని బీజేపీ ఉపాధ్యక్షుడు నఖ్వీ దుయ్యబట్టారు. ప్రధాని పర్యటన డ్రామా అని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు. ఎన్నికలు వస్తున్నందునే ప్రధాని ముజఫర్‌నగర్ వచ్చారని ఎస్పీ నేత అజాంఖాన్ విమర్శించారు.