saharsa
-
బైకర్‌ను ఢీకొట్టి 1.5 కిమీ ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్.. అరుస్తున్నా ఆపకుండా..
పాట్నాా: బిహార్ సహర్సా జిల్లాలో ఢిల్లీ తరహా ఘటన జరిగింది. ఓ ఆటో డ్రైవర్ బైకర్‌ను ఢీకొట్టి 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఆపమని అరుపులు, కేకలు పెట్టినా పట్టించుకోకుండా అలాగే వేగంగా ఆటోను పోనిచ్చాడు. చివరకు ఓ చోట ఆటో ఆపి బైకర్‌ను రోడ్డు పక్కన పడేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బైకర్ పరిస్థితి విషమంగా ఉందని, అతని కుడి కాలు తీవ్రంగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. అవసరమైతే కాలును పూర్తిగా తొలగించాల్సి రావచ్చని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడ్డ బైకర్‌ను కోమల్ కిషోర్ సింగ్(25)గా గుర్తించారు. ఇతడు మంగళవారం తన స్వాగ్రామం హేంపూర్ వెళ్తుండగా బిహ్రా బ్రహాం ఆస్థాన్ వద్ద ఆటో ఢీకొట్టింది. దీంతో అతను ఆటో కిందే ఇరుక్కుపోయాడు. అయితే ఆటో డ్రైవర్ మాత్రం అక్కడి నుంచి పారిపోవాలని వాహనాన్ని అలాగే పోనిచ్చాడు. 1.5 కిలోమీటర్లు కిశోర్‌ను ఈడ్చుకెళ్లాడు. స్థానికులు ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చివరకు బైకర్‌ను రోడ్డపక్కన పడేసి ఆటోడ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఢిల్లీలో జనవరి 1న అంజలి అనే యువతిని కారు ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యువతి దారుణంగా చనిపోయింది. పోలీసులు నిందితులను గంటల్లోనే అరెస్టు చేశారు. చదవండి: ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి.. -
రోడ్డుపై నోట్లు.. ఒక్కరు ముట్టుకుంటే ఒట్టు!
పట్నా: రోడ్డుపై రూపాయి పడితే క్షణాల్లో మాయమవుతుంది. కానీ కరోనా కాలంలో వేల రూపాయలు నడిరోడ్డుపై దర్శనమిచ్చిన తీసుకునేందుకు జనం జంకుతున్నారు. బిహార్‌లో వెలుగు చూసిన ఉదంతమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. నగదు ఎరగా వేసి కరోనా వైరస్‌ను వ్యాపింపజేస్తున్నారన్న వదంతులతో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి మళ్లీ తన సొమ్ములు దక్కించుకోగలిగాడు. (ఇళ్ల ముందు కరెన్సీ నోట్ల కలకలం) సహర్ష జిల్లాకు చెందిన గజేంద్ర షా(29) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తాను పోగొట్టుకున్న 20,500 రూపాయలను అనూహ్యంగా తిరిగి పొందగలిగాడు. లాక్డౌన్ నేపథ్యంలో శనివారం ఉదయం ఐదున్నరకే లేచి టిన్‌షెడ్ కొనేందుకు 25 వేల రూపాయలు తీసుకుని మహువా బజార్‌కు బయలుదేరాడు. మార్కెట్ చేరడానికి కొంచెం దూరం ముందు తన జేబు నుంచి రూ.20,500 పోయినట్టు గుర్తించాడు. ‘నా జేబులో నుండి పొగాకు ప్యాకెట్ తీసేటప్పుడు నగదు పడిపోయిందని నేను గ్రహించాను. ఇది ఎక్కడ జరిగిందో నాకు తెలియకపోయినా, నేను నా ఆటో నుండి దిగి నా డబ్బు కోసం కొన్ని కిలోమీటర్లు వెనక్కి నడిచి వెళ్లాను. కానీ ఫలితం లేకుండా పోయింది’ అని షా బాధ పడ్డాడు. రెండు నెలల తన సంపాదన పోయిందన్న దిగులుతో ఇంటికి తిరిగి వచ్చాడు. కరోనా వైరస్ సోకుతుందన్న భయంతో రోడ్డుపై పడిన నగదును ఎవరూ తీసుకోకపోవడంతో ఉడాకిషన్‌గంజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఫేస్‌బుక్‌తో తిరుగున్న వార్తను పొరుటింటాయన గజేంద్రకు చూపించాడు. వెంటనే గజేంద్ర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన డబ్బును తిరిగి దక్కించుకున్నాడు. ‘రోడ్డుపై డబ్బులు పడివున్నాయని, కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు కావాలనే ఎవరో నగదు పడేశారని మాకు చాలా మంది ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి నగదు స్వాధీనం చేసుకున్నాం. ఆ డబ్బు తనదేనంటే గజేంద్ర రావడంతో వివరాలన్ని కనుక్కుని అతడికి ఇచ్చేశామన’ని ఉడాకిషన్‌గంజ్ ఇన్స్‌స్పెక్టర్ శశిభూషణ్ సింగ్ తెలిపారు. సోషల్ మీడియాలో చక్కర్లు వదంతుల కారణంగానే తన డబ్బు మళ్లీ తనకు దక్కిందని గజేంద్ర అన్నాడు. ఒక వ్యక్తి కరెన్సీ నోటుతో ముక్కు తుడుచుకున్న టిక్‌టాక్ వీడియోను తాను కూడా చూశానని వెల్లడించాడు. ఎవరూ లేని దారిలో డబ్బు కనపడినా తాను కూడా తీసుకునేవాడిని కాదని చెప్పాడు. పొగాకు నమిలే అలవాటును మానుకోవాలని అతడు భావిస్తున్నాడు. కరోనా భయం కారణంగానే తన డబ్బు తనకు దక్కిందని అతడు అంటున్నాడు. (3,900 కేసులు.. 195 మరణాలు) -
ప్రమాదంతో రైల్వే శాఖకు 90 కోట్ల నష్టం
బీహార్‌లో పట్టాలపై నిలబడి ఉన్న భక్తుల మీదకు రైలు దూసుకెళ్లి దాదాపు 38 మంది వరకు మరణించిన ఘటన కారణంగా.. రైల్వే శాఖకు వాటిల్లిన నష్టం విలువ ఎంతో తెలుసా? దాదాపు 90 కోట్ల రూపాయలు!! తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు, స్థానికులు కలిసి సహార్సా నుంచి పాట్నా వెళ్లే రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ (నెం.12567) ఇంజన్, ఒక ఏసీ బోగీ సహా మొత్తం 12 బోగీలకు నిప్పు పెట్టారు. దాంతోపాటు సమస్తిపూర్ నుంచి సహర్సా వచ్చే ప్యాసింజర్ రైలుకు చెందిన ఐదు బోగీలు, ఇంజన్‌ను కూడా తగలబెట్టారు. అధికారికంగా రైల్వే శాఖ మృతుల సంఖ్యను 28గానే చెబుతున్నా, వాస్తవానికి ఈ సంఘటనలో 38 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో స్టేషన్లో ఉన్న ప్రయాణికులతో పాటు రైల్లోని వారు కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రజాగ్రహం ఫలితంగా రైల్వేలకు సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. రైల్వే స్టేషన్, కేబిన్, పట్టాలు.. అన్నీ ధ్వంసమయ్యాయి. కనీసం ఆ ప్రాంతానికి వెళ్లి ఆస్తులను కాపాడుకోవడం కూడా సాధ్యం కాలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో అబిత్బా ప్రభాకర్ తెలిపారు. ఆ ప్రాంతానికి వెళ్లడానికి నేరుగా రోడ్డు కూడా లేకపోవడం, ఉన్న ఏకైక రైలు మార్గం ధ్వంసం కావడంతో రైల్వే డాక్టర్లు గానీ, సహాయ బృందాలు గానీ అక్కడకు చేరుకోలేకపోయినట్లు తెలిసింది. మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలోనే రైల్వే రక్షణ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. -
బీహార్‌లో రైలు ఢీకొని 24 మంది మృతి
బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దాదాపు 24 మంది భక్తులు రైలుచక్రాల కింద పడి నలిగి ప్రాణాలు కోల్పోయారు. సహార్సా నుంచి పాట్నా వెళ్లే రాజారాణి ఎక్స్‌ప్రెస్ ఈ దుర్ఘటనకు కారణమైంది. భమారా రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు డ్రైవర్‌ను లాగి కొట్టడమే కాక, కొన్ని బోగీలకు నిప్పు పెట్టారు. బాధితుల్లో చాలామంది కన్వారియాలు (శివభక్తులు). వీరు పట్టాల మీద నిలబడి ఉండగా, రాజారాణి ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకొచ్చి వీరిని ఢీకొట్టింది. తూర్పు రైల్వే పరిధిలోని సమస్తిపూర్ డివిజన్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భక్తులలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. దుర్ఘటన జరిగిన తర్వాత కొంత దూరం వెళ్లి రైలు ఆగిపోయింది. ఈ ప్రమాదం ఫలితంగా ఆ మార్గంలో కొంత సేపటి పాటు రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.