సూళ్లూరుపేట: భారీ మొత్తంలో శ్రీగంధం దుంగలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు పట్టుకున్నట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ వెల్లడించారు. ఒక లారీ, రెండు కార్లను స్వాధీనం చేసుకుని, 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. శ్రీగంధం దుంగలను తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, తడ, శ్రీహరికోట ఎస్‌ఐలు శ్రీనివాసులురెడ్డి, రోజాలత సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ కలిగిన లారీని తనిఖీ చేయగా 484 శ్రీగంధం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లారీకి పైలెట్లుగా వచ్చిన రెండు కార్లను కూడా పట్టుకున్నారు. గూడూరు మండలం చెన్నూరుకు చెందిన లారీ డ్రైవర్ తుపాకుల మునీంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా అనంతసాగరం మండలం రేవూరుకు చెందిన మోడిబోయిన మురళీకృష్ణ, దగదర్తి చింతోడు సెంటర్‌కు చెందిన ఉప్పు రామచంద్రయ్య, నెల్లూరు నగరం భక్తవత్సలనగర్‌కు చెందిన కర్నాటి మాలకొండయ్య, గూడూరు మండలం మిట్మాత్మకూరుకు చెందిన కర్రా పెంచలయ్య, వెంకటగిరి మండలం సిద్ధాగుంటకు చెందిన కనియపల్లి వెంకటరమణయ్య, పొదలకూరు మండలం వనంతోపునకు చెందిన నల్లు మణి, రాపూరు మండలం గోనుపల్లికి చెందిన వెలుగు అంకయ్య ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నారని వెల్లడించారు. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ ఏడుగురిని జిల్లాలో పలుచోట్ల గురువారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన శ్రీగంధం దుంగల విలువ సుమారు రూ.35 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment