RTA Check Posts
-
అవినీతికి అడ్డాలు
సాక్షి, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఈ దాడులు కొనసాగాయి. ఏసీబీ అధికారుల సోదాల్లో రశీదులు లేకుండా ఉన్న లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చెక్‌పోస్టుల్లో ఏసీబీ దాడులు జరగడం వారంలో ఇది రెండోసారి. ఇటీవలే దాడులు జరగడం, ఇక ఇప్పట్లో జరగవనే ఉద్దేశంతో సిబ్బంది భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు పేర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలోని పురుషోత్తపురంలోని చెక్‌పోస్టులో వివిధ విభాగాల అధికారులతో పాటు, ప్రైవేటువ్యక్తులు కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ చెక్‌పోస్టునుంచి ఏసీబీ అధికారులు రూ.1.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 21న జరిగిన దాడిలో రూ.2.15 లక్షలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అనంతపురం జిల్లా పెనుగొండ చెక్‌పోస్టులో అక్రమ వసూళ్లకు ఏకంగా ఒక డబ్బాపెట్టె పెట్టారు. రికార్డుల తనిఖీ కోసం వచ్చిన డ్రైవర్లు ఆ బాక్స్‌లో నగదు వేస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో తనిఖీ చేయగా రూ.26,500 పట్టుబడింది. ఏసీబీ అధికారుల రాకను పసిగట్టిన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం బీవీ పాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రం సిబ్బంది డబ్బులను చీకట్లోకి విసిరేశారు. అధికారులు ఆ సొమ్మను స్వాధీనం చేసుకుని సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నరహరిపేట చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన సురేష్, రహీముద్దీన్‌ఖాన్, మధుసూదన్‌లు ఈనెల 21న నిర్వహించిన దాడుల్లోనూ పట్టుబడటం గమనార్హం. ఈ చెక్‌పోస్టులో ఆదివారం రూ. 48,150 స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని నాగారం చెక్‌పోస్టుతోపాటు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్ చెక్ పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. భోరజ్ చెక్‌పోస్టు నుంచి రూ.61 వేలు స్వాధీనం చేసుకున్నారు. -
ఏసీబీ పంజా
పెద్దషాపూర్ (శంషాబాద్ రూరల్), న్యూస్‌లైన్ : మండల పరిధిలోని పెద్దషాపూర్ ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం వరకు తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.1,05,220 నగదు స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) కిర ణ్‌కుమార్, ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వాహనదారులనుంచి డబ్బులు వసూలు చేయడానికి ఏజెంట్లుగా ఏఎంవీఐ డ్రైవర్ మహ్మద్ మొజాయిద్దీన్, బీహార్‌వాసి సంజయ్ కుమార్జాను నియమించుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో చెక్‌పోస్టు ఆవరణలోని రెస్ట్ రూంలో ఉన్న మంచం పరుపు కింద రూ.61,000 నగదు దొరికింది. మిగతా సొమ్మును ఏజెంట్ల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా చెక్‌పోస్టు వద్ద అర్థరాత్రి నుంచి ఏసీబీ దాడులు మొదలు పెట్టడంతో వాహనాల తనిఖీలకు బ్రేక్‌పడింది. శనివారం ఉదయం 9గంటల తర్వాత మళ్లీ వాహనాలను తనిఖీ చేశారు. దాడులు జరిపిన బృందంలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ఇన్స్పెక్టర్లు రాజు, ముత్తులింగం, తిరుపతిరాజు, హైదరాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్లు కె.సునీల్, వెంకట్‌రెడ్డి ఉన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును, దాడుల నివేదికను సంబంధిత శాఖకు అందజేస్తామని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. -
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడులు
-
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడులు
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గత అర్థరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం, రంగారెడ్డి, నిజామాబాద్, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో దాడులు కొనసాగుతున్నాయి. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లా తడ మండలం బీవీపాలెంలోని చెక్ పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడిలో రూ. లక్ష నగదును స్వాదీనం. నిబంధనలకు విరుద్ధంగా చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు బయట వ్యక్తులు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తరు జిల్లా నరహరిపేట చెక్‌పోస్ట్‌పై దాడి చేసి రహదారిపై వెళ్తున్న పలు వాహనాల నుంచి అక్రమంగా నగదు వసూల్ చేస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆ చెక్ పోస్ట్ నుంచి రూ. లక్షకుపైగా నగదును స్వాధీనం చేసకున్నారు. అలాగే ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ఇచ్ఛాపురం చెక్‌పోస్ట్‌పై నిర్వహించిన దాడుల్లో రూ. 2 లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదుపై ఏసీబీ అధికారులు చెక్ పోస్ట్ సిబ్బందిని ప్రశ్నించిగా వారు మీనమేషాలు లెక్కపేట్టారు. దీంతో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీటితోపాటు నిజామాబాద్ జిల్లా భోదన్ మండలం సాలూరు చెక్‌పోస్ట్‌పై దాడులు నిర్వహించి అధిక మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై దాడి చేశారు. ఆ దాడిలో రూ. లక్షకు పైగా నగదులు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ నగదును స్వాధీనం చేసుకుని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్ ఫెక్టర్ కిరణ కుమార్ తో పాటు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే ఏసీబీ చేపట్టిన దాడులు శనివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి.