సైగలేలనోయి...
స్టడీ
మాట్లాడే వాళ్లలో రెండు రకాలు కనిపిస్తారు.
కొందరు మాట్లాడుతున్నప్పుడు...నోరు మాత్రమే కదులుతుంది. ‘మాకేం పని’ అన్నట్లుగా ఉంటాయి మిగిలిన అవయవాలు.
కొందరు మాట్లాడుతున్నప్పుడు....నోరు మాత్రమే కదలదు...చేతి వేళ్లు రకరకాల భంగిమలు పోతుంటాయి. ఏవో సంజ్ఞలను సూచిస్తుంటాయి. ఇది కేవలం అలవాటు మాత్రమేనా? ఇంకేమైనా ఉందా?
వేలి సంజ్ఞలు, వాటి కదలికలు సామాన్యమేవీ కావు అంటున్నారు పరిశోధకులు.
వేలి సంజ్ఞలు, కదలికలను కేవలం ‘అలవాటు’గా మాత్రమే చూడనక్కర్లేదని వాటి గురించి చెప్పడానికి ఎంతో ఉందని కూడా అంటున్నారు.
మనిషి తెలివి, చురుకుదనం, వేలి సంజ్ఞలు, కదలికలకు మధ్య గల సంబంధాన్ని బెర్లిన్లోని హాంబోర్డ్ యూనివర్శిటీలోని పరిశోధకులు అధ్యయనం చేసి కొన్ని విషయాలు చెప్పారు. వారు చెప్పిన దాని ప్రకారం...
వేలి కదలికలకు, మన ఆలోచన సరళికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది.
సైగలు, వేలి కదలికలు మన అంతఃచేతనలోని జ్ఞానాన్ని ప్రతిఫలిస్తాయి(అందుకేనేమో, యోగులు చేతివేళ్లతో విచిత్రంగా సంజ్ఞలు చేస్తుంటారు. కొందరు గాల్లో కూడా రాస్తుంటారు!)
ఆలోచనల్లో అప్పటికప్పుడు మార్పు తేవడానికి కూడా చేతి కదలికలు, సంజ్ఞలు ఉపయోగపడతాయి.
వేలి సంజ్ఞలకు జ్ఞాపకశక్తిని వృద్ధి చేసే శక్తి ఉంటుంది.
వేలి కదలికలు ఎక్కువగా ఉన్న పిల్లలలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.
మెదడు చురుకుదనానికి వేలి కదలికలు తమ వంతు పాత్ర నిర్వహిస్తాయి.