పారదర్శకతకే స.హ.చట్టం
తెనాలి రూరల్, న్యూస్‌లైన్: పరిపాలనలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం 2005లో సమాచారహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కార్యాలయ అదనపు డెరైక్టర్ జనరల్ ఎంవీవీఎస్ మూర్తి అన్నారు. స్థానిక అన్నాబత్తుని పురవేదిక వద్ద జరుగుతున్న ‘భారత్ నిర్మాణ్’ పౌర సమాచార ఉత్సవం సోమవారం రెండో రోజు సభా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్యుడు సైతం అధికారులను ప్రశ్నించే అవకాశం ఈ చట్టం కల్పించిందన్నారు. కేవలం రూ.10తో సామాన్యుడికి కావాల్సిన ఏ సమాచారం అయినా అన్ని శాఖల నుంచి పొందే వీలువుందని చెప్పారు. నెల రోజు ల్లోగా సమాచారం అందించకపోతే, సమాచార కమిషనర్‌కు లేదా పై అధికారికి ఫిర్యాదు చేయవచ్చని, అప్పటికీ సమాచారం ఇవ్వని పక్షంలో సంబంధిత అధికారి వేతనం నుంచి రూ.25 వేల వరకు జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. జిల్లా మలేరియా నియంత్రణ అధికారి రవీంద్ర, ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి శైలజ, జిల్లా ఆరోగ్యాధికారి ఆర్.రామారావు, జిల్లా క్షయ నియంత్రణాధికారి శ్రావణచైతన్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం. గోపినాయక్‌లు తమ శాఖల పురోగతి గురించి మాట్లాడారు.
భారత్ నిర్మాణ్ ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రసార, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. వివిధ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఫొటో ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు, విద్యాహక్కు చట్టాలు, ప్రధాన మంత్రి 15 సూత్రాల పథకం, గ్రామీణాభివృద్ధి, రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ, గ్రామీణ సాగునీరు, తాగునీటి పథకం, మధ్యాహ్న భోజన పథకం వంటి అంశాలకు సంబంధించిన వివరాలు, ప్రధాన మంత్రి ప్రసంగాల ప్రతులను ప్రజలకు అందజేశారు. ఆయా కార్యక్రమాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డెరైక్టర్ టి.విజయకుమార్‌రెడ్డి, అసిస్టెంట్ డెరైక్టర్ రత్నాకర్, క్షేత్ర ప్రచార అధికారి వెంకటప్పయ్య, ఆర్డీవో ఎస్.శ్రీనివాసమూర్తి, తహశీల్దార్ ఆర్వీ రమణనాయక్, మున్సిపల్ కమిషనర్ బి.బాలస్వామి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రశేఖర్, సీడీపీవోలు సులోచన, అనూరాధ, కృష్ణవందన, మహంకాళి శ్రీనివాస్ తదితర అధికారులు పర్యవేక్షించారు.