RFID system
-
కొత్త ఈ-పాస్ పోర్ట్‌లను హ్యాక్ చేస్తే ఇక అంతే సంగతులు..!
న్యూఢిల్లీ: రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) చిప్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో ఈ-పాస్ పోర్ట్‌లను త్వరలో జారీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ రాజ్యసభలో మాట్లాడుతూ.. దరఖాస్తుదారుడి వ్యక్తిగత వివరాలు పాస్ పోర్ట్ బుక్ లెట్'లో పొందుపరిచిన చిప్‌లో డిజిటల్ రూపంలో నిల్వ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం ఈ- పాస్ పోర్ట్‌లను జారీ చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. "దేశ పౌరులకు అధునాతన భద్రతా లక్షణాలతో కూడిన చిప్ ఆధారిత ఈ- పాస్ పోర్ట్‌లను జారీ చేయాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ పాస్ పోర్ట్ లో కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్ టెక్నాలజీ ఉంటుంది. పాస్ పోర్ట్ ముందు లేదా వెనుక కవర్ లేదా పేజీలో పొందుపరిచిన ఎంబెడెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) చిప్ కూడా ఉంటుంది"అని ఈ- పాస్ పోర్ట్‌లపై అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఆయన తెలిపారు. ఇందులో ప్రమాణాలను ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సంస్థ అయిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఎఒ) మార్గదర్శకాలకు అనుగుణంగా "చిప్ లక్షణాలు" ఉన్నాయని ఆయన అన్నారు. "దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలు చిప్‌లో డిజిటల్ రూపంలో నిల్వ చేస్తారు. ఈ చీప్ భౌతిక పాస్ పోర్ట్ బుక్ లెట్ ఉంటుంది" అని మంత్రి తెలిపారు. "ఒకవేళ ఎవరైనా చిప్‌లను హ్యాక్ చేసినట్లయితే, కేంద్రం దగ్గర ఉన్న సీస్టమ్ దానిని గుర్తిస్తుంది. ఫలితంగా ఆ పాస్ పోర్ట్‌ను రద్దు చేస్తారని" ఆయన అన్నారు. దీంతో మోసాలు, ట్యాంపరింగ్ నుంచి దేశ పౌరులకు రక్షణ లభిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో 93 పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు, 428 పోస్టాఫీసు పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయని మురళీధరన్ తెలిపారు. ఈ కొత్త సీస్టమ్ వల్ల విమానాశ్రయాల వద్ద చెకింగ్ టైమ్ కూడా తగ్గుతుంది అని తెలిపారు. (చదవండి: ఈ రూల్ ఫాలో కాకుంటే..! మీ చెక్ బౌన్స్ అయ్యే అవకాశం..!) -
ఇక వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
న్యూఢిల్లీ: కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 15వ తేది నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. ఇక నుంచి ఫాస్ట్ టాగ్ లేకుండా టోల్ ఫీజు చెల్లించాలనుకుంటే మాత్రం రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ గడువు తేది దగ్గర పడుతుండటంతో ఈ కొత్త విధానంపై కేంద్రం ప్రజలకు అవగాహనా కల్పించడం కోసం కేంద్రం ప్రకటనలు ఇస్తుంది. అయితే కొత్త ఫాస్టాగ్ విధానంపై చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్!) ఇప్పుడు అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేయబడింది. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా టోల్ ఫీజ్ ఆటోమేటిక్ చెల్లించవచ్చు. ఈ ఫాస్టాగ్ పొదుపు ఖాతా లేదా డిజిటల్ వాలెట్‌తో అనుసంధానించబడుతుంది. దీనిని మీ ఫోర్ వీలర్ వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చిన ఒక బార్ కోడ్ స్టిక్కర్. దీని ద్వారా టోల్ చెల్లించడానికి మీరు వాహనం ఆపవలసిన అవసరం లేదు. టోల్‌ను దాటేటప్పుడు సమయం, ఇంధనం ఆదా చేయడం, ట్రాఫిక్‌ను తగ్గించడం కోసం ఈ ఫాస్టాగ్ విధానాన్ని తప్పని సరి చేసింది. ఫాస్టాగ్ ఎక్కడ పొందవచ్చు? ఫాస్టాగ్ లను ఏదైనా బ్యాంకు లేదా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీనికోసం ఐసిఐసిఐ, ఎస్బిఐ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. ఇదే కాకుండా, టోల్ ప్లాజా, ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే "మై ఫాస్టాగ్ యాప్"ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ ఫామ్ లు గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం వంటి యాప్‌లు కూడా ఫాస్టాగ్ ను అందిస్తున్నాయి.(చదవండి: జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం) ఈ ఫాస్టాగ్ లో వాహనం రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన ఒక బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ ను వాహనం ముందు అద్దం లేదా సైడ్ మిర్రర్ పై స్టిక్కర్ లా అతికిస్తారు. కాగా, ఇది జారీ చేసిన తేదీ నుండి ఐదేళ్ల కాలం పాటు చెల్లుతుంది. దీన్ని కొనుగోలు చేసిన తర్వాత మీరు "మై ఫాస్ట్ ట్యాగ్" మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లో మీ వివరాలు, ఫాస్టాగ్ వివరాలు సమర్పించిన తర్వాత ఆక్టివేట్ చేసుకోవచ్చు. ఆర్సి లేకుండా ఫాస్టాగ్ తీసుకోవచ్చా? ఆర్సి లేకుండా ఫాస్టాగ్ తీసుకోలేము. ఆర్సి అనగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఫాస్టాగ్ తిసుకోవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉండాలి. ఫాస్ట్ ట్యాగ్ బదిలీ చేయవచ్చా? మీ వాహనం యొక్క ఫాస్టాగ్ మరెవరికీ బదిలీ చేయకూడదు. మీరు వాహనాన్ని విక్రయిస్తుంటే మీ వాహనం యొక్క ఫాస్టాగ్ ఖాతాను నిలిపివేయాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ను ఎలా రీఛార్జ్ చేసుకోవాలి? ఫాస్టాగ్ డిజిటల్ వాలెట్ ను క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలతో రీచార్జ్ చేసుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్‌పే వంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లా ద్వారా కూడా ఫాస్టాగ్ వాలెట్ ను రీచార్జి చేసుకోవచ్చు. ఫాస్టాగ్ చెల్లింపుల నుంచి ఎవరికి మినహాయింపు? న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, ఎమర్జెన్సీ సర్వీస్ వర్కర్స్ ఫాస్టాగ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీరికి ఫాస్టాగ్ చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది. -
పోలీసు అభ్యర్థులకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్
సాక్షి, హైదరాబాద్ : భారీ స్థాయి ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. నియామకాల్లోని దేహదారుఢ్య పరీక్షలు, పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్ వంటి పరీక్షల్లో కచ్చితత్వం కోసం టెక్నాలజీ వినియోగించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు మౌఖిక పద్ధతిలోనే లక్ష్యా న్ని చేరుకున్న అభ్యర్థులను గుర్తించేవారు. గతంలో అభ్యర్థి పరుగు ప్రారంభించిన సమయంలో స్టాప్‌వాచ్ ద్వారా ఎన్ని సెకన్లు, ఎన్ని నిమిషాల్లో చేరారో లెక్కగట్టేవారు. ఇలా అయితే అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. దూకిన దూరం.. షాట్ పుట్ విసిరిన దూరాలను కచ్చితత్వంతో గుర్తించేందుకు తొలిసారిగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని బోర్డు ఉన్నతాధికారులు నిర్ణయించారు. లేజర్‌తో స్కానింగ్..! దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా నిర్వహించే పరుగు పందెంలో అభ్యర్థులకు ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వె న్సీ ఐడెంటిఫికేషన్)చిప్‌ను అమరుస్తారు. పరుగు ప్రారంభించిన క్షణం నుంచి లక్ష్యాన్ని చేరుకునే వరకు కంప్యూటర్లలో ఆటోమెటిక్‌గా రికార్డయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. అభ్యర్థి లక్ష్యాన్ని చేరుకునే స్థానంలో లేజర్ బీమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా లక్ష్యాన్ని ఎవరు ముందు చేరుకున్నారో తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు. షాట్‌పుట్‌లో ఎంత దూరం విసిరారన్నదానికి, లాంగ్‌జంప్‌లో దూరాన్ని లేజర్ బీమ్స్ ద్వారా లెక్కగట్టేలా ఏర్పాట్లు చేయనున్నారు. 41 వేల మంది దరఖాస్తు.. పోలీస్, ఫైర్, జైళ్ల విభాగాల్లో భర్తీ చేయనున్న 18 వేల పోస్టులకు ఈ నెల 9 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అయితే అధికారులు ఊహిం చిన దరఖాస్తులకు, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. సబ్ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ తదితర పోస్టులన్నింటికీ కలిపి 41 వేల దరఖాస్తులే వచ్చినట్లు తెలిసింది. అధికారులు మాత్రం మొదటి వారంలోనే కనీసం లక్ష నుంచి 2 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని భావించినట్లు సమాచారం. చివరి వారంలో దరఖాస్తుల సంఖ్య ఒకేసారి పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం ప్రిపరేషన్‌పై అభ్యర్థులు దృష్టిసారించి ఉంటారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
చిల్లర గొడవలకు త్వరలో కాలం చెల్లు
సాక్షి, ముంబై : ఇక మీదట బెస్ట్ బస్సు ప్రయాణికులు చిల్లర కోసం కండక్టర్‌తో గొడవకు దిగాల్సిన అవసరమే లేదు. బెస్ట్ సంస్థ కొన్ని బస్సుల్లో ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్ఐడీ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈ వ్యవస్థ వల్ల ప్రయాణికులు తమ కార్డులను వినియోగించగానే టికెట్ తాలూకు సొమ్ము అందులో నుంచి దానంతట అదే తీసుకుంటుంది. ఈ వ్యస్థ అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉందని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రయాణికులు తమ ప్రీపెయిడ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) కార్డును బస్సుల్లో అమర్చిన ఈ-వాలిడేషన్ ముందు డిస్ప్లే చేస్తారు. దీంతో చార్జీ మొత్తం అందులో నుంచి తగ్గిపోతుంది. ఈ వ్యవస్థను బెస్ట్‌కు చెందిన శీతల బస్సుల్లో ఏర్పాటు చేశారు. ఈ-వాలిడేటర్‌ను బస్సు ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలవద్ద ఏర్పాటు చేశారు. బస్సుల్లోకి ప్రవేశించే ముందు ప్రయాణికులు తమ ఆర్ఎఫ్ఐడీ కార్డులను ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు బస్సులో నుంచి దిగే సమయంలో కూడా తిరిగి కార్డును ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. దీంతో వీరు ఎంత దూరం ప్రయాణించారో అంత దూరం వరకు చార్జీ ప్రీపెయిడ్ కార్డులో తగ్గిపోతుంది. ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని బెస్ట్ సంస్థ జనరల్ మేనేజర్ ఓ.పి.గుప్తా పేర్కొన్నారు. అయితే ఈ వ్యవస్థ ఏర్పాటు కారణంగా తలుపులను మూసి ఉంచాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-వాలిడేటర్లు మామూలు బస్సుల్లో పని చేయవన్నారు. మరోవైపు కండక్టర్లు ఎప్పటి మాదిరిగానే టికెట్లను జారీ చేయొచ్చు. ప్రయాణికులకు కూడా కార్డు విషయంలో తమ సహాయ సహకారాలు అందిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.