పుష్కరాలకు దీటుగా మేడారం
2016 ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకూ జాతర
* రూ.182 కోట్లతో సౌకర్యాలు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క, సారక్క తొలి జాతరను గోదావరి పుష్కరాలకు దీటుగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 2016 ఫిబ్రవరి 17 నుంచి 20 జరగనున్న మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్లు, రవాణా, తాగునీరు, పారిశుధ్యం, రక్షణ తదితర సదుపాయాలను కల్పించేం దుకు రూ.182 కోట్ల వ్యయంతో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.
గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి బుధవారం సచివాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్ 20లోపు టెండర్ల ప్రక్రియ ముగించి, తర్వాతి 3 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నా రు. కోటి 25 వేల మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతర ఏర్పాట్లను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. మేడారంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే సమ్మక్క, సారక్క జాతరలకు సైతం ఏర్పాట్లు చేస్తామన్నారు.
మేడారం జాతర సందర్భంగా గాల్లో పోలీసు కాల్పులు జరపడం ఆనవాయితీగా వస్తున్నదని, ఇప్పటివరకు అనధికారికంగా నిర్వమిస్తున్న ఈ సంప్రదాయాన్ని గిరిజన దేవుళ్లపై గౌరవంతో అధికారికంగా జరపాలని సీఎం కేసీఆర్‌ను కోరతామని ఎంపీ సీతారాం నాయక్ చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, దేవాదాయ కార్యదర్శి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
మేడారం జాతర ముఖ్యఘట్టాలు
ఫిబ్రవరి 17: కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు.
ఫిబ్రవరి 18: చిలకలమ్మ గుట్టపై నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకొస్తారు.
ఫిబ్రవరి 19: సమ్మక్క, సారక్క మహాజాతర. కోటి మందికిపైగా భక్తులు మొక్కు తీర్చుకుంటారని అంచనా.
ఫిబ్రవరి 20: అమ్మవారు వన ప్రవేశం