సాక్షి, ముంబై : ఇక మీదట బెస్ట్ బస్సు ప్రయాణికులు చిల్లర కోసం కండక్టర్‌తో గొడవకు దిగాల్సిన అవసరమే లేదు. బెస్ట్ సంస్థ కొన్ని బస్సుల్లో ఏర్పాటు చేసిన ఆర్‌ఎఫ్‌ఐడీ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈ వ్యవస్థ వల్ల ప్రయాణికులు తమ కార్డులను వినియోగించగానే టికెట్ తాలూకు సొమ్ము అందులో నుంచి దానంతట అదే తీసుకుంటుంది.
ఈ వ్యస్థ అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉందని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రయాణికులు తమ ప్రీపెయిడ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) కార్డును బస్సుల్లో అమర్చిన ఈ-వాలిడేషన్ ముందు డిస్‌ప్లే చేస్తారు. దీంతో చార్జీ మొత్తం అందులో నుంచి తగ్గిపోతుంది. ఈ వ్యవస్థను బెస్ట్‌కు చెందిన శీతల బస్సుల్లో ఏర్పాటు చేశారు. ఈ-వాలిడేటర్‌ను బస్సు ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలవద్ద ఏర్పాటు చేశారు. బస్సుల్లోకి ప్రవేశించే ముందు ప్రయాణికులు తమ ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డులను ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా వీరు బస్సులో నుంచి దిగే సమయంలో కూడా తిరిగి కార్డును ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. దీంతో వీరు ఎంత దూరం ప్రయాణించారో అంత దూరం వరకు చార్జీ ప్రీపెయిడ్ కార్డులో తగ్గిపోతుంది. ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని బెస్ట్ సంస్థ జనరల్ మేనేజర్ ఓ.పి.గుప్తా పేర్కొన్నారు. అయితే ఈ వ్యవస్థ ఏర్పాటు కారణంగా తలుపులను మూసి ఉంచాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-వాలిడేటర్లు మామూలు బస్సుల్లో పని చేయవన్నారు. మరోవైపు కండక్టర్లు ఎప్పటి మాదిరిగానే టికెట్లను జారీ చేయొచ్చు. ప్రయాణికులకు కూడా కార్డు విషయంలో తమ సహాయ సహకారాలు అందిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
చిల్లర గొడవలకు త్వరలో కాలం చెల్లు
Published Thu, Nov 20 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM
Advertisement