Saidapur
-
తక్కువ ధరకే మొబైల్ అన్నారు.. పార్శిల్లో పవర్ బ్యాంక్, మట్టి పెల్ల
సాక్షి, సైదాపూర్(కరీంనగర్): తక్కువ ధరకే మొబైల్ అన్నారు.. రూ.1,500 చెల్లించాక పార్శిల్లో మట్టి పెల్ల పంపిన ఘటన సైదాపూర్ మండలంలోని జాగీర్‌పల్లిలో శుక్రవారం వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రోజుల క్రితం జాగీర్‌పల్లికి చెందిన సిలివేరు అజయ్‌కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీకు ఆఫర్ వచ్చిందని చెప్పారు. రూ.1,500కే రూ.12 వేల విలువైన ఫోన్ మీ సొంతమన్నారు. అది నమ్మిన అజయ్ పోస్టాఫీసుకు వెళ్లి, డబ్బులు చెల్లించి, పార్శిల్ తీసుకున్నాడు. ఇంటికి వచ్చి, ఓపెన్ చేస్తే, అందులో ఒక పవర్ బ్యాంకు, ఒక మట్టి పెల్ల ఉండటంతో మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి -
ఇదేమి సహకారమో..!
సాక్షి, సైదాపూర్(హుజూరాబాద్) : సహకార సంఘంలో అప్పులు తీసుకోకున్నా, అప్పులు తీసుకున్నట్లు డిమాండ్ నోటీసులు ఇచ్చి ఆయా కుటుంబాల్లో చిచ్చు పెట్టిన సంఘటన సైదాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గొడిశాలకు చెందిన పిన్నింటి రాంరెడ్డికి సంఘంలో అప్పు లేకున్నా రూ.77,500 అసలు అప్పు, దానికి మిత్తి కింద రూ.4,140 చెల్లించాలని సంఘం పేరున డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. బాధిత రైతు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాంరెడ్డి సహకార సంఘంలో 2001లో లాంగ్‌టర్మ్ రుణం తీసుకున్నాడు. ఆ రుణం మొత్తం 2003 డిసెంబర్ 31న పూర్తిగా చెల్లించాడు. పిల్లల చదువు కోసం కరీంనగర్ వచ్చి, రెడ్డి మార్బుల్ షాపులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లల చదువు కోసం కరీంనగర్లో ఓ బ్యాంకులో స్టడీ లోన్‌కు దరఖాస్తులు చేసుకున్నాడు. స్వగ్రామంలో ఇతర బ్యాంకుల్లో అప్పులేనట్లు నోడ్యూస్ సర్టిఫికెట్ అడగడంతో సైదాపూర్‌లోని కేడీసీసీ, వైశ్యాబాంకుల్లో నోడ్యూస్ సర్టిఫికేట్లు తీసుకున్నాడు. ఇలా ఉండగా ఈనెల 27న రాంరెడ్డి పేరున గొడిశాలలో ఓ బెల్టుషాపులో నోటీస్ ఇచ్చారు. ఈ విషయం రాంరెడ్డి ఇంట్లో తెలిసింది. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఏం చేశావని ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ ముదిరింది. దీంతో గొడిశాలకు వచ్చిన రాంరెడ్డి నోటీసులు తీసుకోని సహకారం సంఘంలో కలిశాడు. పాత బాకీ కట్టిన రశీదులు, నో డ్యూస్ పత్రం కూడా చూపించాడు. అప్పు లేకుంటే నోటీసులు ఎందుకు ఇస్తాం. రికార్డులు చూడాలి. అని సీఈవో బిక్షపతి బదులిచ్చాడు. అప్పు లేకున్నా, అప్పు ఉన్నట్లు నోటీసులు ఇచ్చి సహకార సంఘం అధికారులు పరువు తీశారని విలేకరులతో రాంరెడ్డి మొరపెట్టుకున్నారు. దీనిపై సీఈవో వివరణ కోరగా వాస్తవంగా రాంరెడ్డి పేరున అప్పు లేదు. పొరపాటున నోటీస్ వెళ్లిందని వివరణ ఇచ్చాడు. -
బావిలో పడిన ట్రాక్టర్: నలుగురు మృతి
సైదాపూర్: వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న పోలీస్ బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా... ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి శివారులో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కత్తుల శివ (25) ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో స్నేహితులు పిల్లి సంతోష్‌కుమార్, బొల్లి రాజు, కొంకట శ్రీకాంత్‌లతో కలిసి సైదాపూర్‌లో శుక్రవారం దావత్ చేసుకొని అర్ధరాత్రి ట్రాక్టర్‌పై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ట్రాక్టర్ దుద్దెనపల్లి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న పోలీస్ బైక్‌ను ఢీకొట్టి... అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న నలుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. అలాగే బైక్‌పై ఉన్న పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో వారు అంబులెన్స్‌కు, ఇతర పోలీస్ సిబ్బందికి ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బావిలో పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అర్ధరాత్రి కావడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. శనివారం ఉదయం పోలీసులు నలుగురు యువకుల మృతదేహాలను బయటకు తీస్తున్నారు. -
డబ్బు కోసం కన్నబిడ్డనే అమ్మేశాడు
సైదాపూర్ (కరీంనగర్ జిల్లా) : సైదాపూర్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. డబ్బుల కోసం కన్నకొడుకునే అమ్మేశాడో తండ్రి. సైదాపూర్‌కు చెందిన జయరాజ్(35), హైమ(28) భార్యాభర్తలు. 20 రోజుల క్రితం హైమకు హైదరాబాద్‌లో డెలివరీ అయింది. బిడ్డ పుట్టగానే చనిపోయాడని తల్లికి చెప్పి డబ్బు కోసం బిడ్డను ఓ వ్యక్తికి అమ్మేశాడు జయరాజ్. ఈ విషయం ఆదివారం జయరాజ్ వేరొక వ్యక్తితో మాట్లాడుతుండగా హైమా వినింది. విషయం తెలిసి సైదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
సైదాపూర్‌లో 47.33డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత!
- మహబూబ్‌నగర్ జిల్లా ఐజలో 44.51 డిగ్రీలు హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో గురువారం ఏకంగా 47.33 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఇంతటి స్థాయిలో ఉష్ణోగ్రతలు మార్చిలో రావడం వాతావరణశాఖనూ విస్మయానికి గురిచేస్తోంది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా ఐజలోనూ 44.51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిర్యాలగూడలో 42.31 డిగ్రీలు రికార్డు అయింది. రాష్ట్రంలో చాలాచోట్ల 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే వడగాల్పుల తీవ్రత పెరిగినా అధికారయంత్రాంగం మాత్రం అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బీజేపీతో కాంగ్రెస్ దోస్తీ
- సైదాపూర్ ఎంపీపీ రాజకీయం రసవత్తరం - కాంగ్రెస్ సభ్యులతో ఢిల్లీలో బీజేపీ క్యాంపు సైదాపూర్, న్యూస్‌లైన్: హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ సైదాపూర్ మండలంలో నాలుగు ఎంపీటీసీలను మాత్రమే గెలుచుకుంది. మండలంలో 12 ఎంపీటీసీలకు మిగతా నాలుగు టీఆర్ఎస్, మూడు బీజేపీ గెలుచుకోగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యాడు. టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి స్వతంత్రంగా గెలిచి మళ్లీ టీఆర్ఎస్ గూటికే చేరడంతో ఆ పార్టీకి ఐదు ఎంపీటీసీల బలం చేకూరింది. ఆ పార్టీ నుంచి స్వతంత్రుడే ఎంపీపీ రేసులో ఉన్నాడు. ఇది ఆ పార్టీలో కొందరు నాయకులకు మింగుడుపడకున్నా.. ఎంపీపీ కావాలంటే మరో ఇద్దరు సభ్యుల మద్దతు అవసరం ఏర్పడింది. దీంతో బీజేపీ సభ్యులకు స్వతంత్రుడు గాలం విసిరాడు. ఆ ఇద్దరు బీజేపీ సభ్యులు స్వతంత్రునికి చిక్కేలోపే కాంగ్రెస్ బీజేపీతో జతకట్టింది. ఎంపీపీ మీరైనా, మేమైనా పర్వాలేదు.. కానీ టీఆర్ఎస్ కాకూడదని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. బీజేపీలో గెలిచిన ఒక ఎంపీటీసీపై నాయకుల పెత్తనం ఎక్కువైంది. నేనంటే.. నేనే గెలిపించానని, తాను చెప్పిన వ్యక్తికే మద్దతివ్వాలని ఒక నాయకుడు ఒక పార్టీతో తానొక ఎంపీటీసీని ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇలాంటి లుకలుకలు గమనించిన రెండు పార్టీలు క్యాంపునకు సిద్ధమయ్యాయి. ఎంపీపీ రేసులో ఉన్న బీజేపీకి చెందిన ఆకునూర్ ఎంపీటీసీ ముత్యాల ప్రియారెడ్డి ముగ్గురు బీజేపీ సభ్యులతో పాటు నలుగురు కాంగ్రెస్ సభ్యులు మొత్తం ఏడుగురితో క్యాంపు నిర్వహిస్తున్నారు. ఎంపీపీగా ప్రియారెడ్డి, వైస్ ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన రాయికల్ ఎంపీటీసీ ఊసకోయిల ధనలక్ష్మి క్యాంపులో ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈనెల 14 నుంచి క్యాంపు నిర్వహిస్తుండగా, రెండు తెలుగు రాష్ట్రాలలో చూడదగిన ప్రదేశాలన్నీ దర్శించుకున్నారు. అనంతరం ఆదివారం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం తర్వాత ఈ నెలాఖరు వరకు ఢిల్లీలోనే ఒక బీజేపీ జాతీయ నాయకుని సహకారంతో క్యాంపు నిర్వహించే అవకాశాలున్నాయి. జూన్ 2 తర్వాత నిర్వహించే ఎంపీపీ ఎన్నిక రోజు సమయానికి మాత్రమే మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీలు దర్శనమిస్తారని క్యాంపు రాయబారుల ద్వారా తెలిసింది. మరోవైపు టీఆర్ఎస్కు ఎంపీపీ పీఠంపై ఆశలు చిగురిస్తూనే ఉన్నాయి. విహారయాత్రలతో అహ్లాదంగా నిర్వహిస్తున్న క్యాంపు ఫలిస్తుందా.. వికటిస్తుందా అన్నది ఎంపీపీ ఎన్నిక దాకా వేచిచూడాల్సిందే. -
ఏసీబీ వలలో ఆర్ఐ
పహణీలో పేరు ఎక్కించేందుకు లంచం డిమాండ్ రూ.4 వేలు తీసుకుంటుండగా పట్టివేత సైదాపూర్, న్యూస్‌లైన్ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కిం ది. పహణీలో పేరు ఎక్కించేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన అధికారి డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం... ఘనపూర్‌కు చెందిన గుంటి మహేందర్ అనే రైతుకు 253 సర్వేనంబర్‌లో 3.06 ఎకరాల భూమి ఉంది. పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నా కంప్యూటర్ పహణీలో మాత్రం పేరు నమోదు కాలేదు. పహణీలో నమోదు చేయాలని మూడు నెలల క్రితం తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కేసు నమో దు చేసి ఆర్ఐని అరెస్టు చేశారు. ఆదివారం రి మాండ్‌కు పంపనున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ రెవెన్యూశాఖలో అవినీతి బాగా పెరిగిపోయిం దని, దాడులు చేసి ఎంతమందిపై కేసులు నమోదు చేసినా వారిలో మార్పు రావడం లేదని అన్నారు. విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. గృహనిర్మాణ శాఖలోనూ అవినీ తిపరులు పెరిగిపోయారని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తన సెల్ : 9440446150, సీఐ సెల్: 9440446139 నంబర్ల లో ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. మెసేజ్ చేసినా స్పందిస్తామన్నారు.దాడుల్లో సీఐలు వి.వి.రమణమూర్తి, జి.శ్రీనివాసరాజు, వేణుగోపాల్ సిబ్బంది పాల్గొన్నారు.