యుద్ధనేరాల కేసులో బంగ్లా ఎంపీకి ఉరిశిక్ష
ఢాకా: బంగ్లాదేశ్ యుద్ధనేరాల కేసులో విపక్షమైన బంగ్లా నేషనల్ పార్టీ (బీఎన్పీ) ఎంపీ సలావుద్దీన్ ఖాదర్ చౌదరికి ఉరిశిక్ష విధిస్తూ బంగ్లా యుద్ధనేరాల ప్రత్యేక ట్రిబ్యునల్ మంగళవారం తీర్పునిచ్చింది. యుద్ధనేరాల కేసులో ప్రధాన ప్రతిపక్షమైన బీఎన్పీ ఎంపీ ఒకరికి ట్రిబ్యునల్ మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారి. కాగా, యుద్ధనేరాల కేసులో మరణశిక్ష పడిన వారిలో చౌద రి (65) ఏడో వ్యక్తి. పాక్‌తో బంగ్లా విమోచన పోరాటం జరిగిన సమయంలో అత్యాచారం, హింస, హత్య, మానవ హననం వంటి నేరాల్లో చౌదరిని కోర్టు దోషిగా నిర్ధారించింది. తీర్పు వెలువడిన వెంటనే రాజధాని ఢాకా, చౌదరి స్వస్థలం చిట్టగాంగ్‌లో బీఎన్పీ కార్యకర్తలు హింసాత్మక నిరసనలకు దిగారు.