‘కశ్మీర్‌తో బంధం పూర్తిగా తెగిపోతుంది’
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 35-ఏను భారత ప్రభుత్వం తొలగిస్తే కశ్మీర్‌తో పూర్తి సంబంధాలను తెంచుకున్నట్లు అవుతుందని ఆ రాష్ట్ర 2010 ఐఎఎస్ బ్యాచ్ టాపర్ షా ఫైసాల్ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 35-ఏ నిఖానామాతో పోల్చుతూ ఆదివారం ట్వీటర్ పోస్ట్ చేశారు. ‘ఆర్టికల్ 35-ఏ ను తొలగిస్తే కశ్మీర్లో భారత్‌కు అక్కడ మిగిలేది ఏమీ లేదు. కశ్మీర్‌కు ఉన్న హక్కులను రద్దు చేస్తే ఇక చర్చించడానికి కూడా ఏంలేదు. అది ముగిసిపోయిన వివాహం లాంటిది’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించినప్పుడు భారత రాజ్యాంగం ఇంకా అమలులోకి రాలేదని, ఒప్పందం ద్వారా కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పించారని తెలిపారు.
భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే హక్కు తమకు లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక అధికారాల వల్ల దేశ సమగ్రతకు ఎలాంటి ముప్పులేదని తెలిపారు. ఫైసాల్ ట్వీట్‌పై కశ్మీర్ మాజీమంత్రి, పీడీపీ సీనియర్ నేత నయీమ్ అక్తర్ స్పందించారు. ఆర్టికల్ 35-ఏను తొలగించడం మారిటల్ రేప్ లాంటిదని ట్వీట్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిగా హరించడమేనని ఆయన తెలిపారు. కాగా ఈ ఆర్టికల్‌పై నేడు అత్యున్నత న్యాయస్థానం విచారణ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా రెండు రోజుల కశ్మీర్ బంద్‌కు ఏర్పాటు వాదులు పిలుపునిచ్చారు.