రాజకీయం రచ్చ రచ్చ (2013)
=ఇటు గ్రూపుల కొట్లాట, అటు సమైక్య సెగ
=జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ కుదేలు
= 2013 జిల్లా పొలిటికల్ స్కానింగ్
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : ఈ ఏడాది చివరి ఆరు మాసాలు జిల్లాలో కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీల ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు రాజకీయ భవితవ్యం మీద గుబులు పుట్టించింది. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా రగులుతున్న గ్రూపు వివాదాలు బట్టబయలయ్యాయి. దాడి వీరభద్రరావు కు టుంబం పార్టీని వీడగా, మరో ముఖ్య నేత అయ్యన్న పాత్రుడు తీవ్ర అసంతృప్తిలో పడ్డారు. రాబోయే ఏడాదిలో వలసలకు అధికార పార్టీ నేతలు ఈ ఏడాదిలోనే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం ఫలితంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలవలేమనే నిర్ణయానికి వచ్చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ఏడాదిలో ప్రజా ఉద్యమాలను జోరుగా నడిపారు.. సమైక్యాంధ్రకు మద్దతుగా నిరంతరం ఆందోళనలు నిర్వహించారు. మొత్తంగా ఈ ఏడాది కాంగ్రెస్‌కు పూర్తిగాను, టీడీపీకి కొంత మేరకు రాజ కీయ భయం పుట్టించగా, వైఎస్ఆర్సీపీకి మాత్రం రెట్టిం చిన ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ ఏడాది జిల్లాలో జరిగిన ముఖ్యమైన రాజకీయ మార్పులపై సాక్షి స్కానింగ్.
కాంగ్రెస్...నేతల భవితవ్యం అయోమయం
కాంగ్రెస్ పార్టీలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, బాలరాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా రాజకీయ వైరం ప్రారంభమైంది. సమైక్యాంధ్ర ఉద్యమ పరిణామక్రమంలో ఈ గొడవలు మరింత తీవ్రమయ్యాయి. జిల్లాలో పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. మంత్రి బాలరాజు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మీద సైతం యుద్ధానికి కాలుదువ్వినా మళ్లీ తన తీరు మార్చుకున్నారు. ఇక కేంద్ర మంత్రి పురందేశ్వరి, ఎంపీ సుబ్బరామిరెడ్డి, మంత్రులు బాలరాజు, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్‌తో పాటు ఇతర పార్టీల్లో బెర్తులు దొరక్కుండా కాంగ్రెస్‌లోనే కొనసాగే ఆలోచనలో ఉన్న ప్రజాప్రతినిధులకు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది.
ఈ సెగకు తట్టుకోలేక మంత్రి గంటాతో పాటు శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, కన్నబాబురాజు జెండా మార్చేసే నిర్ణయానికి వచ్చారు. అయితే పార్టీ మారినా తమకందరికీ ఎక్కడో ఒక చోట పోటీచేసేందుకు చోటు దొరుకుతుందా? అన్న భయం మాత్రం వారిని వెంటాడుతోంది. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని జనాన్ని నమ్మించే ప్ర యత్నం చేసినా ఉత్తుత్తి రాజీనామాలు, నేరుగా ఉద్యమంలో పాల్గొనలేక పోయిన తీరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు శరాఘాతంగా మారే ప్రమాదం లేకపోలేదు. విశాఖ నగర అధ్యక్షుడిగా బెహరా భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడిగా కరణం ధర్మశ్రీ, పీసీసీ ప్రధాన కార్యదర్శులుగా రెహమాన్, పులుసు జనార్ధన్లకు ఈ ఏడాదిలో పదవులు వరించినా రాజకీయంగా మనశ్శాంతి మాత్రం లేకుండా పోయింది.
ఈ నెల 25వ తేదీ జరిగిన మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారై వివాహ వేదిక కొత్త ఏడాదిలో కాంగ్రెస్, టీడీపీలో జరగబోయే రాజకీయ మార్పులను కళ్లకు కట్టించింది. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను బతిమలాడి బరిలోకి దించాల్సిన పరిస్థితిలో పడింది. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా పంచాయతీ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది.
‘దేశం’...వలసల భయం
చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్రను ఏప్రిల్ 27న విశాఖలోనే ముగించారు. ఈ యాత్ర ముగిసీ ముగియక ముందే పార్టీ సీనియర్ నేత దాడివీరభద్రరావు, ఆయన కుమారుడు రత్నాకర్ చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చారు. వీరిద్దరూ వైఎస్ఆర్సీపీలోకి వెళ్లడంతో అనకాపల్లి నియోజక వర్గానికి టీడీపీ ఇప్పటి దాకా ఇన్‌చార్జ్‌ను నియమించుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పాయకరావుపేట, ఎలమంచిలి నియోజక వర్గాలకు అనిత, సుందరపు విజయ్‌కుమార్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమించడం ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. రెండు నియోజక వర్గాల్లో పట్టున్న విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుటుంబం దాదాపుగా పార్టీకి దూరమైంది.
ఈ షాక్‌తో పాడేరు, భీమిలి, అనకాపల్లి, గాజువాక నియోజక వర్గాలకు ఇన్‌చార్జ్‌లను ప్రకటించేందుకు చంద్రబాబు ధైర్యం చేయలేక పోతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో చంద్రబాబు ఆడిన రెండు కళ్ల సిద్ధాంతం నాటకం తమ కొంప ముంచుతుందనే భయం పార్టీ నేతలను ఆవహించింది. దీనికి తోడు కాంగ్రెస్ నుంచి కొందరు వలస వచ్చి టికెట్లు ఎగరేసుకుపోయే సంకేతాలు కనిపిస్తుండడంతో అనేక మంది నేతలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. గంటా అండ్ గ్రూప్ రాకపై అయ్యన్న పాత్రుడు ఇప్పటికే చంద్రబాబు మీద ఎర్రజెండా లే పారు.
బీజేపీతో పొత్తు ఖరారైతే తన నియోజక వర్గం జారి పోతుందనే నిర్ణయానికి వచ్చిన నగరానికి చెందిన మరో ముఖ్య నేత పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల కారణంగా రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ? అనే విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా గ్యారంటీ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది జిల్లాలో చంద్రబాబు చేసి న పాదయాత్ర, రైతు చైతన్య సదస్సు, వరద ప్రాంతాల పర్యటనలేవీ ఎన్నికల్లో ఉపయోగపడే అవకాశాలు కని పించడం లేదని పార్టీ వర్గాలే గట్టిగా నమ్ముతున్నాయి. ఈ ఏడాదిలో మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు రూరల్ జిల్లా అధ్యక్ష పదవి దక్కింది.
వైఎస్సార్ సీపీ...ఉద్యమాల ‘ప్రస్థానం’
పార్టీ నాయకులు, శ్రేణులు ఈ ఏడాది మొత్తం ప్రజా ఉద్యమాల్లోనే గడిపారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది జూన్‌లో వైఎస్ షర్మిల జిల్లాలో నిర్వహించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం నింపింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కంటే పై చేయి సాధించింది. చొక్కాకుల వెంకటరావుకు ఈ ఏడాది జిల్లా రూరల్ కన్వీనర్ పదవి లభించింది. దాడి రత్నాకర్‌కు వెస్ట్ నియోజకవర్గ పగ్గాలు దక్కా యి. ఏడాది చివరిలో కొత్తపల్లి గీతకు అరకు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు దక్కాయి. కాగా బీజేపీ, సీపీఐలకు జిల్లాలో కూడా సమైక్య సెగ తగిలింది. ఈ రెండు పార్టీల నేతలు, శ్రేణులు స్థానికంగా కాస్త ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది.