Retired RTC Employees
-
ఇస్రోలో మనోడు
నంద్యాల: చంద్రయాన్ –3 విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభను అందరూ అభినందిస్తున్నారు. అలాంటి శాస్త్రవేత్తల్లో కూడా మన జిల్లాకు చెందిన వారు ఉండటం విశేషం. బేతంచెర్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ముళ్ల మీరం సాహెబ్, వాహిదా దంపతుల పెద్ద కుమారుడు డాక్టర్ సలీం బాషా ప్రస్తుతం ఇస్రోలో శాస్త్రవేత్తగా సేవలు అందిస్తున్నారు. ఈయన 5వ తరగతి వరకు పట్టణంలోని సర్వస్వతి విద్యామందిర్, ఆ తర్వాత శేషారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. అనంతపురం జేఎన్టీయూ పాలిటెక్నిక్, జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వ విద్యాలయంలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. 2006లో ఇస్రోలో జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో పీహెచ్డీ డాక్టరేట్ 2021 పొందారు. ప్రస్తుతం లీడ్ సైంటిస్టుగా ఇస్రోలో కొనసాగుతున్నారు. ఎన్నో ఇస్రో మిషన్స్‌లో పాత్ర పోషించిన సలీం బాషా చంద్రయాన్ –2, చంద్రయాన్–3లో థర్మల్ డిజైనింగ్ లీడ్ సైంటిస్టుగా పాత్ర పోషించారు. దేశం కోసం కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తున్న శాస్త్రవేత్తల్లో బేతంచెర్ల వాసి ఉండటంతో అతని కుటుంబ సభ్యులు మహబూబ్ బాషా, ఉసేన్ బాషా, రూహిద్ అక్రం, వాసిమ్ అక్రమ్‌తో పాటు పట్టణ ప్రజలు, పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీ'ఛీ'..ప్రాణాలతో చెలగాటం
కర్నూలు–1 డిపోకు చెందిన డ్రైవర్ నజీర్అహ్మద్ ఏప్రిల్ 10న విధి నిర్వహణలో భాగంగా హైదరాబాదుకు వెళ్తూ గుండెపోటుకు గురయ్యారు. 55ఏళ్ల వయస్సు పైబడి కార్మికులను ఆర్డినరీ సర్వీసులకే పంపాలనే నిబంధన ఉన్నా ఇతన్ని ఇంద్ర ఏసీ బస్సుకు పంపించారు. అదృష్టవశాత్తు హైదరాబాదుకు చేరుకున్నాకే మృత్యువాత పడడంతో ప్రయాణికులకు ఎలాంటి అపాయం జరగలేదు. కర్నూలు(రాజ్‌విహార్): అసలే దసరా పండుగ సీజన్.. బస్సుల్లో కాలు తీసి కాలు పెట్టేందుకు కూడా వీలుండదు.. పిల్లాపాపలతో ఎక్కడెక్కడి నుంచో సొంత గ్రామాలకు చేరుకోవాలన్న ఆత్రుత ప్రయాణికులది. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఆర్టీసీ.. చార్జీ పెంచి భద్రతను గాలికొదిలేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమంటూ ప్రకటనలు గుప్పించే అధికారులు కిక్కిరిసిన బస్సులను పదవీ విరమణ చెందిన డ్రైవర్ల చేతుల్లో పెట్టి చోద్యం చూశారు. అదృష్టం బాగుండి ఏమీ కాలేదు కానీ జరగరానిది జరిగివుంటే బాధ్యులెవరు?. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమా అంటూ ఆర్టీసీని ఛీదరించుకుంటున్నారు. ఆదాయంపైనే దృష్టి.. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవడమే తప్ప సురక్షిత ప్రయాణాలపై దృష్టి సారించడంలేదు. ప్రత్యేక బస్సుల్లో 1.5 శాతం చార్జీలు వసూలు చేసి, ఖజానా నింపుకుంటోంది కానీ ప్రయాణికుల క్షేమాన్ని పట్టించుకోవడం లేదు. దసరా సమయంలో రిటైర్డు డ్రైవర్లతో స్పెషల్ బస్సులకు నడిపించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడింది. వయస్సు మీరడంతో అన్‌ఫిట్‌గా భావించి పదవీ విరమణ చేయించిన తొమ్మిది మందితో బస్సులు నడిపించడమే అందుకు నిదర్శనం. కర్నూలు–1డిపో నుంచి ముగ్గురిని అనంతపురం (స్పెషల్ టైప్ లాంగ్ సర్వీస్)కు పంపించారు. వీరితోపాటు నంద్యాల, మరో డిపోలో కూడా పదవీ విరమణ పొందిన వాళ్లకు విధులు అప్పగించినట్లు తెలుస్తోంది. అత్యధిక ఆదాయం వచ్చిందని సంబరపడుతున్నా.. ఏదైనా జరిగితే బాధ్యులెవరనేది ఆర్టీసీ అధికారులే చెప్పాలి. ఆ నిబంధనకు అందుకే దూరం నిబంధన ప్రకారం 58 ఏళ్లు నిండిన డ్రైవర్ పదవీ విరమణకు అర్హుడు. కార్మికుడి శారీరక, మానసిక పరిస్థితులను బట్టి ఈ నిబంధన అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ శాఖలతోపాటు విద్యుత్ శాఖ (కార్పొరేషన్) ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60ఏళ్లకు పెంచినా ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు ఇది వర్తింపజేయలేదు. 58 ఏళ్ల తరవాత బస్సులు నడపడం సరి కాదని, 60ఏళ్ల విధానం అమల్లోకి వస్తే ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించి ఆ నిబంధనకు దూరం చేశారు. స్థానిక అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్సులను చేతుల్లో పెట్టి పంపడం విమర్శలకు తావిస్తోంది. కిలో మీటరుకు రూ.2 చొప్పున చెల్లింపు పదవీ విరమణ పొందిన కార్మికులకు విధులు అప్పగించి కిలో మీటరుకు రూ.2 చొప్పున చెల్లించారు. అనంతపురానికి వెళ్లి వస్తే 298కిలో మీటర్లుకు రూ.596 చెల్లించారు. -
ఆర్టీసీ ‘ఉచిత ప్రయాణం’లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాలను మరింత మెరుగుపరుస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విశ్రాంత ఉద్యోగ దంపతులు డీలక్స్ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించొచ్చు. గతంలో వెసులుబాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకే ఉండేది. ఇక సూపర్ లగ్జరీ, ఆపై రకం బస్సుల్లో 50 శాతం చార్జితో ప్రయాణించొచ్చు. ఈ వసతి జీవితాంతం ఉంటుంది. విశ్రాంత ఉద్యోగి మరణిస్తే భార్య/భర్తకు జీవితాంతం ఆ వెసులుబాటు వర్తిస్తుంది. సర్వీసులో ఉన్న ఉద్యోగులు మరణిస్తే స్పౌజ్‌కు ఈ వెసులుబాటు అన్ని రకాల సిటీ సర్వీసుల్లో కూడా లభిస్తుంది.