మహిళా సంఘాల సమావేశ వేళలపై ఆంక్షలు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో మహిళా స్వయంశక్తి సంఘాల సమావేశాలు, చర్చలు, సమీక్షలను సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత నిర్విహించరాదని, టీటీడీసీల్లో సాయంత్రం 5 గంటల తర్వాత పురుష ఉద్యోగులు ఉండరాదని రాష్ట్ర పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్) సీఈవో డాక్టర్ బి.రాజశేఖర్ ఆదేశించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జెండర్ విభాగం అధికారిణి జమున మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ‘నిర్భయ’ పేరిట ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
ప్రతి సంఘ సభ్యురాలు నెలకు ఒక రూపాయి చొప్పున విరాళం అందజేస్తే నెలకు కోటి రూపాయలు సమకూరతాయని చెప్పారు. ఈ నిధిని మహిళల భద్రత కోసం వినియోగిస్తామని, ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ తనూజారాణి తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్‌కి ఎన్నికల కోడ్ వర్తించదా?
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో డీఆర్డీఏ అధికారులతో సెర్ప్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల విధులకు సంబంధించిన అంశాలపై తప్ప శాఖల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎలాంటి సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం లేదు.
అయితే దీనిని సెర్ప్, ఐకేపీ, డీఆర్డీఏ అధికారులు పట్టించుకోవటం లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక.. స్త్రీనిధి రుణాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే బీమా ప్లస్, అభయ హస్తం ప్లస్ అనే కొత్త పథకాలను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు.