కఠినంగా శిక్షిస్తాం: మన్మోహన్ సింగ్
ముజఫర్‌నగర్: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలకు కారకులైనవారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మన్మో హన్‌సింగ్ చెప్పారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు కేంద్రం తరఫున పూర్తి సహాయం అందిస్తామన్నారు. అల్లర్ల సమయంలో సొంత ప్రాంతాలను వీడి వెళ్లిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల ఘర్షణలతో అట్టుడికిన ముజఫర్‌నగర్ జిల్లాలో సోమవారం ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించారు. ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు అందరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. తొలుత ముజఫర్‌నగర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో నిరాశ్రయులైన ముస్లింల కోసం ఏర్పాటు చేసిన బస్సీ క్యాంపును వీరు సందర్శించారు. అనంతరం జాట్‌ల ప్రాబల్యం అధికంగా ఉన్న బవాలీ, ఖాంజ్‌పురా గ్రామాలకు వెళ్లి అల్లర్ల బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా తమకు రక్షణ కరువైందని, ఇక సొంతూళ్లకు వెళ్లలేమని కుత్బి గ్రామానికి చెందిన 42 ఏళ్ల జమీల్ ప్రధాని ముందు కన్నీళ్లపర్యంతమయ్యారు. అనంతరం ప్రధాని విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇక్కడ చోటుచేసుకున్న అల్లర్లు బాధాకరం. ఘర్షణలకు కారణమైనవారిని కఠినంగా శిక్షిస్తాం. సొంతూళ్లను వదిలేసి వెళ్లినవారికి భద్రతపై భరోసా కల్పించాలి. వారు తిరిగివచ్చేందుకు కృషి చేయడమే మా తొలి ప్రాధాన్యం’’ అని చెప్పారు. ప్రధాని, సోనియా, రాహుల్ వెంట రాష్ట్ర గవర్నర్ బీఎల్ జోషి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఆర్‌పీఎన్ సింగ్ తదితరులున్నారు. ఈనెల 7న ముజఫర్‌నగర్ జిల్లాలో మొదలైన ఘర్షణల్లో ఇప్పటిదాకా పలుచోట్ల 48 మంది మరణించగా, 40 వేల మంది నిరాశ్రయులయ్యారు.
పర్యటనపై పార్టీల మండిపాటు
ముజఫర్‌నగర్‌లో ప్రధాని పర్యటనపై బీజేపీ, ఎస్పీ, బీఎస్పీలు మండిపడ్డాయి. కేంద్రం ముందుగానే మేల్కొని ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది కాదని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ‘‘ఈ ‘లౌకిక యాత్ర’ వల్ల బాధితులకు ఒరిగేదేమీ ఉండదు. వారి గాయాలను మాన్పదు’’ అని బీజేపీ ఉపాధ్యక్షుడు నఖ్వీ దుయ్యబట్టారు. ప్రధాని పర్యటన డ్రామా అని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు. ఎన్నికలు వస్తున్నందునే ప్రధాని ముజఫర్‌నగర్ వచ్చారని ఎస్పీ నేత అజాంఖాన్ విమర్శించారు.