riffle shooting
-
జాతీయ రైఫిల్ కొత్త అధ్యక్షుడిగా కాళికేశ్
న్యూఢిల్లీ: జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) నూతన అధ్యక్షుడిగా కాళికేశ్ నారాయణ్ సింగ్ దేవ్ ఎన్నికయ్యారు. శనివారం కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన రైఫిల్ సంఘం జనరల్ బాడీ మీటింగ్ ఎన్నికల్లో ఒరిస్సాకు చెందిన మాజీ ఎంపి కాళికేశ్ 36–21 ఓట్ల తేడాతో ప్రత్యర్థి వి.కె.ధల్‌పై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. కొన్నాళ్లుగా కాళికేశ్ ఎన్ఆర్ఏఐ రోజూవారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. జాతీయ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యల్లో ఎవరైనా గరిష్టంగా 12 ఏళ్లకు మించి పదవుల్లో ఉండటానికి వీలు లేదు. దీంతో 2010 నుంచి 2022 వరకు పలు దఫాలు అధ్యక్షుడిగా ఎన్నికైన రణీందర్ సింగ్ గతేడాది కేంద్ర క్రీడాశాఖ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు.అప్పటినుంచి సీనియర్ ఉపాధ్యక్షుడైన కాళికేశ్ జాతీయ రైఫిల్ సంఘం వ్యవహారాలను చక్కబెట్టారు. తాజా ఎన్నికతో ఆయన 2025 వరకు అధ్యక్ష పదవిలో ఉంటారు. ఆయన తాత్కాలిక బాధ్యతలు నిర్వహించిన హయాంలోనే పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. అంతకుముందు జరిగిన రియో–2016, టోక్యో–2020 ఒలింపిక్స్‌లో భారత షూటర్లు ఒక్క పతకం కూడా గెలుపొందలేకపోయారు. -
మెహందీ డిజైన్లు వేసుకుంటూ రైఫిల్ షూటర్‌గా ఎదిగిన బనారస్ అమ్మాయి
అరచేతిలో అందమైన మెహిందీ డిజైన్లను నేర్పుగా వేస్తూ అందమైన జీవితం కోసం కలలు కంటూ ఉండేది పూజావర్మ. తన కలకో లక్ష్యాన్ని ఏర్పరుచుకుని రైఫిల్ షూటర్ కావాలనుకుంది. పండగలు, పెళ్ళిళ్లకు అమ్మాయి చేతుల్లో మెహిందీ డిజైన్స్ వేస్తూ అలా వచ్చిన డబ్బుతో షూటర్‌గా నైపుణ్యం సాధించింది. రాష్ట్రస్థాయి పోటీల్లో నెంబర్‌వన్ షూటర్‌గా నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బనారస్ వాసి అయిన 26 ఏళ్ల పూజావర్మ తన కలను సాకారం చేసుకునేందుకు చేస్తున్న కృషి అందరినీ ఆకట్టుకుంటోంది. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పెద్ద పెద్ద కలలు కనగానే సరిపోదు, కలల సాధనకు ఎంతటి కష్టమైనా భరించాల్సిందే అని ఇరవై ఆరేళ్ల్ల పూజా వర్మను చూస్తే అర్ధమవుతుంది. సవాళ్లతో కూడిన ఆమె జీవనశైలి నవతరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇటీవల మీడియాకు వివరించిన ఆ స్ఫూర్తివంతమైన కథనం ఆమె మాటల్లోనే... అప్పుగా ఐదు లక్షలు ‘నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను. అక్కడ ఎన్సీసీ వల్ల క్రీడలపై ఆసక్తి ఏర్పడింది. అక్కడే షూటింగ్ రైఫిల్‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో స్కూల్ నుంచే రైఫిళ్లు, బుల్లెట్లు ఉచితంగా వచ్చేవి. ఇది చాలా ఖరీదైన గేమ్ అని నాకు అప్పుడు తెలియదు. స్కూల్ అయిపోగానే ఉచితంగా వచ్చే అవకాశాలన్నీ పోయాయి. కానీ, షూటింగ్లో దేశం పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని కల కనేదాన్ని. అయితే, ఇంటి ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. అమ్మ గృహిణి. నాన్న డ్రైవర్. అన్నయ్య బట్టల దుకాణం నడుపుతున్నాడు. అక్క పెళ్లి కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సాధారణ కుటుంబంలోనైనా ఆడపిల్లలు పెద్ద పెద్ద కలలు కనడానికి వీలు లేదు. కానీ, నా కుటుంబం మాత్రం అడుగడుగునా నాకు అండగా నిలిచింది. 2015లో నేషనల్ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధం కావడానికి నాకు సొంత రైఫిల్ అవసరం. ఐదు లక్షలకన్నా తక్కువ ధరకు రైఫిల్ అందుబాటులో లేదు. రోజుకు మూడు షిప్టులలో వేర్వేరు ఉద్యోగాలు చేసేదాన్ని. అయినా అంత డబ్బు సమకూరలేదు. అమ్మనాన్న, మా అన్న డబ్బు అప్పు తెచ్చి ఇచ్చారు. రైఫిల్ కొన్నాను. మొదటిసారి నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఏడు సంవత్సరాలుగా అప్పు తీరుస్తూనే ఉన్నాం. శిక్షణకు సాయం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ కోచ్ బిప్లాప్ గోస్వామిని కలిశాను. నాలో ఆసక్తి, ప్రతిభ గమనించి, డబ్బులు తీసుకోకుండానే శిక్షణ ఇవ్వడానికి సాయం చేశారు. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి రాష్ట్ర ఛాంపియన్షిప్ వరకు ఫెడరేషన్ సహాయంతో చాలా సార్లు రైఫిల్స్‌ను అరువుగా తీసుకున్నాను. ఇలాగే జిల్లా నుండి రాష్ట్రానికి తరువాత జాతీయస్థాయి పోటీలకు వెళ్లగలిగాను. షూటర్ ప్రాక్టీస్‌కు షూటింగ్ రేంజ్ అవసరం. ఇతర క్రీడల మాదిరిగా పార్కులోనో, దగ్గరలో ఉన్న మైదానంలోనో ప్రాక్టీస్ చేయలేం. అందుకే రెండేళ్ల క్రితం డిస్ట్రిక్ట్ రైఫిల్ క్లబ్ ఆఫ్ బనారస్‌కు చేరుకున్నాను. క్లబ్ ఎంట్రీ ఫీజు 12 వేల రూపాయలు. ఇది నాకు చాలా పెద్ద మొత్తం. ఒకేసారి చెల్లించలేనని సిటీ మెజిస్ట్రేట్ ఆఫీసు చుట్టూ నెల రోజులు ప్రదక్షణలు చేస్తే, చివరకు వాయిదాల పద్ధతిలో డబ్బు కట్టడానికి అంగీకరించారు. జాతీయ స్థాయి శిబిరానికి వెళ్లడానికి రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. కానీ, కరోనాతో ఆ అవకాశమూ పోయింది. ఒక రైఫిల్ బుల్లెట్ ధర 30 నుంచి 32 రూపాయలు. ఒక గేమ్ ఆడటానికి కనీసం 70 నుంచి 80 బుల్లెట్లు ఖర్చవుతాయి. దీంతో అత్యంత ఖరీదైన క్రీడలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన బుల్లెట్లు కూడా అవసరం. దేశంలో ఎక్కడైనా ఛాంపియన్షిప్ పోటీలు జరిగితే రిజిస్ట్రేషన్ ఫీజు, బుల్లెట్ల కొనుగోలు, బస–వసతి సదుపాయలు, ప్రయాణ ఖర్చులు.. అన్నీ కలిపి 15 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. వీలైనన్ని ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనడానికి నా వద్ద అంత డబ్బు లేదు. మెహందీ డిజైన్లు.. డ్రైవింగ్.. రాష్ట్రస్థాయి అధికారులను కలిశాను. కానీ, ఎలాంటి సాయమూ అందలేదు. చుట్టుపక్కల స్కూళ్లలో పిల్లలకు క్రీడలలో శిక్షణ ఇస్తుంటాను. పెళ్లి, వివిధ సందర్భాలలో జరిగే వేడుకలలో మెహందీ డిజైన్లు వేస్తాను. అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పిస్తాను. ఇలా రెండేళ్లపాటు కృషి చేస్తే కొంత డబ్బు జమయ్యింది. 2021 నుండి మళ్లీ ఆడటం ప్రారంభించాను. 43వ యుపి స్టేట్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 3 బంగారు పతకాలు సాధించాను. స్టేట్ నెంబర్ 1 ర్యాంకులో నిలిచాను. ఇప్పుడు జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించడానికి శిక్షణ తీసుకుంటున్నాను. బ్యాచులర్ ఆఫ్ ఫిజికెల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాను. మాస్టర్స్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను’’ అని తన కల కోసం, లక్ష్య సాధనకు చేస్తున్న కృషి గురించి వివరిస్తుంది పూజావర్మ. లక్ష్య సాధనలో.. షూటింగ్ బోర్డ్‌లోని లక్ష్య కేంద్రాన్ని బుల్సీ షూటింగ్ లేదా బుల్స్ ఐ అంటారు. రైఫిల్ షూటింగ్ అంటే అంత సులువు కాదు. లక్ష్యాన్ని చాలా ఖచ్చితత్వంతో ఛేదించాలి. ‘మావలంకర్’ షూటింగ్ పోటీలో బెస్ట్ క్యాడెట్, 41వ రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీల్లో త్రీ పొజిషన్ రైఫిల్‌లో బంగారు పతకం, ఆర్మీ క్యాంపు షూటింగ్లో బంగారు పతకాలు సాధించింది. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం.. తూటా రూట్ మారెన్
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం చోటు చేసుకున్న రోజు జరిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) బలగాల కాల్పులపై స్పష్టత వచ్చింది. ఇవి నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. సాంకేతిక అంశాలు పరిశీలించిన నేపథ్యంలో బలగాలు గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ రికోచెట్ కారణంగానే పిల్లెట్లుగా మారిన బుల్లెట్లు ఆందోళన కారులపైకి దూసుకువెళ్లినట్లు తేల్చారు. ఈ మేరకు సమగ్ర నివేదికను రూపొందించారు. ఆందోళనకారులను చెదరగొట్టాలనే.. విధ్వంసానికి దిగిన ఆందోళనకారులతో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వారిని చెదరగొట్టాలని భావించారు. దీనికోసం గాల్లోకి కాల్పులు జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే స్టేషన్లో ఇంజిన్లకు విద్యుత్ సరఫరా చేసే 220 కేవీ విద్యుత్ తీగలు ప్రతి ప్లాట్‌ఫాంపైనా ఉంటాయి. అలాంటప్పుడు తుపాకులు పైకెత్తి, నేరుగా గాల్లోకి కాల్పులు జరిపితే బుల్లెట్లు తగిలి విద్యుత్ తీగలు తెగే ప్రమాదం ఉంది. అదే జరిగి ఆ తీగలు కింద ఉన్న ఆందోళనకారులు, అధికారులుపై పడితే ప్రాణనష్టం భారీగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆర్పీఎఫ్ బలగాలు నేరుగా పైకెత్తి కాకుండా తుపాకులను కాస్త వాలుగా ఉంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల కోసం ఆర్పీఎఫ్ బలగాలు వినియోగించిన తుపాకులు ఇన్సాస్ రైఫిళ్లు. వీటిలో 5.56 క్యాలిబర్ తూటాలను వాడతారు. ఇది కనిష్టంగా 400 మీటర్ల దూరం దూసుకుపోతుంది. దీన్నే ఆ తుపాకీ రేంజ్‌గా పిలుస్తారు. లెడ్తో తయారైన ఈ తూటాకు కాపర్ జాకెట్ (పై పొర) ఉంది. మ్యాగ్జైన్లో ఉండే తూటా తుపాకీ కాగ్ అయినప్పుడు ఛాంబర్లోకి చేరుతుంది. అక్కడ ఫైర్ అయ్యాక బ్యారెల్‌గా పిలిచే ముందు భాగం నుంచి అతి వేగంగా దూసుకువస్తుంది. ఈ బ్యారెల్ లోపలి భాగం రింగులతో కూడి ఉండటంతో బుల్లెట్ తన చుట్టూ తాను తిరుగుతూ.. వేగాన్ని పెంచుకుంటూ బయటకు వస్తుంది. ఇలా వచ్చిన తూటా ఎదురుగా గోడ ఉంటే తగిలి కిందపడుతుంది. సాంకేతిక పరిభాషలో ‘రికోచెట్’.. అదే చెక్క, ఫ్లైవుడ్ వంటి ఉంటే వాటిలోకి దూసుకుపోతుంది. గాజు, అద్దాలు ఉంటే వాటినీ ఛిద్రం చేస్తూ తన ‘దారి’లో ముందుకు వెళ్లిపోతుంది. గన్‌పౌడర్, బ్యారెల్‌లోని రింగుల ద్వారా వచ్చిన వేగం తగ్గే వరకు ఇలా వెళ్తూనే ఉంటుంది. రైల్వేస్టేషన్లో ఇనుప స్తంభాలు, ఉక్కుతో తయారైన రైలు ఇంజిన్లు, పెట్టెలు ఉంటాయి. అత్యంత వేగంగా ప్రయాణిస్తూ వెళ్తే తూటా ఇలాంటి లోహాలతో చేసిన వస్తువులు, ప్రత్యేకంగా పటిష్టంగా నిర్మించిన గోడలకు తాకితే పరిస్థితి మారుతుంది. ఆ ధాటికి తన తన దిశను మార్చుకుంటుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో రికోచెట్ అంటారు. వేగంగా ప్రయాణిస్తున్న మార్గంలో అడ్డు తగిలిన గట్టి వస్తువు కారణంగా దాని దిశను మార్చుకుని, ఒక్కోసారి ఫైర్ చేసిన దిశలోకి మారి దూసుకు వచ్చేస్తుంది. ముక్కలై.. పిల్లెట్లుగా.. వాటిని తాకిన ప్రభావంతో కొన్నిసార్లు లెడ్ బుల్లెట్ ముక్కలై పిల్లెట్లుగానూ మారిపోతుంది. ఇవి దాదాపు తూటా అంత వేగంగానూ దూసుకుపోతాయి. వీటి కారణంగానే రైల్వేస్టేషన్లో అనేక మంది ఆందోళనకారులు గాయపడ్డారు. పరిమాణంలో పెద్దగా ఉన్న పిల్లెట్ దూసుకువచ్చి శరీరంలోకి వెళ్లి ఊపిరితిత్తుల్ని ఛిద్రం చేయడంతోనే రాకేశ్ కన్నుమూశాడని అధికారులు తేల్చారు. గదులు వంటి క్లోజ్డ్ ఏరియాల్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు రికోచెట్ నష్టం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రికోచెట్ అయిన తూటా ఏ దిశలో వెళ్తుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. తూటా పేలేది ఇలా... ఇన్సాస్ రైఫిల్ కింది భాగంలో ఉండే మ్యాగ్జైన్లో తూటాలు ఉంటాయి. సేఫ్టీ లివర్ రిలీజ్ కావడంతో మ్యాగ్జైన్లో ఉండే తూటా ఛాంబర్లోకి వెళిపోతుంది. ఇన్సాస్ మ్యాగ్జైన్ కెపాసిటీ 20 రౌండ్లు (తూటాలు) కాగా.. స్ప్రింగ్ మూమెంట్ కోసం 18 లేదా 19 మాత్రమే పెడుతుంటారు. చూపుడు వేలితో ట్రిగ్గర్ను నొక్కితే తుపాకీ వెనుక ఉండే హ్యామర్... ఫైరింగ్ పిన్ను ప్రేరేపిస్తుంది. దీంతో తూటా పేలి ముందు ఉండే బ్యారెల్ నుంచి దూసుకుపోతుంది. ఈ బుల్లెట్ బలమైన లోహం, వస్తువులను తాకినప్పుడు పిల్లెట్లుగా మారడం, రికోచెట్ కావడం జరుగుతుంది. (చదవండి: ‘సికింద్రాబాద్ విధ్వంసం’ కేసులో నిందితులకు రిమాండ్) -
రైఫిల్ షూటర్ విజేతలకు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
సాక్షి, శంషాబాద్: క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఖతార్‌లో జరిగిన 14వ ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రైఫిల్ షూటింగ్లో బంగారు పతకం సాధించిన అబిద్ అలీఖాన్‌కు, ఇషాసింగ్‌కు ఎయిర్‌పోర్టులో మంత్రి స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడారంగాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొన్న ఐదుగురు క్రీడాకారులు కూడా వివిధ స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమన్నారు. రైఫిల్ షూటింగ్ క్రీడాకారులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. ఇషాసింగ్‌ను సన్మానిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ -
గురితప్పని షూటర్ కొండపల్లి శ్రియారెడ్డి ..
సాక్షి, ఖమ్మం: కృషి.. పట్టుదల.. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. మెరుగైన శిక్షణ.. ఉంటే చాలు ఎంతటి ఉన్నత శిఖరాలైన ఆధిరోహించవచ్చని నిరూపిస్తోందీ బాలిక. పాఠశాలలో నేర్చుకున్న ఎన్సీసీ శిక్షణ ద్వారానే సత్తా చాటుతోంది. రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తోంది. నగరంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న కె.శ్రియారెడ్డి షూటింగ్లో ప్రతిభ చూపుతోంది. గతేడాది నుంచి ఎన్సీసీలో శిక్షణ పొందిన బాలిక ఎన్సీసీ కేడెట్లకు గౌరవప్రదమైన రిపబ్లిక్ పరేడ్‌కు ఎంపికైంది. 45 రోజుల పాటు వివిధ అంశాల్లో శిక్షణ పొందింది. ప్రతిభ చాటి 2019 జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రంనుంచి ఎంపికైంది. శ్రియారెడ్డి ప్రతిభను గమనించిన ఎన్సీసీ అధికారులు షూటింగ్లో శిక్షణ పొందితే బాగుంటుందని సూచించారు. దీంతో శ్రియా తల్లిదండ్రులు కొండపల్లి రవీందర్‌రెడ్డి, చైతన్యరెడ్డిలు హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో గల షూటింగ్ రేంజ్లో దాదాపు నాలుగు నెలలపాటు కె.శ్యామ్‌సుందర్ వద్ద శిక్షణ ఇప్పించారు. 30–50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌పొజిషన్‌లో శిక్షణ పొందిన శ్రియా అనతికాలంలోనే 50 మీటర్ల విభాగంలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ మహిళల కేటగిరీ రైఫిల్ ప్రోన్‌పొజిషన్‌లో 518 పాయింట్లతో తృతీయస్థానం సాధించింది. రాష్ట్రస్థాయిలో కాంస్య పతకం దక్కించుకుంది. దక్షిణ భారత రైఫిల్ షూటింగ్ పోటీలకు అర్హత సాధించింది. గత ఆగస్టు 23 నుంచి 30వ తేదీ వరకు జరిగిన 11వ సౌత్ జోన్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించింది. మెరుగైన ప్రతిభ చాటి ఐదో స్థానం దక్కించుకుంది. 50 రైఫిల్ ప్రోన్‌పొజిషన్‌లో మొదటిస్థానంలో నిలిచిన బాలిక 570 పాయింట్లు సాధించగా కొండపల్లి శ్రియారెడ్డి 563 పాయింట్లు కైవసం చేసుకుని ఐదో స్థానంలో నిలవడం విశేషం. శ్రియారెడ్డి సోదరుడు కూడా.. చెల్లి రైఫిల్ షూటింగ్లో సత్తా చాటుతుంటే అన్న కొండపల్లి నీరజ్‌రెడ్డి రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందేందుకు నిరంతరం సాధన చేస్తున్నాడు. ఓపెన్ జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 16నుంచి 23వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్‌లో జరిగే జాతీయస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొననున్నాడు. నీరజ్‌రెడ్డి 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటా జాతీయస్థాయి రైఫిల్ షూటింగ్లో సత్తా చాటి అంతర్జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. రాష్ట్రానికి మరిన్ని పతకాలు తెచ్చేందుకు కృషి చేస్తా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే జాతీయస్థాయిలో రాణిస్తున్నా. –కొండపల్లి శ్రియారెడ్డి -
రైఫిల్ షూటింగ్లో ‘పశ్చిమ’కు పతకం
గుంటూరు స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి 7వ రైఫిల్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో మహిళల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జె.బేబీ మానస విజేతగా నిలిచింది. బ్రాడీపేటలోని ఇండియన్ అకాడమి షూటింగ్ స్పోర్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో మానస ప్రతిభ చూపి పతకం గెలుచుకుంది. పోటీలను విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తిలకించారు. రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సలాలీత్ విజేతలకు పతకాలు అందించారు.