అల్లర్లు జరగటం దురదృష్టకరం: మన్మోహన్
ముజఫర్ నగర్ : అల్లర్లతో అట్టుడికి, ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటున్న ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సోమవారం పర్యటించారు. అల్లర్ల బాధితులు తలదాచుకుంటున్న బాసి కలాన్ సహాయక శిబిరాన్ని సందర్శించి, బాధితులతో మాట్లాడారు. వారిని ఓదార్చారు.
సహాయక శిబిరంలో వారికి అందుతున్న సహయ చర్యల గురించి వాకబు చేశారు. బాధితులను ఆదుకోవడానికి అవసరమైతే కేంద్ర సహాయం చేస్తుందని.. ప్రధాని మన్మోహన్‌సింగ్ వారికి హామీ ఇచ్చారు. ప్రశాంత వాతావరణం నెలకొనటానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలు సహకరిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు చెందిన బాధితులు ప్రధానికి తమ వినతి పత్రాలను అందజేశారు. తమపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు ముజఫర్‌నగర్ బాధితులను పరామర్శించడానికి ప్రధాని మన్మోహన్ రాష్ట్రానికి వస్తే... ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. బాధితులను పరామర్శించడాన్ని కూడా సీఎం రాజకీయం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ముజఫర్ నగర్లో హిందువుల్లోని జాట్ తెగకు ముస్లిం మతస్థుల మధ్య చోటు చేసుకున్న చిన్న సంఘటన చినికిచినికి గాలివానగా మారింది.ఆ ఘర్షణలో దాదాపు 48 మంది మరణించగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే.