Sandalwood logs
-
రూ.35 లక్షల విలువైన శ్రీగంధం దుంగల పట్టివేత
సూళ్లూరుపేట: భారీ మొత్తంలో శ్రీగంధం దుంగలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు పట్టుకున్నట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ వెల్లడించారు. ఒక లారీ, రెండు కార్లను స్వాధీనం చేసుకుని, 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. శ్రీగంధం దుంగలను తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, తడ, శ్రీహరికోట ఎస్ఐలు శ్రీనివాసులురెడ్డి, రోజాలత సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ కలిగిన లారీని తనిఖీ చేయగా 484 శ్రీగంధం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లారీకి పైలెట్లుగా వచ్చిన రెండు కార్లను కూడా పట్టుకున్నారు. గూడూరు మండలం చెన్నూరుకు చెందిన లారీ డ్రైవర్ తుపాకుల మునీంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా అనంతసాగరం మండలం రేవూరుకు చెందిన మోడిబోయిన మురళీకృష్ణ, దగదర్తి చింతోడు సెంటర్కు చెందిన ఉప్పు రామచంద్రయ్య, నెల్లూరు నగరం భక్తవత్సలనగర్కు చెందిన కర్నాటి మాలకొండయ్య, గూడూరు మండలం మిట్మాత్మకూరుకు చెందిన కర్రా పెంచలయ్య, వెంకటగిరి మండలం సిద్ధాగుంటకు చెందిన కనియపల్లి వెంకటరమణయ్య, పొదలకూరు మండలం వనంతోపునకు చెందిన నల్లు మణి, రాపూరు మండలం గోనుపల్లికి చెందిన వెలుగు అంకయ్య ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నారని వెల్లడించారు. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ ఏడుగురిని జిల్లాలో పలుచోట్ల గురువారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన శ్రీగంధం దుంగల విలువ సుమారు రూ.35 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. -
తుపాకీ గురిపెట్టి.. ఖరీదైన చెట్ల నరికివేత
భోపాల్ : జిల్లా జడ్జి నివాస ప్రాంగణంలో గురువారం అర్థరాత్రి దొంగలు హల్చల్ చేశారు. సెక్యూరిటీ సిబ్బంది కణతకు తుపాకీ గురిపెట్టి విలువైన నాలుగు గంధం చెట్లను నరుక్కెళ్లారు. మధ్యప్రదేశ్లోని రెవా జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటన గురించి ఎస్పీ శివేంద్ర సింగ్ శనివారం వెల్లడించారు. వివరాల ప్రకారం.. ఐదుగురి దొంగల ముఠాలో.. మొదటగా ఒక దొంగ గురువారం అర్ధరాత్రి న్యాయమూర్తి నివాస ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీస్ గార్డు బుధిలాల్ కోల్ కణతకు తుపాకీ పెట్టి బెదిరించి.. విషయం బయటకు రాకుండా చూసుకున్నాడు. దీంతో మిగతా నలుగురు దొంగలు లోపలికి ప్రవేశించి నాలుగు గంధం చెట్లను నరికి తీసుకెళ్లిపోయారు. చెట్ల విలువ మూడు నుంచి ఐదు లక్షల వరకు ఉంటుంది. ఈ క్రమంలో దొంగలు ఎవరికీ హాని తలపెట్టలేదు. దొంగతనం జరుగుతున్న సమయంలో జడ్జి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారని ఎస్పీ తెలిపారు. మరుసటి రోజు పోలీస్ గార్డు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, దొంగలు ఉత్తరప్రదేశ్లోని కనౌజ్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు కనౌజ్ ప్రాంతంలోని వ్యక్తులను రెవా పోలీసులు ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేశారు. ‘గంధం చెక్కను సువాసన ఇచ్చే పర్ఫ్యూమ్లలో, అగర్బత్తీలలో ఉపయోగిస్తారు. ఇలాంటి పరిశ్రమలు కనౌజ్ ప్రాంతంలో ఉన్నాయని, నిందితుల కోసం గాలిస్తున్నాం’అని ఎస్పీ తెలిపారు. -
శ్రీగంధం దుంగలు పట్టివేత
పెద్దతిప్పసముద్రం (చిత్తూరు) : కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న శ్రీగంధం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం గుండ్లపల్లి సమీపంలో శుక్రవారం పోలీసులు వాహన సోదాలు ప్రారంభించారు. అదే సమయంలో ఒక ద్విచక్ర వాహనంలో దాచి ఉంచిన 28 కిలోల శ్రీగంధం దుంగలను గుర్తించారు. వాహనంతోపాటు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ హృషికేశ్ తెలిపారు. -
రైల్వే కోడూరులో భారీగా ఎర్రచందనం స్వాధీనం
వైఎస్ఆర్ కడప జిల్లాలోని రైల్వే కోడూరులో పెట్రోల్ బంక్ సమీపంలో అరిటికాయల మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుత్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే మినీ లారీని కూడా స్టేషన్కు తరలించి సీజ్ చేసినట్లు వివరించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.