![Bihar Man Finds Lost Rs 20,000 Untouched as Locals Fall Prey to Fake News - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/6/Money_Road1.jpg.webp?itok=SL-u_SAg)
పట్నా: రోడ్డుపై రూపాయి పడితే క్షణాల్లో మాయమవుతుంది. కానీ కరోనా కాలంలో వేల రూపాయలు నడిరోడ్డుపై దర్శనమిచ్చిన తీసుకునేందుకు జనం జంకుతున్నారు. బిహార్‌లో వెలుగు చూసిన ఉదంతమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. నగదు ఎరగా వేసి కరోనా వైరస్‌ను వ్యాపింపజేస్తున్నారన్న వదంతులతో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి మళ్లీ తన సొమ్ములు దక్కించుకోగలిగాడు. (ఇళ్ల ముందు కరెన్సీ నోట్ల కలకలం)
సహర్ష జిల్లాకు చెందిన గజేంద్ర షా(29) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తాను పోగొట్టుకున్న 20,500 రూపాయలను అనూహ్యంగా తిరిగి పొందగలిగాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో శనివారం ఉదయం ఐదున్నరకే లేచి టిన్‌షెడ్ కొనేందుకు 25 వేల రూపాయలు తీసుకుని మహువా బజార్‌కు బయలుదేరాడు. మార్కెట్ చేరడానికి కొంచెం దూరం ముందు తన జేబు నుంచి రూ.20,500 పోయినట్టు గుర్తించాడు. ‘నా జేబులో నుండి పొగాకు ప్యాకెట్ తీసేటప్పుడు నగదు పడిపోయిందని నేను గ్రహించాను. ఇది ఎక్కడ జరిగిందో నాకు తెలియకపోయినా, నేను నా ఆటో నుండి దిగి నా డబ్బు కోసం కొన్ని కిలోమీటర్లు వెనక్కి నడిచి వెళ్లాను. కానీ ఫలితం లేకుండా పోయింది’ అని షా బాధ పడ్డాడు.
రెండు నెలల తన సంపాదన పోయిందన్న దిగులుతో ఇంటికి తిరిగి వచ్చాడు. కరోనా వైరస్ సోకుతుందన్న భయంతో రోడ్డుపై పడిన నగదును ఎవరూ తీసుకోకపోవడంతో ఉడాకిషన్‌గంజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఫేస్‌బుక్‌తో తిరుగున్న వార్తను పొరుటింటాయన గజేంద్రకు చూపించాడు. వెంటనే గజేంద్ర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన డబ్బును తిరిగి దక్కించుకున్నాడు. ‘రోడ్డుపై డబ్బులు పడివున్నాయని, కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు కావాలనే ఎవరో నగదు పడేశారని మాకు చాలా మంది ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి నగదు స్వాధీనం చేసుకున్నాం. ఆ డబ్బు తనదేనంటే గజేంద్ర రావడంతో వివరాలన్ని కనుక్కుని అతడికి ఇచ్చేశామన’ని ఉడాకిషన్‌గంజ్ ఇన్స్‌స్పెక్టర్ శశిభూషణ్ సింగ్ తెలిపారు.
సోషల్ మీడియాలో చక్కర్లు వదంతుల కారణంగానే తన డబ్బు మళ్లీ తనకు దక్కిందని గజేంద్ర అన్నాడు. ఒక వ్యక్తి కరెన్సీ నోటుతో ముక్కు తుడుచుకున్న టిక్‌టాక్ వీడియోను తాను కూడా చూశానని వెల్లడించాడు. ఎవరూ లేని దారిలో డబ్బు కనపడినా తాను కూడా తీసుకునేవాడిని కాదని చెప్పాడు. పొగాకు నమిలే అలవాటును మానుకోవాలని అతడు భావిస్తున్నాడు. కరోనా భయం కారణంగానే తన డబ్బు తనకు దక్కిందని అతడు అంటున్నాడు. (3,900 కేసులు.. 195 మరణాలు)
Comments
Please login to add a commentAdd a comment