ఆగని దందా | Sand danda in AP | Sakshi
Sakshi News home page

ఆగని దందా

Published Tue, May 2 2017 2:48 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

ఆగని దందా - Sakshi

ఆగని దందా

ఇసుక దందా ఆగడం లేదు. పోలీసుల మామూళ్లు ఆగడం లేదు. స్వర్ణముఖి, కాళంగి నదుల నుంచి ఇసుకను తరలిస్తూ స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. ఇది ఆంధ్రా–తమిళనాడు సరిహద్దు పోలీస్‌స్టేషన్లకు కూడా వరంగా మారింది.  తడ, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లా పరిధిలోని వరదయ్యపాళెం మండలాల్లో పలు ప్రాంతాలను డంపింగ్‌ కేంద్రాలుగా ఎంపిక చేసుకున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లలో తమిళనాడుకు ఇసుకను తరలిçస్తూ రూ.లక్షలు దోచుకుంటున్నారు.

సూళ్లూరుపేట : పగలంతా ట్రాక్టర్లు ద్వారా డంపింగ్‌ కేంద్రాలకు ఇసుక తరలించుకుంటున్నారు. రాత్రి 8 గంటలైతే చాలు జేసీబీలతో తమిళనాడుకు చెందిన లారీలకు లోడ్‌ చేసి ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలతోనే చిత్తూరుజిల్లా ఏర్పేడులో 16 మంది బలైన విషయం తెలిసిందే. తడ మండలం సరి«హద్దుల్లోని ఆరంబాకం, కారూరు, పూడి, మాంబట్టు అపాచీ వెనుక భాగాన టీడీపీ చోటా నాయకులే డంపింగ్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఎవరిదైనా ట్రాక్టరు పట్టుకుంటే చాలు టీడీపీ నేతలు అధికారులకు ఫోన్‌ చేసి మనోడే వదిలేయండి హుకుంజారీ చేస్తున్నారు. దీంతో అధికారులు కూడా తమకెందున్నట్గు వ్యవహరిస్తున్నారు. ఉచితంగా ఇసుక తీసుకోవచ్చుననే ప్రభుత్వ ప్రకటన అక్రమార్కులకు వరంగా మారింది. దీంతో పట్టపగలు పబ్లిగ్గానే ఇసుకను తరలిస్తున్నారు.

 తమిళనాడులో నిబంధనలు కఠినతరం
తమిళనాడులో ఎక్కడా ఇసుక తవ్వకూడదనే నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో ఆంధ్రా నుంచి వెళ్లే ఇసుక మీదే ఆధారపడి భవన నిర్మాణాలు చేస్తున్నారు. నాయుడుపేట, శ్రీకాళహస్తి, పెళ్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాల నుంచి శ్రీసిటీ, రామాపురం పేరుతో పగలూ రాత్రి తేడా లేకుండా సుమారు రోజుకు 400  ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్రా–తమిళనాడు సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో డంపింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి లారీల్లో ఇసుకను చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు తదితర పట్టణాలకు  రవాణా చేస్తున్నారు.

ఆంధ్రా ఇసుకకు డిమాండ్‌
జిల్లాలోని స్వర్ణముఖి, కాళంగి నది ఇసుకకు తమిళనాడులో డిమాండ్‌ ఉండటంతో అక్రమ రవాణా పెరిగిపోయింది. ఆంద్రా–తమిళనాడు సరిహద్దులోని ఆరంబాకంలో పెన్నా, స్వర్ణముఖి ఇసుక టన్ను రూ.450 నుంచి  రూ.500  కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు 6 నుంచి 8 టన్నుల దాకా లోడ్‌ చేసుకుని వెళుతున్నారు. చెరకు రవాణా చేస్తే ట్రాలీలో అయితే 20 టన్నుల ఇసుకను లోడ్‌ చేసుకుని వెళుతున్నారు. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి నగరాల్లో ఒక్క లారీ ఇసుక రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు పలుకుతోంది. దీంతో తమిళనాడుకు చెందిన వ్యక్తులు కొంతమంది సూళ్లూరుపేట, వరదయ్యపాళెం మండలాల సరి«హద్దులోని సంతవేలూరు రోడ్డు సమీపంలోని మంగళంపాడు చెరువుకు సమీపంలో రెండు డంపింగ్‌ కేంద్రాల నుంచి లారీలతో ఇసుకను తరలిస్తున్నారు.

మామూళ్లు మత్తులో జోగుతున్న పోలీసులు
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన పోలీస్‌ చెక్‌పోస్టులను ఎత్తేశారు. ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించినపుడు తొలుత తడ పోలీస్‌స్టేషన్‌ ముందు తనిఖీ పాయింట్‌ ఏర్పాటు చేశారు. ఆ తరువాత తడ మండలం పన్నంగాడు వద్ద ఏఆర్‌ పోలీసులు, స్థానిక పోలీసులను మమేకం చేసి నిఘా ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టు పెట్టిన కొద్ది రోజులు అందరూ భయంగానే వ్యవహరించారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు తడ, సూళ్లూరుపేట పోలీసులతో మాట్లాడుకుని నెల మామూళ్లు ఏర్పాటు చేసుకుని లారీలతో రవాణా చేయడం ప్రారంభించారు. రవాణాలో పోలీసులే కొంత వెసులుబాటు కల్పిస్తూ రావడంతో నాయుడుపేట, వాకాడు, కోట, పెళ్లకూరు, సూళ్లూరుపేట, తడ నుంచి ట్రాక్టర్లు ద్వారా శ్రీసిటీ పేరుతో ఆరంబాకం దాకా ఇసుక తరలించడం ప్రారంభించారు. ఆ తరువాత నెమ్మదిగా తెలుగు తమ్ముళ్ల జోక్యం పెరిగింది.

ఇదే అదునుగా చేసుకున్న పోలీసులు సరిహద్దు చెక్‌పోస్టును నెమ్మదిగా ఎత్తేశారు. ఒక ట్రాక్టర్‌కు నెలకు దొరవారిసత్రం పోలీస్‌స్టేషన్, సూళ్లూరుపేట పోలీస్‌స్టేసన్‌లో రూ.3,200 లెక్కన మామూళ్లు ఏర్పాటు చేసుకున్నారు. తడ పోలీస్‌స్టేషన్‌లో నెలకు రూ.5,200 లెక్కన నెలకు సుమారుగా 300 నుంచి 350 ట్రాక్టర్ల వరకు నెల మామూళ్లు చెల్లిస్తున్నారు. తడ చెక్‌పోస్టులో ఒక ట్రాక్టర్‌కు నెలకు రూ.5వేలు లెక్కన వసూలు చేస్తున్నారు. ఈ మొత్తంలో ఎవరి వాటా ఎంత అనేది సూళ్లూరుపేట సీఐ, తడ ఎస్సైలకే తెలియాలి. ఇదే తరహాలో ఇసుక అక్రమ రవాణా జరిగితే  స్వర్ణముఖి, కాళంగి నదుల్లో ఇసుక కనుమరుగైపోయి భవిష్యత్తులో భూగర్భజలమట్టం భారీగా పడిపోయే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement