remand extended
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్‌రావు రిమాండ్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తాజాగా ఈ కేసు వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 12 వరకు రిమాండ్ విధించిన అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావుకు సంబంధించి వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక, విచారణ సందర్భంగా తనను జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని రాధాకిషన్‌రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్‌ను సైతం కలవనీయడం లేదని తెలిపారు. దీంతో, పోలీసులను న్యాయమూర్తి పిలిపించి ప్రశ్నించారు. లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం, న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ కేసుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ పీపీను ప్రభుత్వం నియమించనుంది. పోలీసులు నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులను అరెస్టు చేశారు. మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పీపీని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను ఇంకోసారి పొడిగించింది ఏసీబీ కోర్టు. నవంబర్ 1వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణ సమయంలో తన ఆరోగ్యం, భద్రత గురించి జడ్జి ఎదుట చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు హాజరుపరిచారు అధికారులు. ఆ సమయంలో ఆరోగ్యం ఎలా ఉంది? అని చంద్రబాబును ఏసీబీ జడ్జి ఆరా తీశారు. అయితే తనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని ఆయన జడ్జికి చెప్పారు. దీంతో అధికారుల్ని జడ్జి వివరణ కోరారు. మెడికల్ టీం ఉందని, ఎప్పటికప్పుడు ఆయనకు వైద్యపరీక్షలు జరుపుతోందని అధికారులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. మెడికల్ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని జడ్జి ఆదేశిస్తూ.. చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించారు. మరోవైపు సెక్యూరిటీ విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పడంతో.. ఏమైనా అనుమానాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని కోర్టు సూచించింది. అలాగే చంద్రబాబు రాసే లేఖను సీల్ చేసి తనకు పంపాలని అధికారుల్ని జడ్జి ఆదేశించారు. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్‌యిన చంద్రబాబు రిమాండ్‌ను ఈ నెల 19 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. చంద్రబాబు రిమాండ్ మరో 14 రోజులు పొడిగిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దీంతో ఆయన మరో 14 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. ఇవాళ ఏసీబీ కోర్టు ముందుకు వర్చువల్‌గా చంద్రబాబు హాజరయ్యారు. కాగా, చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను రేపు మధ్యాహ్నానికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఇవాళ కూడా ఇరుపక్షాల వాదనలు హోరాహోరీగా సాగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు విచారణలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ACB Court)లో దర్యాప్తు సంస్థ తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కీలక ఆధారాలను సమర్పించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని ఏఏజీ వెల్లడించారు. చదవండి: స్కిల్ స్కాం కేసులో కీలక డాక్యుమెంట్ల సమర్పణ . -
మరో 11 రోజులు జైల్లోనే చంద్రబాబు
సాక్షి, కృష్ణా/తూర్పు గోదావరి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి రిమాండ్‌ను ఆదివారం విజయవాడ ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. అక్టోబర్ 05 తేదీ దాకా ఆయన రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ఏసీబీ జడ్జి.. తక్షణమే ఆయన్ని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆయన మరో 11 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. ఈ తరుణంలో రెండు రోజుల కస్టడీ విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు.. ఆదివారం సాయంత్రం వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టారు. చంద్రబాబు విచారణలో సహకరించలేదని.. అందుకే ఆయన రిమాండ్‌ను పొడిగించాలని మోమో దాఖలు చేసింది సీఐడీ. పరిశీలించిన న్యాయమూర్తి, కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. చంద్రబాబును ఆరా తీసిన జడ్జి వర్చువల్‌గా హాజరైన చంద్రబాబును జడ్జి కొన్ని విషయాలు అడిగారు. విచారణలో ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని చంద్రబాబును ప్రశ్నించగా.. సీఐడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అలాగే.. వైద్య పరీక్షలు నిర్వహించారా? అని ప్రశ్నించగా.. నిర్వహించారు అని సమాధానం ఇచ్చారాయన. థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా?.. ఏమైనా అసౌకర్యం అనిపించిందా? అనే ప్రశ్నలకు.. అలాంటిదేమీ లేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. దీంతో జడ్జి.. ‘‘మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు, మీ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, ఇప్పుడే అంతా అయిపోలేదు. బెయిల్ పిటిషన్‌పై రేపు(సెప్టెంబర్ 25, సోమవారం) వాదనలు వింటాం’’ అని చంద్రబాబుకి స్పష్టం చేసింది. చంద్రబాబు లాయర్లపై అసహనం సీఐడీ పిటిషన్‌పై చంద్రబాబు తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో.. సదరు లాయర్లపై ఏసీబీ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఒకటికి పది పిటిషన్లు వేయడం వల్ల విచారణ చేయడం ఎలా? అని బాబు లాయర్లను ప్రశ్నించారు ఏసీబీ జడ్జి. ‘‘ఒకే అంశంపై వరుస పిటిషన్ల వల్ల కోర్టు సమయం వృథా అవుతుంది’’అని చంద్రబాబు తరపు న్యాయవాదుల్ని, ఏసీబీ జడ్జి మందలించారు. అదే సమయంలో ‘‘ విచారణలో ఇప్పటిదాకా ఏం గుర్తించారనేది బయటపెట్టాలి’ అని చంద్రబాబు, ఏసీబీ జడ్జిని కోరారు చంద్రబాబు. అయితే.. విచారణ సమయంలో విషయాలను బయటపెట్టడం సరికాదన్న జడ్జి, ప్రాథమిక సాక్ష్యాలను సీఐడీ ఇప్పటికే సమర్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో అందుకు సంబంధించిన పత్రాలను మీ లాయర్లను అడిగి తీసుకోవాలంటూ చంద్రబాబుకి సూచించారు. కస్టడీ పొడిగింపు కోరాల్సి ఉంది సీఐడీ కస్టడీలో.. విచారణకు చంద్రబాబు సహకరించలేదు. అందుకే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించమని కోరాం. చంద్రబాబు గతంలో సాక్ష్యులను ప్రభావితం చేసిన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. సీఐడీ కస్టడీ పొడిగించమని కోరలేదు. రేపు పీటీ వారెంట్ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సీఐడీ కస్టడీకి మళ్ళీ కోరాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటాం అని సీఐడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద మీడియాకు వెల్లడించారు. -
శ్రీనివాస్‌కు మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు
-
శ్రీనివాస్‌కు రిమాండ్ పొడిగింపు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు విధించిన రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఈనెల 23 వరకు అతడికి కస్టడీ విధించింది. శ్రీనివాసరావుకు విధించిన పోలీసు కస్టడీ ముగియడంతో అతడిని శుక్రవారం పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. (ఇక పోలీస్ కస్టడీ లేనట్టే!) ఆరు రోజులపాటు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు విచారించారు. దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్ సమీప బంధువు విజయదుర్గతో పాటు అతడితో కలిసి పనిచేసిన వారిని పోలీసులు ప్రశ్నించారు. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని టి.హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి కూడా విచారించారు. అయితే విచారణ మొత్తం నిందితుడు శ్రీనివాసరావు వరకే పరిమితం చేయడం పట్ల అనుమానాలు బలపడుతున్నాయి. సూత్రధారులను కాపాడేవిధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
చింటూకు ఈ నెల 27 వరకు రిమాండ్ పొడిగింపు
చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్‌తో పాటు నిందితులందరికీ రిమాండు గడువును ఈనెల 27 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కేసు విచారణలో భాగంగా బుధవారం చింటూను కడప జైలు నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చిత్తూరులోని నాలుగో అదనపు కోర్టుకు తరలించారు. తదుపరి విచారణను ఈ నెల 27కు న్యాయమూర్తి వాయిదా వేశారు. కాగా ఈ కేసులో రిమాండు ఖైదీలుగా చిత్తూరు జిల్లా జైలులో ఉన్న 20 మంది నిందితులను న్యాయమూర్తి వీడియో కాన్ఫరెస్సు ద్వారా విచారించి, వీళ్లకు సైతం రిమాండు గడువును 27 వరకు పొడిగించారు. కాగా మహిళలను మోసం చేసిన పావని కేసులో పోలీసులు చింటూను ప్రధాన నిందితుడిగా చేర్చుతూ.. పీటీ వారెంట్‌ను కోర్టుకు సమర్పించారు. అనంతరం రిమాండు రిపోర్టును పోలీసులు చింటూకు అందచేశారు.