sales centers
-
ఒమిక్రాన్ భయంతో సెల్ఫ్ టెస్ట్.. సేల్స్‌కు బూస్ట్!
సాక్షి హైదరాబాద్: నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం, ఒమిక్రాన్ భయం నేపథ్యంలో కోవిడ్ పరీక్షలకు డిమాండ్ ఊపందుకుంటోంది. కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న సెల్ఫ్ టెస్ట్ కిట్ల మార్కెట్ ఇటీవల పుంజుకుంటున్నట్టు విక్రయదారులు చెబుతున్నారు. స్వీయ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో వీటికి డిమాండ్ పెరిగింది. ఇన్నాళ్లూ ఆన్లైన్ సహా పలు మార్గాల్లో అందుబాటులో ఉన్నా ఇటీవల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో వీటికి అంతగా ఆదరణ లేకుండా పోయింది. తాజాగా కరోనా విజృంభణ నేపథ్యంలో వీటికి మళ్లీ డిమాండ్ ఏర్పడింది. పెరిగిన బ్రాండెడ్ కిట్ల విక్రయాలు మార్కెట్లో పలు దేశ విదేశీ కిట్లు ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ కోవి సెల్ఫ్, కోవి ఫైండ్, ప్యాన్ బయో తదితర 7 సెల్ఫ్ టెస్టింగ్ కిట్స్‌ను ఆమోదించింది. వీటి ధరలు రూ.250 నుంచి రూ.350 మధ్యన ఉంటున్నాయి. కొంత కాలంగా ఆన్లైన్లో తమ ఉత్పత్తి అందుబాటులో ఉన్నా ఇటీవల విక్రయాలు గణనీయంగా పెరిగాయని కోవిసెల్ఫ్ హోమ్ టెస్టింగ్ కిట్ అందిస్తున్న సంస్థ ప్రతినిధులు చెప్పారు. గత నాలుగు రోజులుగా తాము 5 నుంచి 8 కిట్ల దాకా విక్రయిస్తున్నామని ఓ మెడికల్ షాప్ యజమాని జయత్లాల్ వెల్లడించారు. ఆఫీసులకు వచ్చి పని చేసే ఉద్యోగులకు కార్పొరేట్ ఆఫీసులు ఈ కిట్స్‌ను తప్పనిసరి చేయడం వల్ల కూడా ఈ డిమాండ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ర్యాపిడ్.. డౌట్ కొన్ని నిమిషాల్లోనే ఫలితాన్ని అందించే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ అందుబాటులో ఉన్నా వీటి సమర్థతపై సందేహాలున్నాయి. శరీరంలో కరోనా ప్రవేశించిన తర్వాత వాటిపై దండయాత్ర చేయడానికి యాంటీబాడీస్ ఉత్పత్తి అయిన తర్వాత మాత్రమే యాంటిజెన్ పరీక్షలను సమర్థంగా పసిగట్టగలుగుతుందని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు చెందిన సందీప్ చెప్పారు. సుమారుగా వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మాత్రమే ఇవి ఫలితాన్ని వెల్లడించగలవన్నారు. అంతలోపే మనం ఇతరులతో కలిసే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పూర్తిగా వీటిపై ఆధారపడడం అనేది సరైంది కాదన్నారు. లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్.. లేదంటే యాంటిజెన్ అందుబాటులో ఉన్న యాంటిజెన్ బేస్డ్ కిట్ల సాధికారత 65 శాతం వరకే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకని పూర్తిగా వాటి మీద ఆధారపడలేం. అలాగని వృథా అని కూడా అనలేం. లక్షణాలు బాగా ఉంటే ఆర్టీపీసీఆర్, స్వల్పంగా లేదా అనుమానం మాత్రమే ఉంటే యాంటిజెన్ టెస్ట్. .ఇలా ఎంచుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు వైద్యులు. స్వీయపరీక్షల ద్వారా వచ్చిన నెగిటివ్ రిపోర్ట్‌ను కచ్చితమైన ఫలితంగా భావించకున్నా వేగంగా అప్రమత్తం చేయడంలో సెల్ఫ్ టెస్ట్ కిట్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. విక్రయాలు పెరిగాయి.. పెరుగుతున్న కేసులు, ఓమిక్రాన్ భయాల మధ్య మా వెబ్సైట్ ద్వారా విక్రయిస్తున్న కోవిసెల్ఫ్ హోమ్ టెస్టింగ్ కిట్‌కు ఒక్కసారిగా 4.5 రెట్లు డిమాండ్ పెరిగింది. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. – ఎం.డి. హస్ముఖ్ రావల్, మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ -
పేదలకందని రాయితీ ఉల్లి
- ఇబ్బంది పడుతున్న జనం - గ్రామాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి రామాయంపేట: అమాంతం పెరిగిపోతున్న ఉల్లి ధరతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న వారికి రాయితీపై ఉల్లి సరఫరా చేస్తోంది. అయితే పేదలు ఎక్కువగా ఉండే పల్లెలపై దృష్టి పెట్టడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న ఉల్లి ధరను నియంత్రించడంలో ప్రభుత్వాలు, అధికారులు విఫలమవుతున్నారని జనం మండిపడుతున్నారు. పట్టణ ప్రజలకు మాత్రమే రాయితీపై ఉల్లి విక్రయించడం సరికాదని పల్లె ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతోంది. చిన్న రకం అయితే ఈ ధర. వ్యాపారం తగ్గింది ఉల్లి ధర ఆకాశాన్ని అం టుతుండడంతో వ్యాపా రం పూర్తిగా పడిపోయిం ది. చాలా మంది ఉల్లి కొనడమే మానేశారు. ఐ దారు కిలోలు కొనుగోలు చేసే వారు ప్రసు్తతం కిలోతో సరిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే చ ర్యలు తీసుకొని ఉల్లి ధరలు త గ్గించాలి. - సంతోష్, వ్యాపారి, రామాయంపేట రాయితీ ప్రకటనలకే పరిమితం రాయితీపై ఉల్లి సరాఫరా చేస్తామన్న ప్రభుత్వ హామీ ప్రకటనలకే పరిమితమైంది. పట్టణ ప్రజలకు మాత్రమే రాయితీ సదుపాయం కల్పిం చారు. గ్రామీణ ప్రాంత ప్రజలను మరి చారు. ఈ విధానం సరికాదు. గ్రామాల్లో కూడా ఉల్లి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. - బాలమణి, లక్ష్మాపూర్ గ్రామాల్లో ఉల్లి కేంద్రాలు ఏర్పాటు చేయాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి కొనాలంటే భయమేస్తోంది. కిలో రూ. 60 ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రాయితీ సదుపా యం పట్టణాలకే పరిమితమైంది. గ్రామీణ ప్రజలను పట్టించుకోకపోవడం దారుణం. వెంటనే గ్రామాల్లో కూడా ఉల్లి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. - గుర్రాల నాగులు, తిప్పనగుల్ల -
బియ్యం ధరలు పైపైకి...
సరిపోని రేషన్ బియ్యం - జాడలేని ప్రభుత్వ సన్నరకం విక్రయ కేంద్రాలు - ప్రైవేటు దుకాణాల్లో ఇష్టారాజ్యంగా ధరలు - సామాన్యులకు తప్పని కష్టాలు లక్సెట్టిపేట : బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. జిల్లాలో ప్రధాన పంటగా వరి పండిస్తున్నా బియ్యం ధరలు మాత్రం రోజురోజుకు పైపైకి ఎగబాకుతున్నాయి. వాటి ధర వింటేనే.. పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ధరల పుణ్యమా అని వారు మూడు పూటలా అన్నం తినే పరిస్థితి లేకుండాపోయింది. అన్నం తప్పనిసరి.. జిల్లా ప్రజల్లో మూడు పూటలా అన్నం తినేవారి సంఖ్యే ఎక్కువ. జొన్న రొట్టె, చపాతితోపాటు అన్నం కచ్చితంగా ఉండాల్సిందే. అన్నంకు ఇక్కడి ప్రజలు అంతగా ప్రాధాన్యమిస్తారు. ఇంట్లో కూరలేమి లేకపోయినా వేడి అన్నంలో కాస్త ఊరగాయ వేసుకుని పెరుగుతో భోజనం ముగించి, తమతమ పనులకు వెళ్తుంటారు. అయితే పెరిగిన బియ్యం ధరలతో కడుపునిండా అన్నం తినే పరిస్థితి పేద, మధ్యతరగతి ప్రజలకు లేకుండా పోయింది. రోజూ దొడ్డు బియ్యం తింటూనే బంధువులు వస్తే సన్నబియ్యం వండిపెట్టేవారు ప్రస్తుత ధరలతో బెంబేలెత్తుతున్నారు. అయితే వీరి అవసరం.. బియ్యం వ్యాపారులకు వరంగా మారింది. కొందరు ఇష్టారాజ్యంగా దొడ్డు, సన్నరకం బియ్యం ధరలు పెంచేసి అందినంత దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. సరిపోని రేషన్ బియ్యం.. ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డు ద్వారా నెలకు ఒక వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున అందించే బియ్యం పక్షం రోజులకే సరిపోతున్నాయి. దీంతో మిగతా రోజుల గాసానికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు దుకాణాలు, రైస్డిపోల నుంచి బియ్యం కొనాల్సిన పరిస్థితి. మార్కెట్లో కిలో దొడ్డు రకం బియ్యం ధర రూ.16 ఉండగా.. సన్నరకాల ధర రూ.40 పైనే ఉంది. అటు అధిక ధరలకు బియ్యం కొనలేక.. ఇటు రేషన్ బియ్యం సరిపోక పేద, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గత్యంతరం లేక ఉన్నవాటిలో కాస్త తక్కువ ధరకు లభించే బియ్యాన్ని కొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సన్నరకం బియ్యం కేంద్రాలేవీ..? సామాన్యులు సైతం సన్నరకం బియ్యం తినాలనే లక్ష్యంతో ప్రభుతం కొన్ని నెలల క్రితం సన్నరకం బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించింది. అధికారులు ఎంపిక చేసిన పట్టణాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో తెల్లరేషన్ కార్డుదారులకు రూ.29లకు కిలో బియ్యం చొప్పున విక్రయించింది. ఈ కేంద్రాల ఏర్పాటుతో సన్నరకం బియ్యం తినగలమనే ధీమా పేద, మధ్యతరగతి ప్రజల్లో కలిగింది. అయితే ఈ కేంద్రాలను ప్రారంభించిన నెల రోజులకే ఎత్తివేయడంతో పేదలకు నిరాశే మిగిలింది. రేషన్ బియ్యం సరిపోక.. బహిరంగ మార్కెట్లో సన్నరకం బియ్యం కొనుగోలు చేయలేక నానా అవస్థలు పడుతున్నారు. పుట్టగొడుగుల్లా బియ్యం దుకాణాలు మండల కేంద్రంలో బియ్యం దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. రోజురోజుకు బియ్యం దుకాణాల సంఖ్య పెరుగుతోంది. కొందరు వ్యాపారులు సన్నబియ్యం పేరుతో దొడ్డు బియ్యం అమ్ముతూ పేదలను దోచుకుంటున్నారు. మరికొందరు నాసిరకం, పురుగులు ఉన్నవి అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యం ధరలను నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.