వివాదాస్పద స్థలంలో విధ్వంసం
విశాఖపట్నం: కూర్మన్నపాలెం సర్వే నంబర్ 39/1సీలో 1.09 ఎకరాల స్థలం కొన్నేళ్లుగా ఖాళీ ఉంది. రెండేళ్లుగా ఆ స్థలంపై వివాదం నడుస్తోంది. ఇటీవల ఇదే స్థలంపై ఇరువర్గాలు దువ్వాడ పోలీసులను ఆశ్రయించారు. సివిల్ గొడవ కావడంతో కోర్టులో తేల్చుకోవాలని దువ్వాడ పోలీసులు ఇరువర్గాలకు సూచించారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఓ వర్గానికి చెందిన సుమారు 100 మంది వివాదాస్పద స్థలంలో చొరబడి రేకుల ప్రహరీని ధ్వంసం చేశారు. దీంతో వ్యతిరేక వర్గం దువ్వాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దువ్వాడ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని రౌడీ మూకలను చెదరగొట్టారు. ఇందులో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. 1980లో సర్వే నంబర్ 39/1, 2లో 9.30 ఎకరాల స్థలాన్ని అత్తిలి నారాయణరావు నుంచి కొనుగొలు చేశామని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన బద్దిరాజు మురళీరాజు తెలిపారు. అప్పట్లో ఎల్పీ నంబర్ 3.80 తీసుకొని లేఅవుట్ కూడా వేసి 54 మందికి స్థలాన్ని విక్రయించామన్నారు. తరువాత శ్రీలక్ష్మి గణేష్ బిల్డర్‌కు 2005లో డెవలప్మెంట్కు ఇచ్చారు. ఈ భూమి మధ్యన రైవాడ కెనాల్ భూసమీకరణ చేయడంతో సదరు సర్వే నంబర్ సబ్ డివిజన్‌గా మార్చారు. 39/1ఎ, 39/1బి, 39/1సీలుగా విభజించారు. ఇందులో 39/1ఏ సుమారు 6 ఎకరాల్లో ఓషన్ గ్రీన్ అపార్ట్మెంట్ నిర్మాణం జరిగింది. 39/1బీ రైవాడ కాలువలో పోయింది. మిగిలిన 39/1సీ 1.09 ఎకరాల స్థలం ఖాళీగా ఉండడంతో ఆక్రమణదారుల కన్ను పడింది.
అత్తిలి నారాయణరావు వద్ద ఆయన తమ్ముడు పెదవెంకటరమణ, మంతా సుబ్రహ్మణ్యం, ముదునూరి శ్రీనివాసరాజులు స్థలం కొన్నట్టు దస్తావేజులు చూపుతున్నారు. ఇరువర్గాలు ఆ స్థలం తమదంటే తమదని తరచూ గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్న బుద్ద మురళీరాజు గాజువాక కోర్టును ఆశ్రయించారు. అయితే గతంలో మంతా సుబ్రహ్మణ్యం స్థలాన్ని చదును చేసి లే అవుట్‌గా మార్చి స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నాలు చేసి, అక్కడ ఒక షెడ్డును కూడా నిర్మించడంతో మరో వర్గం జీవీఎంసీకి ఫిర్యాదు చేసింది.
దీంతో జీవీఎంసీ అధికారులు వచ్చి షెడ్డును కూల్చివేశారు. దీంతో కక్ష పెట్టుకున్న మంతా సుబ్రహ్మణ్యం వర్గానికి చెందిన సుమారు వంద మంది మంగళవారం ఈ స్థలంలో చొరబడి రేకుల ప్రహరీని ధ్వంసం చేశారు. గాజువాక ఏసీపీ త్రినాథ్, దువ్వాడ సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కృష్ణంరాజు, సుబ్రహ్మణ్యం, వంశీపై కేసు నమోదు చేశారు.