సాక్షి కథనంపై స్పందించిన అధికారులు
రూ.24.65 లక్షలతో లింకు రోడ్ల ఏర్పాటు
రోగులకు తప్పనున్న పాట్లు
తిరుపతి మెడికల్: తిరుపతి రుయా ఆసుపత్రిలోని లింకు రోడ్లకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. గుంతలమయంగా మారి, కంకర తేలి రోగుల పాలిట నరకంగా మారిన రోడ్ల దుస్థితిపై అధికారులు కరుణించారు. ఈనెల 1వ తేదిన సాక్షి జిల్లా ప్రధాన సంచికలో ‘కుట్లు తెగిపోతున్నాయ్..’ శీర్షికతో రుయా రోడ్ల దయనీయతపై కథనం ప్రచురించిన విషయం విదితమే. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ తక్షణం లింకు రోడ్లను అభివృద్ధి చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్‌చంద్‌ను ఆదేశించారు. దీంతో నగర పాలక సంస్థ నిధులు రూ.24.65 లక్షలతో వెంటనే తారు రోడ్ల నిర్మాణం ప్రారంభించారు.
గతంలో ఆర్థో విభాగం నుంచి ఆపరేషన్ రోగులను స్ట్రెచర్‌పై పడుకో బెట్టుకుని గుంతలమయమైన కంకర రోడ్డుపై దాదాపు అర్ధ కిలోమీటరు దూరంలోని ఆరోగ్య శ్రీ వార్డువరకు తీసుకొచ్చేవారు. ఆ సమయంలో రోగికి కుట్లు తెగిపోవడం, ఆపరేషన్ చేసిన భాగాలు పక్కకు తొలగిపోవడం వంటివి జరిగేవి. దీంతో పాటు పాడైన రోడ్లపై వాహనదారులు, పాదచారుల రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారేది. తొలి రోజు నాలుగు లింకు రోడ్లను కలుపుతూ రోడ్లను ఏర్పాటు చేశారు.