Rudraram
-
మాయమైన ఏటీఎం మిషన్ లభ్యం
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని దండగులు అపహరించుకు వెళ్లిన ఏటీఎం మిషన్ ఆచూకీ లభించింది. కంది మండలం చేర్యాల గ్రామ శివారులో ఇండి క్యాష్ ఏటీఎం మిషన్‌ను పోలీసులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో జాతీయ రహదారి పక్కనున్న ఓ షటర్లో రెండు ఇండిక్యాష్ ఏటీఎంలలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఏటీఎంను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఓ ఖాతాదారుడు ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లగా అక్కడ ఒకటే ఏటీఎం మిషన్ ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. కాగా దుండగులు ఎత్తుకెళ్లిన ఏటీఎంలో 2,27,000 నగదు ఉందని పోలీసులు తెలిపారు. -
‘స్వచ్ఛ’ రుద్రారం
సాక్షి, నవాబుపేట (జడ్చర్ల): మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని రుద్రారం గ్రామం స్వచ్ఛ పురష్కార్ అవార్డుకు ఎంపికైంది. ఓ మహిళ అనుకుంటే సాధించలేనిది లేదంటూ నిరూపించింది. గ్రామం స్వచ్ఛంగా ఉండాలనే లక్ష్యంతో వందశాతం మరుగుదొడ్లు నిర్మించారు. దీంతో ఈ గ్రామానికి ప్రత్యేక పురష్కారం వచ్చినట్లు సమాచారం. 371 మరుగుదొడ్ల నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేశారు. దీంతో గతేడాది ఢిల్లీలో మహిళా సాధికారిత అవార్డు, జిల్లాల్లో తెలంగాణలో ప్రత్యేక అవార్డును అప్పటి సర్పంచ్ లక్ష్మీకృష్ణగౌడ్ పొందింది. ఈ రెండు అవార్డులతో పాటు తాజాగా స్వచ్ఛభారత్ పురష్కార్తో పాటు రూ.10లక్షలు అందుకోనున్నారు. ఈ అవార్డును శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా నవాబుపేట మండల కేంద్రంలో అందించనున్నారు. మరింత అభివృద్ధి గ్రామం మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాం. గతంలో అందరూ కృషి చేశారు. ఆ కృషికి వచ్చిన ఫలితంతో మరింత ముందుకు తీసుకెళ్తాం. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. పార్టీలకతీతంగా సమష్టిగా కృషి చేస్తాం. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. – లలిత కృష్ణారెడ్డి, సర్పంచ్, రుద్రారం -
రాష్ట్ర వైద్యబృందం ‘రుద్రారం’ పరిశీలన
మిరుదొడ్డి: జాతీయ పైలేరియా నివారణ వారోత్సవాల్లో భాగంగా భూంపల్లి పీహెచ్సీ పరిధిలోని రుద్రారం గ్రామాన్ని గురువారం రాష్ట్ర వైద్య బృందం సభ్యులు డీఈసీ, అల్బెండజోల్ మాత్రల పంపిణీపై ఇంటింటికి తిరిగి పరిశీలన జరిపారు. పైలేరియా వారోత్సవాల్లో భాగంగా వ్యాధి నిర్మూలనకు క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు మాత్రలను ప్రతి ఒక్కరి చేత మింగించాల్సి ఉంది. అలా కాకుండా ఇంటింటికి తూతూ మంత్రంగా మాత్రలను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నట్లు రాష్ట్ర వైద్య బృందం పరిశీలనలో తేట తెల్లమైంది. చాలా మటుకు ప్రతి ఇంటిలో పంపిణీ చేసిన పైలేరియా మాత్రలను ప్రజలు వేసుకోకుండా ఉండటాన్ని వైద్య బృందం సభ్యులు రికార్డు చేశారు. కార్యక్రమంలో రీజినల్ హెల్త్ కార్యాలయం డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, స్టేట్ పైలేరియా కన్సల్టెంట్ ఆఫీసర్ లక్ష్మణ్, భూంపల్లి పీహెచ్సీ డాక్టర్ అరుణ్‌కుమార్, హెల్త్ ఎక్స్టెన్షన్ అధికారి ఎం. భాస్కర్, దుబ్బాక క్లస్టర్ సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, వైద్య సిబ్బంది రోజెట్టి, తార, కిరణ్, అంగన్వాడీ కార్యకర్తలు సురేఖ, పద్మ, రేణుక, ఆశ వర్కర్లు అరుణ, సుమలత, సుజాత, స్వప్న, వీరమణి తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతి
రుద్రారం (కర్నూలు జిల్లా) : రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఐదేళ్ల బాలికను వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం కర్నూలు జిల్లా రుద్రారం మండలం ఆలమూరు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. ఆలమూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవికి ముగ్గురు కుమార్తెలు. కాగా వారిలో పెద్ద కుమార్తె పుష్ప శుక్రవారం దుకాణం దగ్గరకు వెళ్లి సరుకులు తెస్తుండగా అదే గ్రామానికి చెందిన ఓబులేష్ బైక్‌పై వెళ్తూ పాపను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాపను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. కాగా లక్ష్మీదేవి భర్త వారం క్రితమే చనిపోగా, ఇప్పుడు కుమార్తె చనిపోవడంతో ఆమె దుఃఖ సాగరంలో మునిగిపోయింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.