ఉక్కుమహిళ ఎందుకు ఓడారంటే?
న్యూఢిల్లీ: మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం షర్మిల రాజకీయ ప్రవేశం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(అఫ్సా) రద్దు కోసం చేపట్టిన 16 ఏళ్ల నిరాహార దీక్షను విరమించి ఎన్నికల బరిలోకి దిగిన ఆమెకు మణిపూర్ ప్రజలు పట్టం కడతారా? దీక్షకు వచ్చిన భారీ స్పందన మాదిరే ఆమె పార్టీ ‘పీపుల్స్ రిసర్జన్స్ అండ్ జస్టిస్ అలయన్స్’కి నీరాజనం పడతారా? అన్న ఆసక్తి రేగింది.
దీక్ష విరమించినందుకు కొందరు షర్మిలను విమర్శించినా.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమెకు ప్రజల నుంచి విస్తృతంగానే మద్దతు లభించింది. అయితే ఈ మద్దతు ఓట్ల రూపంలోకి మారలేకపోయింది. రాజకీయ దిగ్గజం, సీఎం ఇబోబీ సింగ్‌పై పోటీ చేసి ఓడిన ఆమె దయనీయంగా 90 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పరిస్థితి మారింది..: సాయుధ బలగాల చట్టవిరుద్ధ హత్యలు, అత్యాచారాలు జాతీయ మీడియాకు ముఖ్యమైన అంశాలే అయినా.. రాష్ట్ర ప్రజలకు మాత్రం బంద్‌లు, రోడ్ల దిగ్బంధనాలు, అభివృద్ధి లేమి పెద్ద సమస్యలుగా మారిపోయాయి. అఫ్సా రద్దు ఉద్యమానికంటే దైనందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం పెరిగింది. అఫ్సా రద్దు కోసం 16 ఏళ్ల కిందట షర్మిల ఉద్యమించినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మొబైల్ ఫోన్లు, ఇతర భద్రతా సదుపాయాల రాకతో బలగాలు గతంలో మాదిరి నిరంకుశంగా వ్యవహరించే పరిస్థితి లేదు. అలాగే, ఎన్నికలు జాతి ప్రయోజనాల ప్రాతిపదికగా జరగడం, శక్తిమంతుడైన ఇబోబీ సింగ్‌తో తలపడడం కూడా షర్మిల ఓటమికి కారణమైంది.
మెజారిటీ వర్గమైన మీటీలు.. తమ వ్యతిరేకులైన నాగాలను ఎదుర్కొనే నాయకుడు ఇబోబీనే అని తలపోశారు. థౌబాల్ నియోజకవర్గంతో(ఇబోబీపై)పాటు, తన స్వస్థలమైన ఖురాయ్ నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల తర్వాత ఖురాయ్ నుంచి పోటీ విరమించారు. ఆమె ఓటమికి ఇదీ ఒక కారణం కావొచ్చని భావిస్తున్నారు. షర్మిల మహిళ కావడం కూడా ఆమె పరాజయానికి కారణమైందని విశ్లేషకుల అంచనా.
మొత్తం 268 మంది అభ్యర్థుల్లో ఆమె సహా పదిమంది మాత్రమే మహిళలు ఉన్నారు. రాజకీయాలు పూర్తిగా పురుషుల వ్యవహారమనే భావన మణిపూర్‌లో ఉంది. షర్మిల రాజకీయాల్లోకి రాకుండా మానవ హక్కుల ఉద్యమాలకే పరిమితం కావాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.