Reporters Without Borders
-
పత్రికా స్వేచ్ఛ.. నానాటికీ తీసికట్టు
న్యూఢిల్లీ: పత్రికా స్వేచ్ఛ సూచిలో మన దేశం ఏమాత్రం మెరుగ్గా లేదు. నానాటికీ తీసికట్టుగా పరిస్థితి తయారైందని తాజా అధ్యయనం వెల్లడించింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్ఎస్ఎఫ్) తాజాగా ప్రకటించిన దేశాల జాబితాలో మన దేశం 150వ స్థానంలో నిలిచింది. గతేడాది భారత్ ర్యాంక్ 142. ప్రతి దేశంలో పాత్రికేయులు, వార్తా సంస్థలు, నెటిజన్లకు ఉన్న స్వేచ్ఛను.. అలాంటి స్వేచ్ఛను గౌరవించే ప్రభుత్వ ప్రయత్నాలను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ హైలైట్ చేస్తుంది. జర్నలిజానికి ‘చెడు’గా పరిగణించబడే దేశాల జాబితాలో భారత్ గతేడాది చేర్చబడింది. జర్నలిస్టులపై జరుగుతున్న హింస, రాజకీయంగా పక్షపాత మీడియా, కేంద్రీకృత మీడియా యాజమాన్యం ఇవన్నీ భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాయని ఆర్ఎస్ఎఫ్ నివేదిక పేర్కొంది. ‘ఇండియా స్పెండ్’ నివేదిక ప్రకారం.. ఇంటర్నెట్ షట్‌డౌన్, తప్పుడు సమాచారం విస్త్రృత వ్యాప్తి కూడా గత ఐదేళ్లలో పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం ర్యాంక్ పడిపోవడానికి కారణమని వెల్లడించింది. కాగా, పత్రికా స్వేచ్ఛ సూచిలో నార్వే మొదటి స్థానంలో నిలవగా.. పాకిస్థాన్ 157వ స్థానంలో ఉంది. (క్లిక్: ఇంటర్నెట్ షట్డౌన్లో టాప్ ఎవరంటే?) -
భారత్‌లో పత్రికా స్వేచ్ఛ దారుణం
లండన్: పత్రికా స్వేచ్ఛలో భారత్ తాజాగా మరో రెండు స్థానాలు దిగజారి 140వ ర్యాంకుకు పరిమితమైంది. పారిస్ కేంద్రంగా పనిచేసే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ 2019 ఏడాదికి పత్రికా స్వేచ్ఛ అంశంలో 180 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ – 2019’ పేరిట ఓ నివేదికను సంస్థ గురువారం విడుదల చేసింది. ఎన్నికల సమయం కావడంతో పాత్రికేయుల మీద అధికార బీజేపీ నేతల దాడులు పెరిగిపోయాయని సంస్థ ఈ నివేదికలో పేర్కొంది. భారత్‌లో గతేడాది జర్నలిస్టులపై జరిగిన హింసాత్మక దాడుల్లో ఆరుగురు చనిపోయారనీ, ఏడవ జర్నలిస్టు మృతి అంశంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయంది. ‘భారత్‌లో పాత్రికేయులపై పోలీసులు, మావోయిస్టులు, నేర ముఠాలు, అవినీతి రాజకీయ నాయకులు హింసాత్మక దాడులకు పాల్పడటం, వారిని బెదిరించటం వంటివి చేస్తున్నారు. ఇలాంటి దాడుల వల్ల గతేడాది ఆరుగురు జర్నలిస్టులు చనిపోయారు’ అని నివేదిక తెలిపింది. ఆంగ్లేతర భాషల మీడియాకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయంది. 2018లో భారత్‌కు 138వ ర్యాంకు దక్కగా తాజాగా 140వ స్థానానికి చేరింది. ఇక 2019 ఏడాదికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో నార్వే మూడోసారి తొలి ర్యాంకు పొందింది. ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్తాన్ 142వ ర్యాంకు, బంగ్లాదేశ్ 150వ ర్యాంకు పొందాయి. సూచీ చిట్టచివరన తుర్క్మెనిస్తాన్ (180వ ర్యాంకు), ఉత్తర కొరియా (179), చైనా (177), వియత్నా (176) ఉన్నాయి. ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా 110వ ర్యాంకును, గాంబియా 92వ ర్యాంకును పొందాయి. -
పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్
-
అఫ్గానిస్తాన్‌లో 37 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో సోమవారం జరిగిన పలు ఆత్మాహుతి దాడుల్లో పది మంది విలేకరులు, పదకొండు మంది చిన్నారులు సహా 37 మంది దుర్మరణం పాలయ్యారు. రాజధాని కాబూల్‌లో రెండు బాంబు పేలుళ్లలో కలిపి 25 మంది చనిపోగా, కాందహార్‌లో జరిగిన మరో దాడిలో 11 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మూడు ఘటనల్లో కలిపి 65 మంది గాయపడటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 2001 తర్వాత అఫ్గానిస్తాన్‌లో మీడియాపై జరిగిన అత్యంత భయానక దాడి ఇదేనని ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ అనే సంస్థ వెల్లడించింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన మరో దాడిలో బీబీసీ రిపోర్టర్ అహ్మద్ షా మరణించారు.కాబూల్‌లో జరిగిన రెండు దాడులూ చేసింది తామేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్ ఈ దాడులను తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాది జర్నలిస్ట్‌లా వచ్చి జనసమూహంలో తనను తాను పేల్చుకున్నాడని కాబూల్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. చనిపోయిన జర్నలిస్టుల్లో పలు స్థానిక చానళ్ల ప్రతినిధులు సహా ఏఎఫ్‌పీ చీఫ్ ఫొటోగ్రాఫర్ షా మరై కూడా ఉన్నారు. మరో ఘటనలో కాందహార్‌లో ఉగ్రవాది బాంబులతో నిండిన కారులో వచ్చి దాడికి పాల్పడటంతో 11 మంది చిన్నారులు మృతి చెందగా అఫ్గాన్, ఇతర దేశాల భద్రతా దళాల సిబ్బంది సహా 16 మంది గాయపడ్డారు.ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. 2016 నుంచి ఇప్పటివరకు అఫ్గానిస్తాన్‌లో 34 మంది జర్నలిస్టులు చనిపోయారనీ, పత్రికా స్వేచ్ఛ సూచీలో ఆ దేశ స్థానం 118 అని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ గుర్తుచేసింది. 2016లోనూ ఓ చానల్‌పై తాలిబాన్లు దాడి చేయగా ఏడుగురు ఉద్యోగులు మరణించారు. గత నవంబర్‌లో కూడా మరో టీవీ చానల్ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. -
పత్రికా స్వేచ్ఛలో భారత్ ర్యాంక్ 138
లండన్: పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ ర్యాంకు మరింతగా పడిపోయింది. గత ఏడాది ర్యాంక్ 136 కాగా, ఈ ఏడాది 138కు దిగజారిందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్ఎస్ఎఫ్) అనే అంతర్జాతీయ సంస్థ తెలిపింది. ప్రధాని మోదీ వైఖరే ఇందుకు కారణమని విమర్శించింది. సంపూర్ణ పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశంగా నార్వే రెండో ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలవగా, ఉత్తరకొరియా అట్టడుగున ఉన్నట్లు తెలిపింది. వివిధ అంశాల ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో ఉన్న పత్రికా స్వేచ్ఛకు ఆర్ఎస్ఎఫ్ సంస్థ ఏటా ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది నివేదికలో.. మోదీ అధికారంలోకి వచ్చాక భారత్‌లో హిందూ ఛాందసవాదుల విద్వేష పూరిత ప్రసంగాలు, నేరాలు పెరిగిపోయాయంది. హిందూ మత ఆధిక్యత, కుల వ్యవస్థ, మహిళా హక్కులపై ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాతోపాటు జర్నలిస్టులపై బెదిరింపులు, భౌతిక దాడులు ఎక్కువయ్యాయని పేర్కొంది. -
పత్రికా స్వేచ్ఛలో మరింత దిగజారిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ : 2018 సంవత్సరానికి గాను రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) బుధవారం వెల్లడించిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ స్థానం 136 నుంచి 138వ స్ధానానికి పడిపోయింది. జర్నలిజంపై కత్తికట్టినట్టు వ్యవహరిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యవస్థకు విఘాతం కలుగుతోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో పరిస్థితి మరింత దిగజారిందని.. రాడికల్ జాతీయవాదులు ఆన్లైన్ క్యాంపెయిన్‌లో జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని చెలరేగుతున్నారని. మోదీ జాతీయవాదంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది. హిందూ జాతీయవాదులుగా చెప్పుకునే కొందరు ప్రధాన స్రవంతి మీడియాపై నియంత్రణ విధిస్తూ, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులకూ తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాదిలో ముగ్గురు పాత్రికేయులను హత్య చేశారని పేర్కొంది. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ పతనానికి ప్రధాని నరేంద్ర మోదీ ట్రోల్ ఆర్మీలే కారణమని ఆర్ఎస్ఎఫ్ నివేదిక పేర్కొంది. ప్రభుత్వానికి కొరుకుడు పడని జర్నలిస్టులను ప్రాసిక్యూట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్ లాంటి ప్రాంతంలో మీడియా కవరేజ్ సంక్లిష్టంగా మారిందని పేర్కొంది. విదేశీ పాత్రికేయులను ఆ ప్రాంతంలో పనిచేయనీయడం లేదని, తరచూ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుతోందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ లాలూచీతో స్ధానిక పత్రికల్లో పనిచేసే కశ్మీరీ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్ చేస్తున్నారని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛలో ముందున్న యూరప్ ఇక పత్రికా స్వేచ్ఛ సూచీలో అమెరికా రెండు స్ధానాలు కోల్పోయి 45వ స్ధానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా యూరప్ దేశాలే పత్రికా స్వేచ్ఛలో ముందున్నాయి. ఈ సూచీలో నార్వే తొలి స్ధానంలో నిలవగా, స్వీడన్ రెండవ స్ధానాన్ని దక్కించుకుంది. నెదర్లాండ్స్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్‌లు తొలి ఐదు స్ధానాల్లో నిలిచాయి. కెనడా నాలుగు స్ధానాలు ఎగబాకి 18వ స్ధానంలోకి దూసుకువచ్చింది. కెనడాలో మెరుగైన పత్రికా స్వేచ్ఛకు సానుకూల వాతావరణం నెలకొందని నివేదిక కితాబిచ్చింది. ఇక ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో ఉత్తర కొరియా అట్టడుగున నిలవగా, తుర్కమెనిస్థాన్, సిరియా, చైనాలు తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. -
2017లో 65 మంది జర్నలిస్టుల హత్య
పారిస్ : జర్నలిస్టులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా రక్షణ లేదు. వ్యక్తిగత పగ, ఇతరత్రా ద్వేషాలతో 2017లో 65 మంది జర్నలిస్టులను అత్యంత క్రూరంగా అంతమొందించారు. ఇదే విషయాన్ని రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ సంస్థ తన వార్షిక నివేదికలో ప్రకటించింది. మొత్తం మృతుల్లో 60 శాతం మందిని వ్యక్తిగత కక్షతోనే హతమార్చినిట్లు నివేదిక స్పష్టం చేసింది. మరో 202 మంది జర్నిలిస్టులను బెదిరించడం, నిర్భంధించడం చేయడం జరిగిందని రిపోర్టర్స్ నివేదిక తెలిపింది. అంతేకాక మరో 54 మంది పత్రికా విలేకరులను ఉగ్రవాదులు నిర్భంధించారని సంస్థ పేర్కొంది. ఇదిలా ఉండగా.. విధుల్లో ఉన్న 26 మంది జర్నలిస్టులు హత్య చేశారు. బాంబుదాడులు, వాయుదాడుల్లో పదుల సంఖ్యలో జర్నలిస్టులు మృత్యువాత పడడం జరిగిది. సిరియా, మెక్సికో, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఫిలిప్పీన్స్ వంటి అత్యంత ప్రమాదకర దేశాల్లో జర్నలిస్టులు ప్రాణాలు పణంగా పెట్టి.. వార్తలను ప్రపంచానికి అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళా జర్నలిస్టులూ ఉన్నారు. చైనా, వియాత్నం, సిరియా, ఇరాన్లలో జర్నలిస్టులపై విపరీత ఆంక్షలు ఉన్నాయని, అక్కడ జర్నలిస్టుగా ఉద్యోగం చేయడం అంటే ప్రాణాన్ని పణంగా పెట్టడమేనని సంస్థ పేర్కొంది. -
కల'కలం'.. ఆసియాలో ఇండియానే డెడ్లీయెస్ట్!
పారిస్: విధి నిర్వహణలో భాగంగా 2015లో ప్రపంచవ్యాప్తంగా 110 మంది పాత్రికేయులు ప్రాణాలు విడిచారు. ఇందులో చాలామంది యుద్ధ కల్లోల ప్రాంతాల్లో వార్తలు అందిస్తూ మృత్యవాత పడగా.. శాంతియుత దేశాలుగా పేరొందిన వాటిలోనూ చాలామంది హత్యలకు గురయ్యారని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) సంస్థ పేర్కొంది. ఈ ఏడాది విధి నిర్వహణలో భాగంగా 67 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని ఆర్ఎస్ఎఫ్ తన వార్షిక రౌండప్ నివేదికలో తెలిపింది. యుద్ధ కల్లోల దేశాలైన ఇరాక్, సిరియాలు జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలుగా పేరొందాయని, ఇరాక్‌లో 11 మంది, సిరియాలో 10 మంది విధినిర్వహణలో చనిపోయారని తెలిపింది. ఆ తర్వాత స్థానంలో ఫ్రాన్ ఉందని, ఫ్రాన్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు వ్యంగ్య కార్టూన్ పత్రిక చార్లీ హెబ్డోపై జరిపిన దాడిలో 8 మంది పాత్రికేయులు మరణించారని పేర్కొంది. మరో 47 మంది పాత్రికేయులు విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, అయితే, వారి మృతికి దారితీసిన కారణాలు స్పష్టంగా తెలియలేదని ఆ సంస్థ వివరించింది. అలాగే 27 మంది నాన్ ప్రొఫెషనల్ పౌర పాత్రికేయులు, ఏడుగురు మీడియా సిబ్బంది కూడా హత్యకు గురయిన వారిలో ఉన్నారని వివరించింది. ఇక భారత్ విషయానికొస్తే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని ఆర్ఎఫ్ఎస్ స్పష్టంచేసింది. వ్యవస్థీకృత నేరాలు, వాటితో రాజకీయ నాయకులకు ఉన్న సంబంధాలను బహిర్గతం చేయడం, అక్రమ మైనింగ్ బాగోతాన్ని వెలుగులోకి తేవడం వంటి కారణాలతో జర్నలిస్టులు అమానుషంగా హతమయ్యారని వివరించింది. వీరిలో ఐదుగురు పాత్రికేయులు విధినిర్వహణలో హత్యకు గురవ్వగా, మరో నలుగురు గుర్తుతెలియని కారణాలతో చనిపోయారని, అందుకే ఫ్రాన్స్ తర్వాత ఇండియాను చేర్చినట్టు ఆ సంస్థ తెలిపింది. 'ఆసియాలో జర్నలిస్టులకు భారతే అత్యంత ప్రమాదకరం దేశమని ఈ మరణాలు చాటుతున్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ కంటే భారత్ ముందున్నది' అని ఆర్ఎఫ్ఎస్ తెలిపింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల కాపాడేందుకు కేంద్రప్రభుత్వం జాతీయ ప్రణాళికను తీసుకురావాల్సిన అవసరముందని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది.