ఓపీ కోసం ఎదురు చూస్తున్న రోగులు
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. వైద్యం దైన్యంగా మారింది. వివిధ ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ..హాస్పిటల్‌కు వచ్చేవారికి చీత్కారాలు.. చీదరింపులుతప్ప.. చికిత్స అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రమాదంలో గాయపడి వచ్చే వారి పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. ఓపీకి వచ్చే వారి పరిస్థితిమొదట ఎదురుచూపులు.. ఆ తర్వాత మాత్రలే దిక్కు అన్న చందంగా తయారైంది. జిల్లాలోనిఆస్పత్రుల్లో.. సోమవారం సాక్షి నిర్వహించిన విజిట్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం,ప్రభుత్వ ఉదాసీనత స్పష్టంగా కనిపించింది.
సాక్షి, తిరుపతి (అలిపిరి): రాయలసీమకే పెద్దాస్పత్రిగా గుర్తింపు పొందిన రుయాకు సుస్తీ చేసింది. సోమవారం సాక్షి బృందం రుయా ఆస్పత్రిని విజిట్ చేసింది. పరిశీలనలో.. రుయాలో ఓపీ విభాగం సేవలు అధ్వానంగా ఉన్నాయి. ఓపీ నమోదు కేంద్రంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఆదివారం మినహా ఇతర రోజుల్లో ఉదయం 8.30 గంటలకు ఓపీ నమోదు సేవలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 గంటలకు ఓపీ నమోదు చేసుకున్న రోగులు ఆయా విభాగాల వారీగా ఓపీ విభాగాల వద్దకు చేరుకుం టారు. గేట్లు తెరిచిన వెంటనే ఓపీ నమోదు హాలులోకి 500 మంది ఒక్కసారి దూసుకుపోతున్నారు. దీంతో ఓపీ నమోదు హాలు రోగులతో కిక్కిరిసిపోతుంది. రుయా ఆస్పత్రిలో కంప్యూటర్, ఇంటర్నెట్ నిర్వహణ నిమిత్తం ప్రైవేట్ సంస్థకు ఏటా రూ.లక్షలు చెల్లిస్తున్నారు. అయినా ఓపీ కేంద్రాల నిర్వాహణ అధ్వానంగా మారింది.
సమయపాలన పాటించని వైద్యులు
రుయా ఆస్పత్రిలో ఉన్నతాధికారులు మొదలుకుని సీనియర్ వైద్యుల వరకు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటలకు ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రాంభమైనా అధికారులు అందుబాటులో ఉండడం లేదు. ఓపీ సేవలు మధ్యాహ్నం 12.30 గంటల వరకు వున్నా కొందరు వైద్యులు 12 గంటలకే వెళ్లిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, చోటామోటా నాయకుల రెకమెండేషన్ వుంటేనే ఆపరేషన్లు త్వరితగతిన చేసి డిశ్చార్జ్ చేస్తున్నారు. లేకుంటే పడిగాపులు తప్పవు.
పట్టించుకునేవారు లేరు..
నెల రోజుల క్రితం ప్రమాదవశాత్తు కిందపడి ఎడమ కాలికి గాయమైంది. రుయాకు వైద్యం కోసం వచ్చా. ఆర్థో విభాగానికి వెళితే తగిలిన గాయానికి కట్టుకట్టారు. నెల రోజులుగా రుయా ఆవరణలోని విశ్రాంతి సముదాయంలో ఉన్న.. దెబ్బ మానడం లేదు. వైద్యులు బయట మందులు రాస్తున్నారు. దిక్కులేక ఇక్కడే ఉన్నాను
– రాము, మైసూరు, కర్ణాటక
సహాయకులుంటేనే వైద్యం అంటున్నారు
కుడికాలుకు అరికాలులో చెక్కపేడు ఇరుక్కుపోయింది. వారం రోజుల క్రితం రుయా ఆర్థో విభాగానికి వస్తే గాయాన్ని క్లీన్‌చేసి కట్టుకట్టి పంపారు. మళ్లీ వైద్యం కోసం వస్తే ఆపరేషన్ చేసి చెక్కను తీస్తాం.. నీకు సహాయకులుంటే వైద్యం చేస్తాం.. లేకుంటే లేదు. అని చెప్పారు. నాకు ఎవరూ లేరు... వైద్యం కోసం వస్తే ఇలా చెప్పడం బాధేసింది. పెద్ద సార్లు నాకు వైద్యం అందించి కాలులోని చెక్క పేడును తొలగించాలి.
– సుబ్బరాజు, నాయుడు పేట, నెల్లూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment