ఎన్నాళ్లీ నిరీక్షణ?
– జనవరిలో ముగిసిన దూరవిద్య పరీక్షలు
– ఫలితాల విడుదలలో జాప్యం
– ఐసెట్ కౌన్సెలింగ్కు ఎదురుకానున్న ఇబ్బందులు
ఎస్కేయూ : వర్సిటీ దూరవిద్య విధానం ద్వారా వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ రెండు, మూడో సంవత్సరం పరీక్షలు సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే జనవరిలో నిర్వహించారు. నెల రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించినప్పటికీ ఆ విధంగా చర్యలు తీసుకోలేదు.
ఎదురుచూపు..
డిగ్రీ కోర్సులకు సంబంధించి రెండు, మూడు సంవత్సరాల పరీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 వేల మంది రాశారు. ఇప్పటికే ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐసెట్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు అయింది. మరో వైపు వర్సిటీలలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగుతున్నాయి. ఎస్కేయూ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే స్కూసెట్–2017 ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ముగిసిన రెండు రోజులకే ఆయా వర్సిటీలు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు ఫలితాలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ ఫలితాలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
అకడమిక్ క్యాలెండర్ ఇయర్ గాడిలో పడేనా?
రెగ్యులర్ కోర్సులకు నిర్వహించినట్లే పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన దూరవిద్య విధానలంలో కూడా అమలు చేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అకడమిక్ క్యాలెండర్ ఇయర్ గాడిలో పడితేనే విద్యార్థులకు విద్యాసంవత్సరం వృథా కాదని చెబుతున్నారు.
త్వరలో డిగ్రీ ఫలితాలు ప్రకటిస్తాం..
ఐసెట్ కౌన్సెలింగ్లోపే దూరవిద్య డిగ్రీ ఫలితాలను ప్రకటిస్తాం. ఇప్పటికే మూల్యాంకనం ప్రక్రియ పూర్తి అయింది. మార్కుల నమోదును పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించాం. రెగ్యులర్ డిగ్రీ ఫైనలియర్ ఫలితాలు ఈ నెల 30 లోపు విడుదల చేయనున్నాం. విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సకాలంలోనే సర్టిఫికెట్లు జారీ చేస్తాం.
– జే.శ్రీరాములు, ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్, ఎస్కేయూ.