అబార్షన్లలో 15 ఏళ్లలోపు బాలికలు!
ముంబై: దేశ ఆర్ధిక రాజధానిలో గత మూడేళ్లలో అబార్షన్లు చేయించుకుంటున్న 15 ఏళ్లలోపు బాలికల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2015-16 సంవత్సరానికి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ (ఎమ్ టీపీ)ల నుంచి బీఎమ్ సీలు విడుదల చేసిన జాబితాల్లో ఈ చేదు నిజాలు బయటపడ్డాయి. మొత్తం 34,790 మంది మహిళలు అబార్షన్ చేయించుకోగా వీరిలో 15 ఏళ్లలోపు బాలికలు సంఖ్య 271గా పేర్కొంది గత మూడేళ్ల కంటే ఇది 144 శాతం అత్యధికం. అయితే, 15 నుంచి 19 ఏళ్ల మధ్య గల బాలికల్లో అబార్షన్లు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయి.
దీనిపై స్పందించిన లింగసమానత్వ యాక్టివిస్ట్ శ్రద్ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్స్ యాక్ట్(పీఓసీఎస్ఓ)ను అమలు చేయాలని కోరారు. ఈ వివరాలను ఆర్టీఐ ద్వారా సేకరించిన చేతన్ కొఠారి మాట్లాడుతూ కాలేజిలకు వెళ్తున్న అమ్మాయిల్లో అవగాహన పెరగడం వల్లే అబార్షన్లు తగ్గాయని చెప్పారు. మొత్తం 32,725 గర్భాలను దాల్చిన 12 వారాల్లోపే తొలగించుకున్నారని వివరించారు. వీరిలో ఎనిమిది మంది మరణించినట్లు తెలిపారు. రిజస్టర్డ్ సెంటర్ల ద్వారా అబార్షన్లు చేయించుకుంటున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
లీగల్ గా రిజిస్టరయిన సెంటర్లలో మాత్రమే అబార్షన్లను చేయించుకోవాలని ముంబై ఫెడరేషన్ ఆఫ్ అబ్ స్టెస్ట్రిక్ అండ్ గైనకోలాజికల్ సొసైటీస్ అధ్యక్షురాలు డా. నందిత పల్ షేక్తర్ అన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థునులకి సెక్స్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ అవసరమని శ్రద్ద అభిప్రాయపడ్డారు.