కవరేజికి వెళ్తే.. చిరుత దాడి చేసింది!
తలుచుకుంటేనే గుండె ఝల్లుమనే ఘటన ఇది. పది అడుగుల దూరంలో చిరుతపులి ఉండగా.. దాన్ని ఫొటో తీద్దామని వెళ్లారు వాళ్లు. అంత ధైర్యం ఎందుకంటే, అప్పటికే అటవీ శాఖాధికారులు దానికి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చేశారు. దాంతో అది మత్తుగా పడి ఉందని అనుకున్నారు. కానీ అంతలోనే అది కాస్తా లేచి.. ఫొటోలు తీయడానికి వచ్చిన రిపోర్టర్ల మీద దాడిచేసింది. ఇద్దరూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఒళ్లు జలదరించే ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని అలీపుర్దార్ జిల్లా ఫలకతాలో జరిగింది. ఎయ్ సమయ్ అనే పత్రికకు చెందిన జయా చక్రవర్తి అనే రిపోర్టర్ ఈ ఘటనలో గాయపడింది. ఆమెకు యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అదే గ్రామంలో అంతకుముందు రైతు జంటపై ఈ చిరుత దాడిచేసింది. దాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
దాడి తర్వాత కూడా అధికారులు, గ్రామస్తులు కలిసి చిరుతను పట్టుకున్నారు. కానీ జయా చక్రవర్తి మాత్రం ఈ దాడితో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్క క్షణం పాటు తన ప్రాణాలు పోయాయనే అనుకున్నట్లు చెప్పారు. అది తన ఎడమ చేతిని తినేయడానికి ప్రయత్నించిందని వివరించారు. అక్కడున్న గ్రామస్తులలో ఒకరు కర్రతో చిరుత తలమీద కొట్టడంతో అది జయను వదిలేసింది.
నిజానికి చిరుతపులి ఒక వెదురు తోటలోకి ప్రవేశించినప్పుడు గ్రామస్తులు దాన్ని గుర్తించి అటవీ శాఖాధికారులకు చెప్పారు. దాంతో వాళ్లు దాన్ని మత్తు ఇంజెక్షన్లతో షూట్ చేశారు. దాంతో అంతా అది పడుకుందనే అనుకున్నారు. కానీ, అంతలోనే అది ఒక్కసారిగా లేచి జయా చక్రవర్తితో పాటు ఆమె సహోద్యోగి సుధీర్ బర్మన్పై కూడా దాడిచేసింది. అతడికి వీపుమీద, మెడ మీద 8 కుట్లు పడ్డాయి.