సాక్షి హైదరాబాద్: నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం, ఒమిక్రాన్ భయం నేపథ్యంలో కోవిడ్ పరీక్షలకు డిమాండ్ ఊపందుకుంటోంది. కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న సెల్ఫ్ టెస్ట్ కిట్‌ల మార్కెట్ ఇటీవల పుంజుకుంటున్నట్టు విక్రయదారులు చెబుతున్నారు. స్వీయ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో వీటికి డిమాండ్ పెరిగింది. ఇన్నాళ్లూ ఆన్‌లైన్ సహా పలు మార్గాల్లో అందుబాటులో ఉన్నా ఇటీవల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో వీటికి అంతగా ఆదరణ లేకుండా పోయింది. తాజాగా కరోనా విజృంభణ నేపథ్యంలో వీటికి మళ్లీ డిమాండ్ ఏర్పడింది.
పెరిగిన బ్రాండెడ్ కిట్ల విక్రయాలు
మార్కెట్లో పలు దేశ విదేశీ కిట్లు ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ కోవి సెల్ఫ్, కోవి ఫైండ్, ప్యాన్ బయో తదితర 7 సెల్ఫ్ టెస్టింగ్ కిట్స్‌ను ఆమోదించింది. వీటి ధరలు రూ.250 నుంచి రూ.350 మధ్యన ఉంటున్నాయి. కొంత కాలంగా ఆన్‌లైన్‌లో తమ ఉత్పత్తి అందుబాటులో ఉన్నా ఇటీవల విక్రయాలు గణనీయంగా పెరిగాయని కోవిసెల్ఫ్ హోమ్ టెస్టింగ్ కిట్ అందిస్తున్న సంస్థ ప్రతినిధులు చెప్పారు. గత నాలుగు రోజులుగా తాము 5 నుంచి 8 కిట్‌ల దాకా విక్రయిస్తున్నామని ఓ మెడికల్ షాప్ యజమాని జయత్‌లాల్ వెల్లడించారు. ఆఫీసులకు వచ్చి పని చేసే ఉద్యోగులకు కార్పొరేట్ ఆఫీసులు ఈ కిట్స్‌ను తప్పనిసరి చేయడం వల్ల కూడా ఈ డిమాండ్ ఏర్పడిందని చెప్పవచ్చు.
ర్యాపిడ్.. డౌట్
కొన్ని నిమిషాల్లోనే ఫలితాన్ని అందించే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ అందుబాటులో ఉన్నా వీటి సమర్థతపై సందేహాలున్నాయి. శరీరంలో కరోనా ప్రవేశించిన తర్వాత వాటిపై దండయాత్ర చేయడానికి యాంటీబాడీస్ ఉత్పత్తి అయిన తర్వాత మాత్రమే యాంటిజెన్ పరీక్షలను సమర్థంగా పసిగట్టగలుగుతుందని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు చెందిన సందీప్ చెప్పారు. సుమారుగా వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మాత్రమే ఇవి ఫలితాన్ని వెల్లడించగలవన్నారు. అంతలోపే మనం ఇతరులతో కలిసే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పూర్తిగా వీటిపై ఆధారపడడం అనేది సరైంది కాదన్నారు.
లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్.. లేదంటే యాంటిజెన్
అందుబాటులో ఉన్న యాంటిజెన్ బేస్డ్ కిట్ల సాధికారత 65 శాతం వరకే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకని పూర్తిగా వాటి మీద ఆధారపడలేం. అలాగని వృథా అని కూడా అనలేం. లక్షణాలు బాగా ఉంటే ఆర్టీపీసీఆర్, స్వల్పంగా లేదా అనుమానం మాత్రమే ఉంటే యాంటిజెన్ టెస్ట్. .ఇలా ఎంచుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు వైద్యులు. స్వీయపరీక్షల ద్వారా వచ్చిన నెగిటివ్ రిపోర్ట్‌ను కచ్చితమైన ఫలితంగా భావించకున్నా వేగంగా అప్రమత్తం చేయడంలో సెల్ఫ్ టెస్ట్ కిట్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
విక్రయాలు పెరిగాయి..
పెరుగుతున్న కేసులు, ఓమిక్రాన్ భయాల మధ్య మా వెబ్‌సైట్ ద్వారా విక్రయిస్తున్న కోవిసెల్ఫ్ హోమ్ టెస్టింగ్ కిట్‌కు ఒక్కసారిగా 4.5 రెట్లు డిమాండ్ పెరిగింది. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి.
– ఎం.డి. హస్‌ముఖ్ రావల్, మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్
Comments
Please login to add a commentAdd a comment