restructuring plan
-
SAP: ఏఐపై ఫోకస్.. 8,000 ఉద్యోగాలకు ఎసరు!
జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్ఏపీ ఎస్ఈ (SAP SE) ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు, కృత్రిమ మేధస్సు(AI)పై దృష్టి పెట్టింది. ఇందుకు అనుగుణంగా ఈ సంవత్సరం కార్యకలాపాలను పునర్నిర్మించే ప్రణాళికను ఆవిష్కరించింది. దీంతో దాదాపు 8,000 మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. పునర్నిర్మాణ ప్రణాళిక ద్వారా ప్రభావితమయ్యే ఉద్యోగులకు స్వచ్ఛంద సెలవు కార్యక్రమాలు, అంతర్గత రీ-స్కిల్లింగ్ చర్యల ద్వారా సర్దుబాటు చేయనున్నట్లు ఎస్ఏపీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ హెడ్‌కౌంట్‌లో పెద్దగా మార్పులు లేకుండానే ఈ సంవత్సరాన్ని ముగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సాధించేందుకు ఈ మార్పులు ఏడాదంతా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా 2023 డిసెంబరు 31 నాటికి కంపెనీలో 1,07,602 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు ఉన్నట్లు ఎస్ఏపీ వివరించింది. ఇదీ చదవండి: ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు! కంపెనీ నాలుగో త్రైమాసిక ఐఎఫ్ఆర్ఎస్ (ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్)యేతర ఆదాయంలో 5 శాతం లాభాన్ని నమోదు చేసినట్లు ఎస్ఏపీ విడిగా పేర్కొంది. దీంతో ఈ ఆదాయం 8.47 బిలియన్ యూరోలకు (రూ.76 వేల కోట్లు) చేరినట్లు తెలిపింది. అలాగే క్లౌడ్ సేల్స్ 20 శాతం పెరిగి 3.7 బిలియన్ యూరోలకు (రూ.33 వేల కోట్లు) చేరినట్లు వెల్లడించింది. -
ఇకపై స్పెషాలిటీ కెమికల్స్ జోరు
కరోనా మహమ్మారి తదుపరి ప్రపంచ కెమికల్ దిగ్గజాలు సరఫరాల చైన్‌ను పునర్వ్యవస్థీకరించే సన్నాహాలు ప్రారంభించాయి. తద్వారా చైనాయేతర దేశాల కంపెనీలపై దృష్టి సారిస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీలు సామర్థ్య విస్తరణను చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఇకపై స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీలు మరింత మెరుగైన పనితీరు చూపే వీలున్నట్లు పలువురు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. దేశీయంగా టాప్ పొజిషన్లో ఉన్న స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీలు కొంతకాలంగా విస్తరణ కార్యకలాపాలు అమలు చేస్తున్నాయి. దీంతో ప్రొడక్టుల లభ్యత పెరగనుంది. మరోవైపు కోవిడ్–19 తదుపరి ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనడం, ఆర్థిక వ్యవస్థలు పురోగమన పథం పట్టడం వంటి అంశాలు పలు రంగాలకు జోష్‌నిస్తున్నాయి. వీటిలో స్పెషాలిటీ కెమికల్ పరిశ్రమ సైతం చేరనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి పలు గ్లోబల్ కెమికల్ దిగ్గజాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. రిస్కులను తగ్గించుకునే వ్యూహాలు దీనికి కారణంకాగా.. ఇందుకు అనుగుణంగా భారత్ వంటి దేశాలవైపు చూస్తున్నా యి. ఇదే సమయంలో పలు అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలోనూ డిమాండుపై అంచనాలతో దేశీ కంపెనీలు తయారీ సామర్థ్యాలను పెంచుకుంటూ రావడం మరిన్ని అవకాశాలకు దారిచూపనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వెరసి స్పెషాలిటీ కెమికల్స్‌కు పెరగనున్న డిమాండును అందుకునే బాటలో దేశీ పరిశ్రమ ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. చైనాకు చెక్ కోవిడ్–19 సవాళ్ల తదుపరి ఏడాది కాలంగా స్పెషాలిటీ కెమికల్స్ పరిశ్రమ ఊపందుకుంది. ఓవైపు చైనాకు ప్రత్యామ్నాయాల అన్వేషణలో భాగంగా ఇతర దేశాల కంపెనీలపై గ్లోబల్ కెమికల్ దిగ్గజాలు దృష్టిసారిస్తుంటే.. మరోపక్క యూరోపియన్ కెమికల్ దిగ్గజాలు భారత్ మార్కెట్‌వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు ప్రధానంగా యూరోప్‌లో తయారీ వ్యయ, ప్రయాసలతో కూడుకోవడం ప్ర భావం చూపుతోంది. భారత్ నుంచి చౌకగా ప్రొడక్టులను ఔట్సోర్సింగ్ చేసుకునేందుకు వీలుండటం ఇందుకు సహకరిస్తున్నట్లు నిపుణులు విశ్లేషించారు. నిజానికి ఈ రంగంలో దేశీయంగా పలు కంపెనీలు ప్రొడక్టులను భారీగా ఎగుమతి చేస్తున్నాయి. అయితే ఇకముందు ఔట్సోర్సింగ్ మరింత పుంజుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త మాలిక్యూల్స్.. కొద్ది రోజులుగా స్పెషాలిటీ కెమికల్ తయారీ ముడివ్యయాలు తగ్గుతూ వస్తున్నాయి. దీనికితోడు ఇంధన వ్యయాలూ దిగివస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా కొత్త మాలిక్యూల్స్, ప్రాసెస్‌పై కొన్ని కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. అంతేకాకుండా సొంతంగా ముడిసరుకులను సమకూర్చుకోవడం, దిగుమతి ప్రొడక్టులకు ప్రత్యామ్నాయాల అన్వేషణ, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు వంటి వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తద్వారా గ్లోబల్ దిగ్గజాల నుంచి దీర్ఘకాలిక సరఫరా కాంట్రాక్టులను పొందడంపై కన్నేసినట్లు నిపుణులు పేర్కొన్నారు. షేర్లపై ఎఫెక్ట్ పటిష్ట అమ్మకాలు సాధిస్తున్న స్పెషాలిటీ కెమికల్ కంపెనీల స్టాక్స్ గత కొన్నేళ్లుగా లాభాలతో దూసుకెళ్లడంతో ఇటీవల కొంతమేర దిద్దుబాటును చవిచూస్తున్నాయి. గత 5–7 ఏళ్ల కాలాన్ని పరిగణిస్తే పలు దిగ్గజాల షేర్లు రెటింపునకుపైగా బలపడ్డాయి. అయితే కొద్ది నెలలుగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆర్థిక మందగమన భయాలు వంటి ప్రతికూలతలతో వెనకడుగు వేస్తున్నాయి. 52 వారాల గరిష్టాలతో పోలిస్తే ఎస్ఆర్ఎఫ్, దీపక్ నైట్రైట్, ఆర్తి ఇండస్ట్రీస్, ఆల్కిల్ అమైన్ కెమికల్స్, క్లీన్ సైన్స్ టెక్నాలజీస్ తదితర షేర్లు 20–40 శాతం మధ్య పతనమయ్యాయి. అయినప్పటికీ ఐదేళ్ల సగటు ధరలతో చూస్తే ప్రీమియంలోనే ట్రేడవుతున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ ఆర్జనలపట్ల ఆశావహ అంచనాలు సానుకూల ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. ఇటీవల త్రైమాసిక ఫలితాలలో పీఐ ఇండస్ట్రీస్ ఆదాయం జంప్‌చేయగా.. రిఫ్రిజిరెంట్ గ్యాస్ ధరలతో గుజరాత్ ఫ్లోరో, ఎస్ఆర్ఎఫ్ లబ్ది పొందే వీలుంది. ఎఫ్ఎంసీజీ రంగం ద్వారా గలాక్సీ, ఫైన్ ఆర్గానిక్ మార్జిన్లు మెరుగుపడ్డాయి. ఇక దీపక్, ఆర్తి, జూబిలెంట్ కొంతమేర మార్జిన్ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ప్రత్యేక ప్రొడక్టుల ద్వారా పనితీరు మెరుగుకానున్నట్లు అభిప్రాయపడ్డారు. యాజమాన్యాలు రెడీ దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీ భారీఎత్తున పెరుగుతోంది. అయినప్పటికీ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, దీపక్ నైట్రైట్ తదితరాలు పటిష్ట ఫలితాలు సాధించవచ్చని అంచనా. ఇక ఆర్తి ఇండస్ట్రీస్, నోసిల్, వినతీ ఆర్గానిక్స్, గలాక్సీ సర్ఫక్టాంట్స్, టాటా కెమికల్స్, అనుపమ్ రసాయన్ తదితర దిగ్గజాల యాజమాన్యాలు గ్లోబల్ సరఫరా చైన్ల పునర్వ్యవస్థీకరణతో భారీగా లబ్ది పొందే వీలున్నట్లు ఊహిస్తున్నాయి. వెరసి ఈ రంగంలోని పలు దిగ్గజాలు భవిష్యత్‌లో పటిష్ట పనితీరును ప్రదర్శించే అవకాశముంది. -
ఉద్యోగులకు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజంమైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాకిచ్చింది. దాదాపు 1800మందిని ఉద్యోగాలనుంచి తొలగించింది. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబందించి మొత్తం లక్షా 80వేల మంది ఉద్యోగుల్లో దాదాపు ఒక శాతం మందిపై వేటు వేసింది. అయితే తరువాతి కాలంలో మైక్రోసాఫ్ట్ పునర్నిర్మాణంలో భాగంగా మరింతమందిని నియమించుకోనుందట. కన్సల్టింగ్, కస్టమర్, పార్టనర్ సొల్యూషన్ సహా పలు గ్రూపులలో ఈ తొలగింపులు చేసింది. మైక్రోసాఫ్ట్ సాధారణంగా కొత్త ఆర్థిక ఏడాదికి మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో జూలై 4 సెలవులు తరువాత తాజా ఉద్యోగ కోతలను ప్రకటించింది. అయితే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉద్యోగులను తొలగించామని మైక్రోసాఫ్ట్ వివరించింది. అయితే అన్ని కంపెనీల మాదిరిగానే వ్యాపారాన్ని రివ్యూ చేసుకొని తదనుగుణంగా సర్దుబాట్లు చేసుకుంటామని వెల్లడించింది. అలాగే పెట్టుబడుల విస్తరణ కొనసాగుతుందని, ఫలితంగా మళ్లీ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. -
జీఎంఆర్‌కు స్టాక్ ఎక్స్ఛేంజీల అనుమతి
ముంబై, సాక్షి: మౌలిక రంగ హైదరాబాద్ దిగ్గజం జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలకు స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కోసం చేసిన ప్రతిపాదనలకు ఎక్స్ఛేంజీలు ఆమోదించినట్లు జీఎంఆర్ తాజాగా వెల్లడించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా విమానాశ్రయేతర బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు కంపెనీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలపట్ల ఎలాంటి అభ్యంతరాలూ లేవని ఎక్స్ఛేంజీలు పేర్కొన్నట్లు జీఎంఆర్ తెలియజేసింది. దీంతో ఈ ప్రతిపాదనలపై ఆరు నెలల్లోగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రతిపాదనల్లో భాగంగా కంపెనీ జీఎంఆర్ పవర్ ఇన్ఫ్రా, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా తదితరాకు సంబంధించి విలీనం, సర్దుబాట్లు తదితర చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో కంపెనీ వ్యూహాత్మక రీస్ట్రక్చరింగ్ ప్రణాళికలకు తెరతీసిన విషయం విదితమే. కాగా.. కార్పొరేట్ హోల్డింగ్ స్ట్రక్చర్‌ను సులభతరం చేసేందుకు వీలుగా ఎయిర్పోర్ట్యేతర బిజినెస్‌ను విడదీయనున్నట్లు ఇప్పటికే కంపెనీ తెలియజేసింది. (మార్కెట్ల పతనం- ఫార్మా షేర్ల జోరు) -
1600 ఉద్యోగాలకు కోత
పర్సనల్ కంప్యూటర్ల డిమాండ్ పడిపోవడం హార్డ్ డిస్క్ డ్రైవ్ తయారీ కంపెనీలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. అమెరికాకు చెందిన డేటా స్టోరేజ్ కంపెనీ సీగేట్ టెక్నాలజీ 1600 ఉద్యోగాలకు కోత విధించనున్నట్టు తెలుస్తోంది. లేదా 3శాతం వర్క్ ఫోర్స్ ను తగ్గించుకోనుంది. పునర్ నిర్మాణ ప్రణాళికలో భాగంగా తన కాస్ట్ ను తగ్గించే నేపథ్యంలో సీగేట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే లోపల తన ప్లాన్ ను పూర్తిచేసేందుకు సీగేట్ సిద్ధమైంది. 620 లక్షల డాలర్ల ముందస్తు పన్ను చార్జీలపై ఈ పునర్ నిర్మాణ ఫలితం ప్రభావం చూపించనున్నట్టు సీగేట్ పేర్కొంది. ఈ పునర్ నిర్మాణ ఫలితాలు తన కాస్ట్ ను తగ్గించుకోవడంతో పాటు వార్షిక రన్ రేట్ బేసిస్ లో 1000లక్షల డాలర్ల వరకూ పొదుపుకు సహకరిస్తాయని కంపెనీ వెల్లడించింది. సీగేట్ కంపెనీ ప్రపంచమంతటా 52 వేల ఉద్యోగులను కల్గి ఉంది. సెప్టెంబర్ వరకు 1,050 ఉద్యోగాలకు కోత విధించనుంది. వర్జినల్ ఈక్విప్ మెంట్ తయారీదారులకు, పర్సనల్ కంప్యూటర్ తయారీదారులకు డిమాండ్ క్షీణించడంతో, గత ఐదేళ్లగా సీగేట్ రెవెన్యూలు పడిపోతూ నష్టాలను నమోదుచేస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 35 శాతం వరకు కంపెనీ స్టాక్స్ పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో సీగేట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.