Ruia Hospital in Tirupati
-
తిరుపతి రుయా ఘటనపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్
సాక్షి, అమరావతి: తిరుపతి రుయా ఘటనపై హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం కౌంటర్ దాఖలు చేసింది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యం వల్లే ఘటన జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించామని, ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా మే నెలలో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఐసీయూలో ఆక్సిజన్ సరఫరాలో జాప్యంతో 11 మంది బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. 7 -
ఏడుగురు విద్యార్థినులకు స్వల్ప అస్వస్థత
తిరుపతి తుడా: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏడుగురు నర్సింగ్ విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి రుయా ఆస్పత్రిలోని వ్యాక్సినేషన్ సెంటర్లో శుక్రవారం జనరల్ నర్సింగ్ కాలేజికి చెందిన 38 మందికి వ్యాక్సిన్ వేశారు. వారిలో ఏడుగురు విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురవడంతో రుయాలోని అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు వారికి షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలు చేశారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించారు. అస్వస్థతకు గురైన లక్ష్మి, స్వాతి, ప్రసన్న, రూప, దుర్గ, ధనలక్ష్మి, సహనలను మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి మీడియాకు తెలిపారు. మంత్రి ఆళ్ల నాని ఆరా... నర్సింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. చిత్తూరు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతితో శుక్రవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడిన ఆయన.. అస్వస్థత పాలైన నర్సింగ్ విద్యార్థినులకు ప్రత్యేక వార్డు కేటాయించి వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశించారు. -
కోవిడ్ వారియర్స్ కోసం ఈఎస్ఐలో ప్రత్యేక వార్డు
సాక్షి, తిరుపతి: కరోనా వైరస్‌కు ఎవరు అతీతులు కారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్, కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైరస్ సోకిన వారిలో 99 శాతం మంది రికవరీ అవుతున్నారని తెలిపారు. తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో అన్ని శాఖలతో సమన్వయ కమిటీలు వేశామని తెలిపారు. కరోనా బాధితులకు ఈ కమిటీలు అండగా ఉంటాయన్నారు. ఐఎంఏ తిరుపతి శాఖ సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో మీడియా ప్రతినిధులు, డాక్టర్లు, పోలీసుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. ఇదిలా ఉండగా ఈ రోజు రుయా ఆస్పత్రి నుంచి 79 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. అధికారులు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు అందించారు. కరోనాను జయించిన 101 సంత్సరాల బామ్మ నమ్మకం, సంకల్పబలం ఉంటే ఎలాంటి సమస్యనైనా జయింవచ్చని నిరూపించింది తిరుపతికి చెందిన ఓ 101 సంవత్సరాల బామ్మ. 60 ఏళ్లకు పైబడిన వారికి కరోనా సోకితే కష్టమని నిపుణులు వెల్లడిస్తున్నారు. కానీ వీరి వ్యాఖ్యలను తప్పని నిరూపిస్తూ.. ఓ 101 సంవత్సరాల వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నారు. వారం రోజుల క్రితం తిరుపతికి చెందిన ఈ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో తిరుపతి స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో చేరింది. 14 రోజుల క్వారంటైన్ తప్పని సరిగా భావిస్తుండగా.. ఈ బామ్మ మాత్రం కేవలం 10 రోజుల్లోనే కోలుకుని డాక్టర్లనే ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో మరోసారి బామ్మకు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ రావడంతో శనివారం ఆమెను డిశ్చార్జ్ చేశారు. -
తిరుపతిలోనూ ‘కే’ ట్యాక్స్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ పాలనలో గుంటూరు జిల్లా నర్సరావుపేట, సత్తెనపల్లె ప్రాంతాల్లో విధించిన ‘కే’ ట్యాక్స్ వ్యవహారం చిత్తూరు జిల్లా తిరుపతి వరకూ పాకింది. గడిచిన ఐదేళ్లుగా రుయా ఆస్పత్రి కేంద్రంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం బినామీ ద్వారా ప్రతినెలా రూ.40 లక్షల దాకా కొల్లగొడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌ల నిర్వహణను అప్పటి టీడీపీ ప్రభుత్వం మెడాల్ సంస్థకు అప్పగించింది. తిరుపతి, గుంటూరు ఆస్పత్రుల్లో మాత్రం ‘లక్ష్మీవెంకటేశ్వర క్లినికల్ ల్యాబ్’కు అప్పగించారు. కోడెల శివరాం బినామీ మనోజ్‌కు చెందినదే ఈ లక్ష్మీవెంకటేశ్వర క్లినికల్ ల్యాబ్. తిరుపతి రుయా ఆస్పత్రిలో రూ.4 కోట్లకు పైగా విలువైన అత్యాధునిక పరికరాలున్నాయి. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన నిపుణులు ఉన్నారు. అయినప్పటికీ అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఒత్తిడి మేరకు రుయా ఆస్పత్రిలో ల్యాబ్ నిర్వహణను లక్ష్మీ వెంకటేశ్వర క్లినికల్ ల్యాబ్‌కు కట్టబెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్ఐవీ టెస్టు చేయడానికి రూ.150 తీసుకుంటారు. కానీ, లక్ష్మీవెంకటేశ్వర సంస్థ రూ.850 వసూలు చేస్తోంది. రూ.80తో చేసే థైరాయిడ్ టెస్టుకు ఏకంగా రూ.350 దండుకుంటోంది. వైద్య పరీక్షల పేరిట ప్రతినెలా రోగుల నుంచి రూ.40 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరీక్షలను రుయా ఆస్పత్రి నిపుణులు సొంతంగా నిర్వహిస్తే కేవలం రూ.15 లక్షలే ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే లక్ష్మీవెంకటేశ్వర క్లినికల్ ల్యాబ్ ప్రతినెలా రూ.25 లక్షలు అధికంగా పిండుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఈ లెక్కన గత ఐదేళ్లలో రూ.15 కోట్లు అదనంగా గుంజుకున్నట్లు తెలుస్తోంది. వైద్య పరికరాల సరఫరాలోనూ.. మెడికల్ సర్జికల్ పరికరాలను సరఫరా చేసే కాంట్రాక్టును సైతం కోడెల శివరాంకు చెందిన జయకృష్ణ, సాయికృష్ణ మెడికల్ ఏజెన్సీ దక్కించుకుంది. నిబంధనల ప్రకారం.. ఇలాంటి కాంట్రాక్టును స్థానికంగా ఉన్న ఏజెన్సీకే అప్పగించాలి. టీడీపీ సర్కారు హయాంలో కోడెల తనయుడి ఏజెన్సీకి కట్టబెట్టారు. పైగా ఆరోగ్యశ్రీ డాక్యుమెంటేషన్ అప్లోడ్ టెండర్‌ను తక్కువ ధర కోట్ చేసిన ఏజెన్సీని కాదనీ, ఎక్కువ ధర కోట్ చేసిన బ్లూఫ్లాంట్ ఏజెన్సీకి కోడెల ఒత్తిడి మేరకు అప్పగించారు. దీన్ని కోడెల శివరాం బినామీ మనోజ్ నిర్వహిస్తున్నాడు. ‘కే’ ట్యాక్స్‌ను తిరుపతిలో అధికారికంగానే వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
రోగి ‘ఓపి’కకు..పరీక్ష
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. వైద్యం దైన్యంగా మారింది. వివిధ ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ..హాస్పిటల్‌కు వచ్చేవారికి చీత్కారాలు.. చీదరింపులుతప్ప.. చికిత్స అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రమాదంలో గాయపడి వచ్చే వారి పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. ఓపీకి వచ్చే వారి పరిస్థితిమొదట ఎదురుచూపులు.. ఆ తర్వాత మాత్రలే దిక్కు అన్న చందంగా తయారైంది. జిల్లాలోనిఆస్పత్రుల్లో.. సోమవారం సాక్షి నిర్వహించిన విజిట్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం,ప్రభుత్వ ఉదాసీనత స్పష్టంగా కనిపించింది. సాక్షి, తిరుపతి (అలిపిరి): రాయలసీమకే పెద్దాస్పత్రిగా గుర్తింపు పొందిన రుయాకు సుస్తీ చేసింది. సోమవారం సాక్షి బృందం రుయా ఆస్పత్రిని విజిట్ చేసింది. పరిశీలనలో.. రుయాలో ఓపీ విభాగం సేవలు అధ్వానంగా ఉన్నాయి. ఓపీ నమోదు కేంద్రంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఆదివారం మినహా ఇతర రోజుల్లో ఉదయం 8.30 గంటలకు ఓపీ నమోదు సేవలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 గంటలకు ఓపీ నమోదు చేసుకున్న రోగులు ఆయా విభాగాల వారీగా ఓపీ విభాగాల వద్దకు చేరుకుం టారు. గేట్లు తెరిచిన వెంటనే ఓపీ నమోదు హాలులోకి 500 మంది ఒక్కసారి దూసుకుపోతున్నారు. దీంతో ఓపీ నమోదు హాలు రోగులతో కిక్కిరిసిపోతుంది. రుయా ఆస్పత్రిలో కంప్యూటర్, ఇంటర్నెట్ నిర్వహణ నిమిత్తం ప్రైవేట్ సంస్థకు ఏటా రూ.లక్షలు చెల్లిస్తున్నారు. అయినా ఓపీ కేంద్రాల నిర్వాహణ అధ్వానంగా మారింది. సమయపాలన పాటించని వైద్యులు రుయా ఆస్పత్రిలో ఉన్నతాధికారులు మొదలుకుని సీనియర్ వైద్యుల వరకు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటలకు ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రాంభమైనా అధికారులు అందుబాటులో ఉండడం లేదు. ఓపీ సేవలు మధ్యాహ్నం 12.30 గంటల వరకు వున్నా కొందరు వైద్యులు 12 గంటలకే వెళ్లిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, చోటామోటా నాయకుల రెకమెండేషన్ వుంటేనే ఆపరేషన్లు త్వరితగతిన చేసి డిశ్చార్జ్ చేస్తున్నారు. లేకుంటే పడిగాపులు తప్పవు. పట్టించుకునేవారు లేరు.. నెల రోజుల క్రితం ప్రమాదవశాత్తు కిందపడి ఎడమ కాలికి గాయమైంది. రుయాకు వైద్యం కోసం వచ్చా. ఆర్థో విభాగానికి వెళితే తగిలిన గాయానికి కట్టుకట్టారు. నెల రోజులుగా రుయా ఆవరణలోని విశ్రాంతి సముదాయంలో ఉన్న.. దెబ్బ మానడం లేదు. వైద్యులు బయట మందులు రాస్తున్నారు. దిక్కులేక ఇక్కడే ఉన్నాను – రాము, మైసూరు, కర్ణాటక సహాయకులుంటేనే వైద్యం అంటున్నారు కుడికాలుకు అరికాలులో చెక్కపేడు ఇరుక్కుపోయింది. వారం రోజుల క్రితం రుయా ఆర్థో విభాగానికి వస్తే గాయాన్ని క్లీన్‌చేసి కట్టుకట్టి పంపారు. మళ్లీ వైద్యం కోసం వస్తే ఆపరేషన్ చేసి చెక్కను తీస్తాం.. నీకు సహాయకులుంటే వైద్యం చేస్తాం.. లేకుంటే లేదు. అని చెప్పారు. నాకు ఎవరూ లేరు... వైద్యం కోసం వస్తే ఇలా చెప్పడం బాధేసింది. పెద్ద సార్లు నాకు వైద్యం అందించి కాలులోని చెక్క పేడును తొలగించాలి. – సుబ్బరాజు, నాయుడు పేట, నెల్లూరు జిల్లా -
రుయా రోడ్లకు మోక్షం
సాక్షి కథనంపై స్పందించిన అధికారులు రూ.24.65 లక్షలతో లింకు రోడ్ల ఏర్పాటు రోగులకు తప్పనున్న పాట్లు తిరుపతి మెడికల్: తిరుపతి రుయా ఆసుపత్రిలోని లింకు రోడ్లకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. గుంతలమయంగా మారి, కంకర తేలి రోగుల పాలిట నరకంగా మారిన రోడ్ల దుస్థితిపై అధికారులు కరుణించారు. ఈనెల 1వ తేదిన సాక్షి జిల్లా ప్రధాన సంచికలో ‘కుట్లు తెగిపోతున్నాయ్..’ శీర్షికతో రుయా రోడ్ల దయనీయతపై కథనం ప్రచురించిన విషయం విదితమే. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ తక్షణం లింకు రోడ్లను అభివృద్ధి చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్‌చంద్‌ను ఆదేశించారు. దీంతో నగర పాలక సంస్థ నిధులు రూ.24.65 లక్షలతో వెంటనే తారు రోడ్ల నిర్మాణం ప్రారంభించారు. గతంలో ఆర్థో విభాగం నుంచి ఆపరేషన్ రోగులను స్ట్రెచర్‌పై పడుకో బెట్టుకుని గుంతలమయమైన కంకర రోడ్డుపై దాదాపు అర్ధ కిలోమీటరు దూరంలోని ఆరోగ్య శ్రీ వార్డువరకు తీసుకొచ్చేవారు. ఆ సమయంలో రోగికి కుట్లు తెగిపోవడం, ఆపరేషన్ చేసిన భాగాలు పక్కకు తొలగిపోవడం వంటివి జరిగేవి. దీంతో పాటు పాడైన రోడ్లపై వాహనదారులు, పాదచారుల రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారేది. తొలి రోజు నాలుగు లింకు రోడ్లను కలుపుతూ రోడ్లను ఏర్పాటు చేశారు. -
కుట్లు తెగుతున్నాయ్!
తిరుపతి కార్పొరేషన్: తిరుపతి రుయా ఆస్పత్రి సేవలు పైన పటారం.. లోన లొటారం అన్నట్టుగా మారాయి. సాక్షాత్తు తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉన్న ఈ ఆస్పత్రి అభివృద్ధి రోజురోజుకూ తీసికట్టుగా మారుతోంది. ఆస్పత్రి ఆవరణలో అంతర్గతంగా ఉన్న రోడ్లు దుస్థితికి చేరాయి. వీటిని బాగు చేయాల్సిన అధికారులు, పాలకులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. నరకమే! రుయాలోని కొత్త మార్చురీ సమీపంలో ఆర్థో విభాగం ఉంది. రోడ్డు ప్రమాదాల్లో గాయాల పాలై, కాళ్లు, చేతులు విరిగిపోయిన రోగులకు ఈ విభాగంలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. అనంతరం రోగులను స్ట్రెచ్చర్‌పై పడుకోబెట్టి అక్కడి నుంచి ఆరోగ్య శ్రీ వార్డుకు తరలిస్తారు. ఆర్థో విభాగం నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న ఆ వార్డుకు స్ట్రెచర్‌పై వెళ్లాలంటే నరకమే. ఈ మార్గంలోని తారు రోడ్డు పెచ్చులూడి, రాళ్లు గుంతలమయమైంది. పైగా ఈమార్గంలో వాహనాల రాకపోకలతో రోడ్డు మరింత అధ్వానంగా తయారైంది. ఇదే మార్గంలో స్ట్రెచ్చర్‌పై రోగిని వార్డుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. గుంతలు, రాళ్లపై వెళ్లే టప్పుడు రో గిపడుతున్న బాధ అంతాఇంతా కాదు. కానీ సిబ్బంది ఇవేవీ పట్టించుకోవడంలేదు. రయ్..రయ్ మంటూ లాక్కొచ్చేస్తున్నారు. ఎముకుల ఆపరేషన్ చేసుకున్న రోగులు నొప్పితో తల్లడిల్లిపోతున్నారు. ‘కొంతసేపు ఓపికపట్టు..’ అంటూ సిబ్బంది సముదాయించి తీసుకెళ్లాల్సి వస్తోంది. గుంతల్లో అదురుకు కొన్ని సందర్భా ల్లో జాయింట్లు పక్కకు జరిగిపోతున్నాయని, దీంతో తిరిగి మరో సారి ఆపరేషన్ చేయాల్సి వస్తోందని కొందరు రోగుల సహాయకులు చెబుతున్నారు. నిధులు విడుదలైనా.. రోగులు పడుతున్న బాధలు చూసిన తిరుపతి ఎంపీ వరప్రసాద్ రోడ్డు ఏర్పాటుకు రెండేళ్ల క్రితం రూ.10 లక్షలు మంజూరు చేశారు. రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వైద్యవిద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ రుయా ఆస్పత్రిని వేర్వేరుగా తనిఖీ చేశారు. రోడ్డు పనులను త్వరగా చేపట్టాలని, ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించాలని ఇక్కడి సిబ్బందిని ఆదేశించారు. కానీ ఇంతవరకు పట్టించుకునే నాథుడే లేరు. కాంట్రాక్టర్లు ముందుకు రారట రుయా ఆస్పత్రి అధికారుల మాటలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రుయాలో ఆర్థో నుంచి వచ్చే రోడ్డు, ఇతర రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెబుతున్నారు. వీటి మరమ్మతులకు ఎంపీ నిధుల నుంచి రూ.6 లక్ష లు మంజూరయ్యాయని, అయితే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకురావడంలేదని సెల వివ్వడం గమనార్హం.