మజ్లీస్ తరఫున విద్యావంతుల పోటీ
జహీరాబాద్, న్యూస్‌లైన్: మజ్లిస్ పార్టీ తరఫున ఉన్నత విద్యావంతులు కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరిలో ఒకరు ఎస్టీ, ఒకరు ఎస్సీ వర్గానికి చెందిన వారు కావడం విశేషం. ఆయా వార్డులు రిజర్వు కావడంతో ఈ మేరకు పార్టీ ఇన్చార్జి ఎం.డి.లుక్మాన్ ఉన్నత విద్యావంతులను ఎంపిక చేసి పోటీలో నిలిపారు. 12వ వార్డు నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా ఆర్.కృష్ణ రాథోడ్ పోటీ చేస్తున్నారు. బీఎస్సీ చదివిన ఇతను బీఎడ్, డీఎడ్లను కూడా పూర్తి చేశారు.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక 19వ వార్డు తరఫున ఎంబీఏ పూర్తి చేసిన నరేష్కుమార్ పోటీ చేస్తున్నారు. ప్రజలకు సేవచేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు నరేష్కుమార్ తెలిపారు. అన్ని మతాలు, అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నట్లు ఆయా వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కృష్ణ, నరేష్‌కుమార్‌లు పేర్కొన్నారు.