సెంటిమెంట్‌కు ఎస్పీవై రెడ్డి దూరం
నంద్యాల, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో పోటీ చేసేవారంతా మంచి ముహూర్తాన్ని చూసుకుని నామినేషన్లు వేస్తుండగా నంద్యాల ఎంపీ ఎస్పీవెరైడ్డి ఇందుకు మినహాయింపు. ఆయన ఏనాడు ముహుర్తం చూసి నామినేషన్ దాఖలు చేయడని ఆయన అనుచరులు, బంధువులు చెబుతున్నారు. 1991లో లోక్‌సభ, 1999లో నంద్యాల, గిద్దలూరు అసెంబ్లీ స్థానాలు, 2000లో మున్సిపల్ చైర్మన్ పదవి, 2004, 2009 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఏ ఎన్నికల్లో కూడా నామినేషన్‌కు ముహూర్తం చూసుకోలేదు. 1999, 2000 ఎన్నికల్లో అయితే అమావాస్య రోజు దాఖలు చేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
నాలుగైదు ఏళ్ల క్రితం కోట్ల రూపాయలతో పెట్టిన ఆగ్రో ఫ్యాక్టరీని సైతం అమవాస్య రోజూ ఆరంభించారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన అల్లుడు, నందిపైప్స్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తాము ఏ విషయంలోనూ ముహూర్తాల గురించి ఆలోచించమన్నారు. ఆ రోజుకు ఏ పని పూర్తి అయి ఉంటుందో దానిని ఆరంభిస్తామని తెలిపారు. ప్రతి అభ్యర్థి కూడా మంచి ముహూర్తం చూసుకునే నామినేషన్లు దాఖలు చేస్తారని, అలా అని వారిలో ఒక్కరే గెలుస్తారు తప్పితే అందరు కాదు కదా అని తెలిపారు. తాము ముహూర్తాలకు వ్యతిరేకం కాదని, అలా అని అనుకూలం కూడా కాదన్నారు. ఈ సారి మాత్రం ముహూర్తాన్ని పరిశీలించే ఈ నెల 16వ తేదీన వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.