Reservation policy
-
చదువు లేని భవిత పెద్ద సున్నా.. మీ జీవితాన్ని మార్చుకునే చక్కటి అవకాశం..
-
అసమానతలున్నంత వరకు రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను సవరించి మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని, దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ బీజేపీయేనని వాఖ్యానించారు. మంగళవారం రవీంద్రభారతిలో జాతీయ ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ సెమినార్ ఆఫ్ రిజర్వేషన్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంలో బీజేపీ ముందుంటుందని, దేశానికి రాష్ట్రపతిగా తొలిసారి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని అప్పటి ప్రధాని వాజ్‌పేయి నిలిపారని గుర్తుచేశారు. వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారని, దళిత వ్యక్తిని రాష్ట్రపతిగా చేసింది కూడా బీజేపీ అని తెలిపారు. సమాజంలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, వీటిని అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత కఠినతరం చేసినట్లు చెప్పారు. దళితుల రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగించి ప్రధాని మోదీ సాహసం చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ దళితులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యానిధి లాంటి పథాకాలను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అట్రాసిటీ కేసులు పెరుగుతున్నాయని, కానీ పోలీసులు నిందితులకు స్టేషన్ బెయిల్ ఇస్తూ వారికి పరోక్షంగా సహకరిస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు అన్నారు. -
రిజర్వేషన్లకు అవి ముప్పే..
సాక్షి,న్యూఢిల్లీ: ప్రయివేటీకరణ, అవుట్‌సోర్సింగ్‌లను నిరసిస్తూ రాజధానిలోని రాంలీలా మైదానంలో అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య భారీ ఆందోళన చేపట్టింది. ప్రయివేటీకరణ, ఉద్యోగాల అవుట్సోర్సింగ్ రిజర్వేషన్ల విధానానికి ముప్పుగా పరిణమించాయని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సమకూరి దశాబ్ధాలు గడిచినా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని ఎంపీ ఉదిత్ రాజ్ అన్నారు. యూపీ, బీహార్, హర్యానా, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలకు చెందిన కార్యకర్తలు తరలివచ్చారు. -
మార్కెట్ కమిటీ 14 మందికి పరిమితం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో తొలిసారిగా రిజర్వేషన్ విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం కమిటీ సభ్యుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించింది. గతంలో కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 18 మంది సభ్యులుండగా.. నూతన మార్గదర్శకాల ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్ సహా 14 మందికి పరిమితం చేశారు. సభ్యుల నియామక ప్రక్రియను 3 కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో రైతులు, రెండో కేటగిరీలో లెసైన్సు కలిగిన వ్యాపారస్తులు, మూడో కేటగిరీలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. మొదటి కేటగిరీకి సంబంధించి సంబంధిత మార్కెట్ కమిటీ పరిధిలోని గ్రామాల నుంచి 8 మంది రైతులను సభ్యులుగా నామినేట్ చేస్తారు. వీరిలో కనీసం ఐదుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ కేటగిరీలకు చెందిన వారై ఉండాలి. సన్న, చిన్నకారు రైతులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తిదారులు, పశుగణ పోషకుల నుంచి 8 మంది సభ్యులను నియమిస్తారు. రెండో కేటగిరీలో సంబంధిత మార్కెట్ కమిటీలో లెసైన్సు పొందిన ఇద్దరు వ్యాపారస్తులను మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ సూచన మేరకు నామినేట్ చేస్తారు. మూడో కేటగిరీలో నలుగురు సభ్యుల్ని నియమిస్తారు. వీరిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, సహకార మార్కెటింగ్ సంఘాల అధ్యక్షుల కోటా నుంచి ఒకరు చొప్పున ఇద్దరిని నామినేట్ చేస్తారు. మార్కెట్ ఏడీతో పాటు సంబంధిత మార్కెట్ కమిటీ పరిధిలోని వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, పశు సంవర్దక శాఖ, మత్స్యశాఖలకు చెందిన ఏడీలలో ఒకరిని ఎంపిక చేస్తారు. మార్కెట్ కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతంలోని మున్సిపల్ చైర్మన్ లేదా గ్రామ సర్పంచ్ సభ్యుడిగా కమిటీలో ఉంటారు. చైర్మన్ ఎంపిక విధానం రైతుల కోటాలో నామినేట్ అయిన 8 మంది సభ్యుల్లో ఒకరిని రిజర్వేషన్ రోస్టర్‌కు అనుగుణంగా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తారు. రైతులు లేదా లెసైన్సు కలిగిన వ్యాపారుల కోటాకు చెందిన సభ్యుల్లో ఒకరిని వైస్ చైర్మన్‌గా నియమించే వీలుంటుంది. ఎంపిక చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవీ కాలం ఏడాదిగా నిర్ణయించారు. రాష్ట్రంలో 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలుండగా, పీసా చట్టం-1996 ప్రకారం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో షెడ్యూలు ఏరియాలోని 11 కమిటీలను ఎస్టీలకు కేటాయించారు. మిగతా 168 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఎస్టీలకు 6, ఎస్సీలకు 15, బీసీలకు 29 శాతం చొప్పున కమిటీ చైర్మన్ పదవులు కేటాయించారు. -
గులాబీ నేతల్లో రిజర్వేషన్ గుబులు
♦ మార్కెట్ కమిటీ కోటాపై అసంతృప్తి సెగలు ♦ తమ పదవులకు ముప్పు అంటున్న నాయకులు ♦ పనిచేసిన వారికి పదవులు దక్కని వైనం ♦ నామినేటెడ్ పదవుల పంపకంలో హంసపాదు సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పదవుల భర్తీలో అధికార టీఆర్ఎస్కు ఆదిలోనే హంసపాదు పడిందా? ఆయా వర్గాలకు రాజకీయ భరోసా కల్పించేందుకు తీసుకున్న ‘రిజర్వేషన్’ నిర్ణయం బెడిసి కొట్టనుందా? దీనికి అవుననే జవాబిస్తున్నారు ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 168 వ్యవసాయ మార్కెట్లకు గాను గిరిజన ప్రాంతాల్లోని 13 మినహా, 168 మార్కెట్ కమిటీల భర్తీ కోసం ప్రభుత్వం రిజర్వేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యాభై శాతం (84 మార్కెట్లు) రిజర్వేషన్ ఇవ్వగా, 84 మార్కెట్లను జనరల్ కేటగిరీలో ఉంచింది. బీసీలకు 49, ఎస్సీలకు 25, ఎస్టీలకు 10 చొప్పున రిజర్వు అయిన మార్కెట్లు అధికార పార్టీలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. రిజర్వేషన్ల వల్ల అసలు రావాల్సిన వారికి పదవులు రాకుండా పోయే ముప్పుందని నేతలు వాపోతున్నారు. పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వం నామినేటెడ్ పదవులపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన చెందుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొందరు నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుల కోసం జిల్లా అధ్యక్షుడిని, తమ ఎమ్మెల్యేలను, జిల్లా మంత్రిని నమ్ముకున్నారు. కొన్ని జిల్లాల్లో సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు కోరుకున్న విధంగానే వారి వారి నియోజకవర్గాల్లో అనుకూలంగా రిజర్వు అయ్యాయని అంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేలు అయినవారు, ఎన్నికల ముందే పార్టీలోకి వచ్చిన వారు, కార్యకర్తలతో పెద్దగా సంబంధాలు లేని ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మాత్రం రిజర్వేషన్ కోటాను పూర్తి చేసేందుకు చిత్తమున్నట్లు కేటాయించారన్న అభిప్రాయం ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లకు చెక్ పెట్టేందుకు జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు. నెల రోజుల కిందటే ఏ మార్కెట్ చైర్మన్ పోస్టు ఏ వర్గానికి ఇవ్వాలో ఖరారైందని సమాచారం. ఈనెల 22న టీఆర్ఎస్ఎల్పీ భేటీ లో రిజర్వేషన్ల జాబితాను ఎమ్మెల్యేలకు ఇచ్చారని చెబుతున్నారు. వీటిలో సుదీర్ఘంగా పార్టీలో ఉన్న వారికి అవకాశం దక్కకుండా పోయిన సెంటర్లు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ఉదాహరణకు ఒక్క ఎస్టీ రిజర్వేషన్‌ను పరిశీలిస్తే, ఎస్టీ జనాభా అత్యధికంగా ఉండే నల్లగొండ జిల్లా దేవరకొండ మార్కెట్ కమిటీ జనరల్ కోటాలో ఉంటే, పార్టీలో నామినేటెడ్ పోస్టు ఇవ్వడానికి అర్హుడైన నేత లేని భువనగిరి మార్కెట్ ఎస్టీలకు రిజర్వు అయ్యింది. ఎస్సీలు అధికంగా ఉండే నకిరేకల్ ఎస్టీలకు, బీసీ నేతలు ఎక్కువగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మిర్యాలగూడ ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. ఎస్టీలకు 10 మార్కెట్లు రిజర్వు అయితే, నల్లగొండ జిల్లాలోనే నాలుగు కేటాయించారు. ఇక ఎస్సీలకు 25 మార్కెట్లు రిజర్వ్ చేస్తే 12 మార్కెట్లు ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో అసలు ఎస్సీలకు ఒక్క మార్కెట్‌నూ కేటాయించలేదు. కొందరు మంత్రులు చక్రం తిప్పిన చోట్ల జనరల్ కోటాకు ఎక్కువ కేటాయింపులు జరిగాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
‘రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలి’
న్యూఢిల్లీ: రిజర్వేషన్ విధానాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని.. రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్‌భగవత్ పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఎవరికి అవసరం.. ఎంత కాలం అవసరం అనేది పరిశీలించటానికి రాజకీయాలకు సంబంధం లేని కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రికలు ఆర్గనైజర్, పాంచజన్యలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సూచించారు. కోటా కోసం గుజరాత్లో పటేళ్ల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. -
‘మార్కెట్’ పదవులపై కన్ను
రిజర్వేషన్ విధానం యోచనతో సామాజికవర్గాల నేతల సందడి చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకమండళ్ల చైర్మన్ పదవులకోసం అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రస్తుతమున్న కమిటీల పదవీకాలం ముగియకున్నా ఆర్డినెన్స్ద్వారా ఈ పాలకమండళ్లను రద్దుచేసింది. ఈస్థానాల్లో తమ పార్టీవారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ఓపెన్కెటగిరీ కింద మార్కెట్ కమిటీ పాలకమండళ్లను గత ప్రభుత్వాలు నియమించేవి. అలా కాకుండా వీటిలో కూడా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనప్రాయంగా తెలియజేశారు. దీంతో పలు సామాజిక వర్గాల టీఆర్ఎస్ నేతలు ఈ పదవులకోసం పోటాపోటీగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో మూడు కమిటీలు చేవెళ్ల నియోజకవర్గంలో చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్, నవాబుపేట మండలాలున్నాయి. నియోజకవర్గ పరిధిలో చేవెళ్ల, శంకర్పల్లి, సర్దార్‌నగర్ మార్కెట్కమిటీలున్నాయి. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి చేవెళ్ల మండలం, శంకర్పల్లి మార్కెట్పరిధిలోని శంకర్పల్లి మండలం, సర్దార్‌నగర్ మార్కెట్ పరిధిలోకి షాబాద్, మొయినాబాద్ మండలాలు వస్తాయి. నవాబుపేట మండలం మాత్రం వికారాబాద్ మార్కెట్ పరిధిలోకి వస్తుంది. ఈ పాలకమండళ్లకు కోసం ఆయా మండలాల టీఆర్ఎస్ నేతలు పోటీపడుతున్నారు. ఇదిలాఉండగా సర్దార్‌నగర్ నుంచి మొయినాబాద్ మండలాన్ని, వికారాబాద్ మార్కెట్‌నుంచి నవాబుపేటను వేరుచేసి కొత్త కమిటీలను ఏర్పాటుచేయాలన్న డిమాండ్ కూడా ఎప్పటినుంచో ఉంది. నేతల ఉత్కంఠ మార్కెట్ పదవులలో ప్రవేశపెట్టనున్న రిజర్వేషన్ విధానం ఇంకా నిర్ణయించకపోవడంతో ఏ మార్కెట్‌కమిటీ ఏ కేటగిరీకి చెందుతుందోనని ఆశావహులు ఉత్కంఠతో ఉన్నప్పటికీ తమవంతు ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గిరీ కోసం మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సామ మాణిక్‌రెడ్డి పోటీపడుతున్నారు. రిజర్వేషన్ విధానం అమలై ఎస్సీ అయితే మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.వసంతం, గంగియాదయ్య, బీసీ అయితే రావులపల్లి మాజీ సర్పంచ్ రాంచంద్రయ్య, కె.పాండు, సత్యనారాయణగౌడ్ తదితరులు పోటీలో ఉంటారు. అదే విధంగా సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి వస్తే షాబాద్ మండలం చందనవెళ్లికి చెందిన కొలన్ ప్రభాకర్‌రెడ్డి, కక్కులూరుకు చెందిన మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ జీవన్‌రెడ్డి పోటీలో ఉన్నారు. బీసీకి కేటాయిస్తే నాగరకుంటకు చెందిన వెంకటయ్యకే అవకాశాలున్నాయి. అదే విధంగా శంకర్పల్లి మార్కెట్‌కమిటీ చైర్మన్ పదవిని జనరల్‌కు కేటాయిస్తే సంకెపల్లికి చెందిన చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దేవుని పరమేశ్వర్‌రెడ్డి, మహాలింగపురం గ్రామానికి చెందిన బల్వంత్‌రెడ్డి పోటీపడుతున్నారు. బీసీలకు కేటాయిస్తే శంకర్‌పల్లికి చెందిన బొమ్మనగారి కృష్ణ, మోకిలకు చెందిన లింగం, ఎస్సీలకు రిజర్వు చేస్తే మహారాజ్‌పేటకు చెందిన సామయ్య, జన్వాడకు చెందిన యాదయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంత్రిపైనే భారం మంత్రి మహేందర్‌రెడ్డిపైనే మార్కెట్‌కమిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవుల ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఆశీస్సుల కోసం చక్కర్లు కొడుతున్నారు. మంత్రి సోదరుడు , ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ద్వారా సిఫార్సు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ద్వారా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నీటిపారుదల, మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు సోమవారం చేవెళ్ల, వికారాబాద్‌లలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయనను ప్రసన్నం చేసుకునేం దుకు కూడా ఆశావహ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.