కోల్కత్తా చిత్రోత్సవాల్లో అప్పూ
ఏనుగుని చూడాలనే చిన్న కోరిక కలుగుతుంది అప్పూకు. కానీ అది తీర్చే తీరిక వాళ్ల తల్లిదండ్రులకు ఉండదు. దాంతో స్నేహితులతో కలసి అప్పూ చేసిన సాహసం ఏంటి? అనేది ‘అప్పూ’ చిత్రకథ. పిల్లల చిన్న చిన్న కోరికలు తీర్చకపోతే ఏం జరుగుతుంది? అనే కథాంశంతో తెరకెక్కింది. కె. లక్ష్మీ సమర్పణలో మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై కె. మోహన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. మాస్టర్ సాయి శ్రీవంత్ (యశస్వి) టైటిల్ రోల్ పోషించిన ఈ బాలల చిత్రం 8వ కోల్కత్తా అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలకు ఎంపికైంది.
ఈ సందర్భంగా దర్శక–నిర్మాత మోహన్ మాట్లాడుతూ – ‘‘కోల్కత్తా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మా సినిమా ఎంపిక అవ్వడం సంతోషంగా ఉంది. ఈ నెల 20 నుంచి 27 వరకూ జరిగే ఈ చిత్రోత్సవాల్లో 22న మా ‘అప్పూ’ చిత్రం ప్రదర్శిస్తారు. 2017లో హైదరాబాద్లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో మా చిత్రం ప్రదర్శితమైంది. ఇప్పుడు కోల్కత్తా చిత్రోత్సవాల్లో 35 దేశాల నుంచి వచ్చిన 200పై చిలుకు చిత్రాల్లో మా ‘అప్పూ’ ఉండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.