విలీనమే పరిష్కారం
కడప కార్పొరేషన్: వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ను అత్యంత శక్తివంతంగా తయారు చేయాలని యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం కడపలోని అపూర్వ కల్యాణమండపంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. రాజారెడ్డి అధ్యక్షతన 3వ రాష్ట్ర మహాసభ జరిగింది. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యానికి తెలియకుండానే వేలకోట్లు విలువజేసే ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటోందని ధ్వజమెత్తారు. ఆర్టీసీకి ఐదువేలకోట్ల అప్పు ఉందని, దానికి వడ్డీ చెల్లించలేని స్థితిలో సంస్థ నడుస్తోందని తెలిపారు.
నష్టాల పేరుతో రూట్లు రద్దు చేయడం వల్ల ప్రజలు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. డ్యూటీకి వెళ్లిన కార్మికుడు ఇంటికి వచ్చేలోపు ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో అన్న సందేహం నెలకొందన్నారు. కార్మికుల సంఖ్య పూర్తిగా తగ్గించారని, ఉన్న వారిపై పనిభారం ఎక్కువైందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సులు, బస్టాండ్లు పెరగడం లేదన్నారు.మూడున్నర సంవత్సరాలుగా కండక్టర్లు, డ్రైవర్ల రిక్రూట్మెంట్ చేయలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆ హామీని నెరవేర్చగల సత్తా ఒక్క వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్‌కు తప్ప మరే యూనియ న్కు లేదని స్పష్టం చేశారు.
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీకి వెన్నెముకలాంటి కండక్టర్లను ప్రభుత్వం లేకుండా చేస్తోందన్నారు. ప్రయివేటు, హైర్ బస్సులకు ఆర్టీసీని ధారాదత్తం చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని ముఖ్యమంత్రిని కోరితే నష్టాల్లో ఉన్న సంస్థను విలీనం చేయాలా...అని ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. అంతకుముందు వారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మహాసభలో డీసీటీఎం కిషోర్, చిత్తూరు జిల్లా నాయకుడు జయరామిరెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీనివాసులరెడ్డి, రాజుల భాస్కర్‌రెడ్డి, బండి చెన్నయ్య, రీజనల్ ఉపాధ్యక్షులు పులి సునీల్‌కుమార్, బి. నిత్యానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేత షఫీ పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల జీవితాలను మెరుగుపరుస్తాం : ఎమ్మెల్యే రాచమల్లు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికుల జీవితాలను మెరుగు పరుస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై పనిభారం మోపుతూ వారి శ్రమను దోచుకుంటోందని మండిపడ్డారు. బస్సులు కండీషన్లో లేవని, బస్టాండ్లలో సరైన సౌకర్యాలు కరువయ్యాయన్నారు. కార్మికులు చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష వేస్తున్నారని, ఇది న్యాయం కాదని అన్నారు.
భవిష్యత్ వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్‌దే : ఎమ్మెల్యే అంజద్‌బాషా
భవిష్యత్తు వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌దేనని కడప శాసనసభ్యులు ఎస్బి అంజద్‌బాషా అన్నారు. 2004కు ముందు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా దివాళా తీయించిందని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్టీసీకి జవసత్వాలు నింపారని తెలిపారు. నేటి ప్రభుత్వం కార్మికుల సంఖ్యను తగ్గించి, వారితో 16 గంటలు పనిచేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తోందని దుయ్యబట్టారు. కార్మికుల సమస్యలను సంఘటితంగా ఎదుర్కొవాలని, అందుకు మీతో కలిసి పోరాటం చేస్తానని తెలిపారు.