హ్యాకర్లకు గూగుల్ బంపర్ ఆఫర్
మొబైల్ మార్కెట్ రంగంలో యాపిల్ తో పోటీ పడుతున్న గూగుల్ మొబైల్ హ్యాకర్లకోసం ఓ షాకింగ్ ఆఫర్ ప్రకటించింది. అదిరిపోయే ఫీచర్లతో ఇటీవల లాంచ్ చేసిన తన ప్రఖ్యాత నెక్సస్ 5ఎక్స్, నెక్సస్ 6పి స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసిన వారికి భారీ బహుమతిని ప్రకటించింది.
ఓ ప్రత్యేక మైన హ్యాంకింగ్ ద్వారా తన స్మార్ట్ ఫోన్లలోని లోపాన్ని గానీ, ఏదైనా బగ్ ను గానీ కనుగొన్న హ్యాకర్లు ప్రథమ బహుమతి 200,000 డాలర్లు (రూ 1.3 కోట్లు) సంపాదించే అవకాశం కల్పిస్తోంది. గూగుల్ 'ప్రాజెక్ట్ జీరో ప్రైజ్' పథకంగా ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఇవ్వనుంది. రెండవ బహుమతిగా సుమారు 67 లక్షలు(100,000 డాలర్లు) మూడవ బహుమతిగా సుమారు 38 లక్షలు (50,000 డాలర్లు) అందిస్తామని తెలిపింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 13నుంచి మొదలైన ఈ పోటీ వచ్చే ఏడాది 2017 మార్చి 13 న ముగియనుందని గూగుల్ వెల్లడించింది. అలాగే మరికొంతమంది ఎంపిక చేసినవారికి టెక్నికల్ రిపోర్ట్ రాయాల్సిందిగా ఆహ్వానిస్తుంది. దీన్ని ప్రాజెక్ట్ జీరో బ్లాగ్ లో ప్రచురిస్తుంది.కాగా మొబైల్ ఫోన్లలో నెక్సస్ సిరీస్ ను ఐదేళ్ల కిందట ప్రారంభించిన గూగుల్.. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ మార్షమల్లోతో నెక్సస్ 5 ఎక్స్, 6 పీలను ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.