వైఎస్ జగన్ గ్లూకోజ్ తీసుకోవడం అత్యవసరం: మహ్మద్ రఫీ
హైదరాబాద్: రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ ఆగస్టు 24వ తేదీ సాయంత్రం నుంచి 126 గంటలుగా చంచల్‌గూడ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్ష భగ్నానికి పోలీసులు గురువారం ప్రయత్నించారు. రాత్రి 11.58 గంటలకు ఆయనను బలవంతంగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలోనే జగన్ తన దీక్షను కొనసాగిస్తున్నారు.
ఉస్మానియా డాక్టర్ అశోక్ కుమార్ నేతృత్వంలో జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు బీపీ 140/80, 60 ఎంజీ కి పడిపోయాయి. షుగర్ లెవెల్, పల్స్ రేట్ 86కి పడిపోయాయి. ఆస్పత్రిలో జగన్ కు ఎంఎల్సీ 23528 నెంబరును డాక్టర్లు కేటాయించారు. ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి వైద్యులు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. ఓపీ బిల్డింగ్‌లోని ఏఎంసీయూ 116 నెంబర్ గదిలో జగన్ కు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈసీజీ లో స్వల్ప తేడాలున్నట్టు వైద్యులు తెలిపారు. ఎనిమిది మంది డాక్టర్ల బృందంలో జగన్ కు వైద్యం అందిస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని ఉస్మానియా ఆర్ఎంవో డాక్టర్ మహ్మద్ రఫీ పేర్కొన్నారు. గ్లూకోజ్ తీసుకోమని తాము కోరినా జగన్ తిరస్కరిస్తున్నారనిన్నారు. జగన్ గ్లూకోజ్ తీసుకోవడం అత్యవసరమని ఆయన తెలిపారు. పోలీసులు, తాము ఎంతకోరినా ఆయన వైద్యానికి అంగీకరించటలేదని చెప్పారు. కీటోన్ బాడీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అయితే వైఎస్ జగన్ కు అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని, ఇంకా రిపోర్ట్లు రావాల్సి ఉందని మహ్మద్ రఫీ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకో 24 గంటల వరకు ఏం చెప్పలేమని ఆర్ఎంవో మహ్మద్ రఫీ చెప్పారు.