సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను ఇంకోసారి పొడిగించింది ఏసీబీ కోర్టు. నవంబర్ 1వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణ సమయంలో తన ఆరోగ్యం, భద్రత గురించి జడ్జి ఎదుట చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు హాజరుపరిచారు అధికారులు. ఆ సమయంలో ఆరోగ్యం ఎలా ఉంది? అని చంద్రబాబును ఏసీబీ జడ్జి ఆరా తీశారు. అయితే తనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని ఆయన జడ్జికి చెప్పారు. దీంతో అధికారుల్ని జడ్జి వివరణ కోరారు. మెడికల్ టీం ఉందని, ఎప్పటికప్పుడు ఆయనకు వైద్యపరీక్షలు జరుపుతోందని అధికారులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. మెడికల్ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని జడ్జి ఆదేశిస్తూ.. చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించారు.
మరోవైపు సెక్యూరిటీ విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పడంతో.. ఏమైనా అనుమానాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని కోర్టు సూచించింది. అలాగే చంద్రబాబు రాసే లేఖను సీల్ చేసి తనకు పంపాలని అధికారుల్ని జడ్జి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment