బీజేపీతో కాంగ్రెస్ దోస్తీ
- సైదాపూర్ ఎంపీపీ రాజకీయం రసవత్తరం
- కాంగ్రెస్ సభ్యులతో ఢిల్లీలో బీజేపీ క్యాంపు
సైదాపూర్, న్యూస్‌లైన్: హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ సైదాపూర్ మండలంలో నాలుగు ఎంపీటీసీలను మాత్రమే గెలుచుకుంది. మండలంలో 12 ఎంపీటీసీలకు మిగతా నాలుగు టీఆర్‌ఎస్, మూడు బీజేపీ గెలుచుకోగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యాడు. టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి స్వతంత్రంగా గెలిచి మళ్లీ టీఆర్‌ఎస్ గూటికే చేరడంతో ఆ పార్టీకి ఐదు ఎంపీటీసీల బలం చేకూరింది. ఆ పార్టీ నుంచి స్వతంత్రుడే ఎంపీపీ రేసులో ఉన్నాడు.
ఇది ఆ పార్టీలో కొందరు నాయకులకు మింగుడుపడకున్నా.. ఎంపీపీ కావాలంటే మరో ఇద్దరు సభ్యుల మద్దతు అవసరం ఏర్పడింది. దీంతో బీజేపీ సభ్యులకు స్వతంత్రుడు గాలం విసిరాడు. ఆ ఇద్దరు బీజేపీ సభ్యులు స్వతంత్రునికి చిక్కేలోపే కాంగ్రెస్ బీజేపీతో జతకట్టింది. ఎంపీపీ మీరైనా, మేమైనా పర్వాలేదు.. కానీ టీఆర్‌ఎస్ కాకూడదని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. బీజేపీలో గెలిచిన ఒక ఎంపీటీసీపై నాయకుల పెత్తనం ఎక్కువైంది.
నేనంటే.. నేనే గెలిపించానని, తాను చెప్పిన వ్యక్తికే మద్దతివ్వాలని ఒక నాయకుడు ఒక పార్టీతో తానొక ఎంపీటీసీని ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇలాంటి లుకలుకలు గమనించిన రెండు పార్టీలు క్యాంపునకు సిద్ధమయ్యాయి. ఎంపీపీ రేసులో ఉన్న బీజేపీకి చెందిన ఆకునూర్ ఎంపీటీసీ ముత్యాల ప్రియారెడ్డి ముగ్గురు బీజేపీ సభ్యులతో పాటు నలుగురు కాంగ్రెస్ సభ్యులు మొత్తం ఏడుగురితో క్యాంపు నిర్వహిస్తున్నారు. ఎంపీపీగా ప్రియారెడ్డి, వైస్ ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన రాయికల్ ఎంపీటీసీ ఊసకోయిల ధనలక్ష్మి క్యాంపులో ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం.
ఈనెల 14 నుంచి క్యాంపు నిర్వహిస్తుండగా, రెండు తెలుగు రాష్ట్రాలలో చూడదగిన ప్రదేశాలన్నీ దర్శించుకున్నారు. అనంతరం ఆదివారం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం తర్వాత ఈ నెలాఖరు వరకు ఢిల్లీలోనే ఒక బీజేపీ జాతీయ నాయకుని సహకారంతో క్యాంపు నిర్వహించే అవకాశాలున్నాయి.
జూన్ 2 తర్వాత నిర్వహించే ఎంపీపీ ఎన్నిక రోజు సమయానికి మాత్రమే మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీలు దర్శనమిస్తారని క్యాంపు రాయబారుల ద్వారా తెలిసింది. మరోవైపు టీఆర్‌ఎస్‌కు ఎంపీపీ పీఠంపై ఆశలు చిగురిస్తూనే ఉన్నాయి. విహారయాత్రలతో అహ్లాదంగా నిర్వహిస్తున్న క్యాంపు ఫలిస్తుందా.. వికటిస్తుందా అన్నది ఎంపీపీ ఎన్నిక దాకా వేచిచూడాల్సిందే.