పాట్నాా: బిహార్ సహర్సా జిల్లాలో ఢిల్లీ తరహా ఘటన జరిగింది. ఓ ఆటో డ్రైవర్ బైకర్‌ను ఢీకొట్టి 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఆపమని అరుపులు, కేకలు పెట్టినా పట్టించుకోకుండా అలాగే వేగంగా ఆటోను పోనిచ్చాడు. చివరకు ఓ చోట ఆటో ఆపి బైకర్‌ను రోడ్డు పక్కన పడేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బైకర్ పరిస్థితి విషమంగా ఉందని, అతని కుడి కాలు తీవ్రంగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. అవసరమైతే కాలును పూర్తిగా తొలగించాల్సి రావచ్చని పేర్కొన్నారు.
తీవ్రంగా గాయపడ్డ బైకర్‌ను కోమల్ కిషోర్ సింగ్(25)గా గుర్తించారు. ఇతడు మంగళవారం తన స్వాగ్రామం హేంపూర్ వెళ్తుండగా బిహ్రా బ్రహాం ఆస్థాన్ వద్ద ఆటో ఢీకొట్టింది. దీంతో అతను ఆటో కిందే ఇరుక్కుపోయాడు. అయితే ఆటో డ్రైవర్ మాత్రం అక్కడి నుంచి పారిపోవాలని వాహనాన్ని అలాగే పోనిచ్చాడు. 1.5 కిలోమీటర్లు కిశోర్‌ను ఈడ్చుకెళ్లాడు. స్థానికులు ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చివరకు బైకర్‍ను రోడ్డపక్కన పడేసి ఆటోడ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీలో జనవరి 1న అంజలి అనే యువతిని కారు ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యువతి దారుణంగా చనిపోయింది. పోలీసులు నిందితులను గంటల్లోనే అరెస్టు చేశారు.
చదవండి: ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి..
Comments
Please login to add a commentAdd a comment