నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే
‘‘ఒకే రకం సినిమాలు చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. నా తొలి సినిమా ‘లక్ష్యం’ నుంచి ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలను గమనిస్తే ఆడియన్స్‌కు ఆ విషయం అర్థం అవుతుంది. కొత్త కాన్సెప్ట్‌తో డిఫరెంట్ సినిమాలు తీయడానికి ఇష్టపడుతుంటాను’’ అన్నారు దర్శకుడు శ్రీవాస్. బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ‘సాక్ష్యం’. ఈ శుక్రవారం రిలీజైన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా శ్రీవాస్ పంచుకున్న విశేషాలు...
► సినిమాకు మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. ఆడియన్స్ కొత్త ఫీల్‌ని ఎంజాయ్ చేశాం అని చెబుతున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలు, యాక్షన్ దృశ్యాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మూవీ ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. ‘సాక్ష్యం’ సినిమా కాన్సెప్ట్ ఇదివరకు వచ్చిందా అనే విషయంపై బాగా పరిశోధన చేశా. రాలేదని నిర్థారించుకున్న తర్వాతే తెరకెక్కించడం జరిగింది.
► బెల్లంకొండ శ్రీనివాస్ చాలా కష్టపడ్డాడు. రిస్క్ చేసి యాక్షన్ సన్నివేశాలు కసిగా చేశాడు. సినిమా చూసిన తర్వాత శ్రీనివాస్ తల్లిగారు భావోద్వేగానికి లోనై ‘నా కొడుకును నిలబెట్టావు’ అని హ్యాపీ ఫీలయ్యారు. అదే ఈ సినిమాకు నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్.
► పూజా హెగ్డే బాగా నటించింది. సాయి మాధవ్ బుర్రా సూపర్ డైలాగ్స్ రాశారు. హర్షవర్థన్ రామేశ్వర్ మంచి సంగీతం ఇచ్చారు.
► పెద్ద హీరోలతో ఇలాంటి సినిమాలు అంటే ఫ్యాన్స్‌తో అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. సినిమా మొత్తం మా హీరోనే ఉండాలి. మా హీరో ఇలానే ఉండాలి అని కోరుకుంటుంటారు. అయినా ఈ సినిమాకి పెద్ద హీరోల కోసం ట్రై చేయలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగా నటించాడు. ఏ అరుపులు, గోలలు లేని థియేటర్స్‌కి ఫ్యామిలీతో వెళ్లి చూడండి. కచ్చితంగా సినిమాకు మరింత కనెక్ట్ అవుతారు.
► ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు అనుకుని చిత్రీకరించినవి కావు. ఓ సెంటిమెంట్ ప్రకారం చేశాం. ప్రకృతి పగ పట్టాలంటే జరగకూడని సంఘటనలు జరగాలి. విలన్స్ ఎంత క్రూరంగా ఉంటే ప్రకృతి ఆ లెవల్లో పగ తీర్చుకుంటుందనేదే కాన్సెప్ట్. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే వయొలెన్స్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం అసలు ఫైట్స్ అవసరం లేని కథ ఒకటి నా దగ్గర ఉంది. ఈ కథతో తప్పకుండా సినిమా తీస్తా.